Share News

ఈసారైనా పెరిగేనా?

ABN , Publish Date - Nov 25 , 2024 | 01:12 AM

గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరు నమోదుకు స్పందన కరువైంది. గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు, ఆసక్తి చూపడం లేదు. నమోదు శాతం తక్కువగా ఉండడంతో ఎన్నికల కమిషన్‌ మరో అవకాశాన్ని కల్పించింది.

  ఈసారైనా పెరిగేనా?

- ఎమ్మెల్సీ ఓటుర్లుగా నమోదుకు మరో అవకాశం

- జిల్లాలో ఆసక్తి చూపని పట్టభద్రులు

- టీచర్లలో నామమాత్రపు స్పందన

- ఎమ్మెల్సీ డ్రాప్ట్‌ నోటిఫికేషన్‌ జారీ

- డిసెంబరు 9 వరకు నమోదు గడువు పొడిగింపు

- జిల్లాలో ఇప్పటివరకు నమోదైన ఓటర్లు 21,092 మంది

- పట్టభద్రులు 20,274 మంది, టీచర్లు 818 మంది

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరు నమోదుకు స్పందన కరువైంది. గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు, ఆసక్తి చూపడం లేదు. నమోదు శాతం తక్కువగా ఉండడంతో ఎన్నికల కమిషన్‌ మరో అవకాశాన్ని కల్పించింది. డిసెంబరు 9 వరకు ఓటరు నమోదుకు అవకాశం ఉండడంతో అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఓటరు నమోదుకు ఎమ్మెల్సీ ఎన్నికల ఆశావహులు శిబిరాలు ఏర్పాటు చేసినా ఆశించిన మేరకు ఫలితం కనిపించలేదు. రెండో విడతనైనా నమోదు పెరుగుతుందని ఆశావహులు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ డ్రాఫ్ట్‌ నోటిపికేషన్‌ ప్రకారం జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ రెవెన్యూ డివిజన్‌లలో 21,092 మంది ఓటర్లుగా నమోదయ్యారు. వీరిలో ఉపాధ్యాయ నమోదులో వేములవాడ డివిజన్‌లో 290 మంది నమోదు చేసుకున్నారు. పురుషులు 201 మంది, మహిళలు 89 మంది ఉన్నారు. గ్రాడ్యుయేట్లలో 8164 మంది నమోదవగా పురుషులు 5004 మంది, మహిళలు 3160 మంది ఉన్నారు. సిరిసిల్ల డివిజన్‌లో 528 మంది నమోదవగా పురుషులు 386 మంది, మహిళలు 142 మంది ఉన్నారు. గ్రాడ్యుయేట్లలో 12,110 ంది నమోదవగా పురుషులు 7550 మంది మహిళలు 4560 మంది ఉన్నారు. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ పదవీకాలం పూర్తయ్యేలోగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఎమ్మెల్సీల కోసం ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకోసం 2021లోపు గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసుకున్న వారికి ఓటరు నమోదుకు అవకాశం కల్పిస్తూ షెడ్యూల్‌ జారీ చేసింది. నవంబరు 6లోగా నమోదు గడువు ముగిసింది. డిసెంబరు 30న ఓటరు తుది జాబితా విడుదల చేయనుంది. ముందుగా ఓటరు ముసాయిదాను విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలను డిసెంబరు 9 వరకు స్వీకరించి 25 వరకు పరిష్కరించనున్నారు. ఇదే క్రమంలో డిసెంబరు 9 వరకు 2021 అక్టోబరు 31 నాటికి డిగ్రీ పూర్తయిన పట్టభద్రులు ఫారం 18 ద్వారా ఓటు నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారుు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌ ద్వారా కూడా ఓటు నమోదు చేసుకునే అవకాశం ఇచ్చారు. మొదటి విడత అవకాశంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ డివిజన్లలో గ్రాడ్యుయేట్లు ఆసక్తి చూప లేదు. జిల్లాలో సాధారణ ఎన్నికలకు సంబంధించి రెండు సెగ్మెంట్లలో 4 లక్షల 75 వేల 64 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,28,745 మంది మహిళలు 2,46,114 మంది ఉన్నారు. వేములవాడ సెగ్మెంట్‌లో 2,27,575 మంది ఓటర్లు, సిరిసిల్ల సెగ్మెంట్‌లో 2,47,489 మంది ఉన్నారు. ఈ ఓటర్లలో జిల్లాలో దాదాపు లక్షకు పైగా గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ప్రస్తుతం ఓటరు నమోదు ఎమ్మెల్సీకి సంబంధించి తక్కువగానే నమోదయ్యారు. సిరిసిల్ల, వేములవాడ డివిజన్లలో గ్రాడ్యుయేషన్‌ ఓటర్లు 20,274 మంది నమోదయ్యారు. ఇందులో పురుషులు 12,554 మంది, మహిళలు 7720 మంది ఉన్నారు. ఉపాధ్యాయ ఓటరు నమోదును 818 మాత్రమే నమోదు చేసుకున్నారు. ఇందులో పురుషులు 587 మంది, మహిళలు 231 మంది ఉన్నారు. 2019 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామమాత్రంగానే గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఈసారి కొద్దిగా పెరిగినట్లు ఉన్నా పెరిగిన గ్రాడ్యుయేట్లు చాలా తక్కువని చెప్పుకోవచ్చు. 2019లో 10,584 మంది గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదవగా, ఓటింగ్‌లో 6054 మంది పాల్గొన్నారు. ఇందులో పురుషులు 4411 మంది, మహిళలు 1645 మంది ఓటు వేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదులో 783 మంది నమోదవగా 682 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 525 మంది, మహిళలు 157 మంది ఓటు వేశారు. ఆ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్‌ ఓటింగ్‌ శాతం 52.22 శాతం, ఉపాధ్యాయులు 87.10 శాతంగా నిలిచారు. ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచడానికి ఎన్నికల కమిషన్‌ మరో అవకాశాన్ని కల్పించింది.

ఎమ్మెల్సీ ఎన్నికలకు కనిపించని స్పందన...

ఎమ్మెల్సీ ఎన్నికలపై పట్టభద్రులు, ఉపాధ్యాయుల్లో నామామ్రాతంగానే స్పందన కనిపిస్తోంది. ఎన్నికలు అనగానే సందడి నెలకొంటుంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశావహల సందడి తప్ప ఓటర్ల ఆసక్తి కనిపించడం లేదు. 2019 మార్చిలో కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కూర రఘోత్తం రెడ్డి గెలుపొందారు. ఆశావహులు సిరిసిల్ల, వేములవాడ రెండు నియోజకవర్గాల్లో తిరుగుతున్నా ప్రధాన పార్టీల నుంచి ఆదరణ లభించడం లేదు. గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులు నియోజకవర్గాల్లో ఒంటరిగానే తిరుగుతూ గ్రాడ్యుయేట్ల నమోదుకు ప్రయత్నాలు చేశారు. గడువు పొడిగించడంతో ఆశావహులు ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ సెంటర్లను పొడిగించారు. మరోవైపు కొందరు గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా బరిలో నిలవడానికి సిద్ధపడి క్షేత్రస్థాయిలో ప్రచారాలు మొదలు పెట్టారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులు స్వచ్ఛంద సంస్థలు, అడ్వకేట్లు, డాక్టర్లు, పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న వారిని కలుస్తున్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Updated Date - Nov 25 , 2024 | 01:12 AM