Share News

కేటీఆర్‌కు భయమెందుకు?

ABN , Publish Date - Apr 03 , 2024 | 06:26 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తన ప్రమేయం లేకుంటే కేటీఆర్‌ ఎందుకు భయపడుతున్నారని మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. ఈ విషయానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో నియమితులైన అధికారులే లొంగిపోతున్నారని, దర్యాప్తు కొనసాగుతోందని, దోషులెవరో త్వరలోనే

కేటీఆర్‌కు భయమెందుకు?

ఫోన్‌ట్యాపింగ్‌లో ఆయన ప్రమేయమే

లేకపోతే అంత కలవరం దేనికి?

నోటీసులిస్తే జవాబిచ్చేందుకు సిద్ధం

జైలులో ఉన్న కవిత రుద్రాక్షమాల

కావాలని అడుగుతున్నారు

పదేళ్లలో ఆమె మెడలో

తాళి బొట్టు ఎన్నడూ చూడలేదు

జైలుకు వెళ్లాక తాళి గుర్తుకొచ్చిందా?

మంత్రి కొండా సురేఖ విమర్శలు

అసలు మీకు పరువు ఉందా?

ట్యాపింగ్‌ దేశద్రోహం.. పోలీసులను

ప్రైవేటు సైన్యంలా మార్చుకున్నారు

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి

వరంగల్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తన ప్రమేయం లేకుంటే కేటీఆర్‌ ఎందుకు భయపడుతున్నారని మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. ఈ విషయానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో నియమితులైన అధికారులే లొంగిపోతున్నారని, దర్యాప్తు కొనసాగుతోందని, దోషులెవరో త్వరలోనే తెలుస్తుందన్నారు. కేటీఆర్‌ ఏ నోటీసులు పంపించినా సమాధానం ఇస్తామని తెలిపారు. మంగళవారం హన్మకొండలో కొండా సురేఖ మాట్లాడారు. సీఎం రేవంత్‌ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటూ.. ‘మీ నాన్న నేర్పిన భాషనే మాట్లాడుతున్నావు. మీ కుటుంబం నుంచే ఈ భాష మొదలైంది. మీ భాష మారకుంటే మీ భాషలోనే మీకు సమాధానం చెబు తాం’ అని హెచ్చరించారు. ఎన్నికల్లో ఓడిపోయిన ఒత్తిడిలో, చెల్లెలు జైలుకు పోయిన బాధలో కేటీఆర్‌ ఉన్నారని, ఆయన నీతులు చెబితే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. లిక్కర్‌ స్కాంలో జైలుకు వెళ్లిన కవిత.. రుద్రాక్షమాల కావాలని అడుగుతోందని, గత పదేళ్లలో ఎన్నడూ కవిత మెడలో తాళిబొట్టు చూడలేదని, జైలు కు వెళ్లగానే ఆమెకు తాళి బొట్టు గుర్తుకొచ్చిందా అని సురేఖ ప్రశ్నించారు. పదేళ్లుగా వారు చేసిన పాపాలే వారి మెడకు ఉచ్చులా చుట్టుకున్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే లోక్‌సభ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు గెలుచుకుంటామని, తెలంగాణలో బీజేపీని ప్రజలు ఆదరించరని మంత్రి సురేఖ పేర్కొన్నారు.

ఆ నైతిక హక్కు కేటీఆర్‌కు ఉందా?

‘ఫోన్‌ ట్యాపింగ్‌తో ఇప్పటికే రాష్ట్రం పరువు తీశారు. ఇంకా మీకు పరువు.. పరువు నష్టం దావా వేసే నైతిక హక్కు ఉన్నాయా?’ అంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి కేటీఆర్‌ను ప్రశ్నించారు. టెలిగ్రాఫ్‌ చట్టం ప్రకారం ఫోన్‌ ట్యాపింగ్‌ దేశ ద్రోహమని గుర్తు చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం మీడియాతో పార్టీ నేత కేకే మహేందర్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. కేసీఆర్‌, కేటీఆర్‌ల మాటలు పాతకాలం నాటి రాచరిక దర్బార్‌ను తలపిస్తున్నాయని, తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టినా వారికి సిగ్గు రావటం లేదన్నారు. పోలీసుల రూపంలో ఓ ప్రైవేటు సైన్యాన్ని పెంచి పోషించిన కేసీఆర్‌.. ఆ సైన్యంతోనే తన హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించారన్నారు. ఇప్పుడు ఆ సైన్యమే ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటపెడుతున్నా.. కేటీఆర్‌ ఇంకా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘కేటీఆర్‌కు తెలంగాణ ఉద్యమం గురించి తెలుసా? మేం ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు? తె లంగాణ ఉద్యమానికి ముందు కేటీఆర్‌ ఆస్తులు ఎన్ని.. ఇప్పుడు ఎన్ని? దీనిపై న్యాయపోరాటం చేద్దామా? అని సవాల్‌ విసిరారు. కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్‌ పరువు నష్టం దావాలకు భయపడేది లేదని, ఏ నోటీసులు ఇచ్చినా సిద్ధంగా ఉన్నామన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 06:26 AM