Share News

ఆ 32 కోట్లు ఎవరివి?

ABN , Publish Date - Apr 18 , 2024 | 04:30 AM

ఎన్నిక ఏదైనా.. ఓటు పడాలంటే నోటు పంచాల్సిందే! ప్రచారం నుంచి ప్రలోభం వరకూ అంతా పైసలతోనే! అభ్యర్థులు అడుగు బయటపెట్టాలంటే ఆర్థిక వనరులు దండిగా ఉండాల్సిందే! ఈ క్రమంలో ఎన్నికల సమయంలో

ఆ 32 కోట్లు ఎవరివి?

అసెంబ్లీ ఎన్నికల వేళ పట్టుబడిన నగదును ఎవరూ తీసుకెళ్లని వైనం

రూ.43 కోట్లలో తీసుకెళ్లింది 11 కోట్లే!

సొమ్మును కోర్టుకు సమర్పించిన అధికారులు

లెక్కలు చూపలేకే డబ్బును వదిలేశారా?

గత నెల రోజుల్లో రూ.14.30 కోట్లు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఎన్నిక ఏదైనా.. ఓటు పడాలంటే నోటు పంచాల్సిందే! ప్రచారం నుంచి ప్రలోభం వరకూ అంతా పైసలతోనే! అభ్యర్థులు అడుగు బయటపెట్టాలంటే ఆర్థిక వనరులు దండిగా ఉండాల్సిందే! ఈ క్రమంలో ఎన్నికల సమయంలో వేర్వేరు ప్రాంతాలకు డబ్బును తరలిస్తూ తనిఖీల్లో దొరికిపోతున్నారు. ఇందులో కొందరు అవసరమైన పత్రాలు చూపించి డబ్బును తీసుకెళ్తుండగా.. మరికొందరు భారీ మొత్తాలను కూడా వదిలేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌ జిల్లాలో పట్టుబడిన నగదులో అత్యధిక మొత్తం ఇప్పటికీ కోర్టు అధీనంలోనే ఉంది. ఎవరూ రాకపోవడంతో కేసులు నమోదు చేసి, కోర్టుకు సమర్పించినట్లు అధికారులు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.43.80 కోట్ల నగదు, రూ.3.77 కోట్ల విలువైన మద్యం, రూ.3.50 కోట్ల విలువైన గంజాయి, డ్రగ్స్‌, రూ.25.05 కోట్ల విలువైన బంగారం, వెండి, ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్న/నిల్వ చేసిన రూ.17.35 కోట్ల విలువైన వస్తువులు పట్టుబడ్డాయి. వీటిలో సింహభాగం బంగారం, వెండిని తీసుకెళ్లగా.. మెజారిటీ నగదు కోసం ఎవరూ రాకపోవడం గమనార్హం. రూ.43.80 కోట్లలో అవసరమైన పత్రాలు చూపించి కేవలం రూ.11 కోట్లు మాత్రమే తీసుకెళ్లారు. రూ.32 కోట్ల కోసం ఎవరూ రాకపోవడంతో కేసులు నమోదు చేసి, కోర్టుకు సమర్పించినట్లు ఓ అధికారి తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పుడు రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధం. అంతకంటే ఎక్కువ నగదు తీసుకెళ్తుంటే సంబంధిత పత్రాలు చూపించాలి. లేనిపక్షంలో నగదును తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకొని జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తారు. అక్కడి నుంచి డబ్బును డిస్ర్టిక్ట్‌ గ్రీవెన్స్‌ సెంటర్‌(డీజీసీ)కు పంపుతారు. తనిఖీ సమయంలో పత్రాలు చూపించలేని వారు అనంతరం డీజీసీలో వాటిని సమర్పించి నగదును తీసుకెళ్లవచ్చు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పట్టుబడిన నగదులో రూ.11 కోట్లను అలాగే తీసుకెళ్లారు. మరో రూ.32 కోట్ల కోసం ఎవరూ రాకపోవడంతో ఆ డబ్బు ఎన్నికల పంపిణీ కోసం తరలిస్తున్నదే అయి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నల్లధనం కావడం వల్లే సంబంధిత వ్యక్తులు తీసుకెళ్లేందుకు రాలేదని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పుడు రూ.14.31 కోట్లు..

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ మార్చి 16న విడుదలైంది. ఆ రోజు నుంచి నగరంలో తనిఖీలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు రూ.14.31 కోట్ల నగదు, రూ.2.13 కోట్ల విలువైన వస్తువులు, 20441 లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేశారు. 185 మందిపై కేసులు నమోదు చేసి 181 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రోస్‌ తెలిపారు. డీజీసీ నుంచి ఇప్పటి వరకు రూ.1.70 కోట్లు విడుదల చేశారు. మరో రూ.69 లక్షలు ఐటీ విభాగం పరిశీలనలో ఉన్నాయి.

Updated Date - Apr 18 , 2024 | 04:30 AM