Share News

మృతదేహాలెవరివి.. చంపిందెవరు?

ABN , Publish Date - Jan 17 , 2024 | 03:58 AM

వేర్వేరు చోట్ల అనుమానాస్పద స్థితిలో ఒకేరోజు రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒకటి వికారాబాద్‌ జిల్లా కేంద్రం సమీపంలో..

మృతదేహాలెవరివి.. చంపిందెవరు?

వికారాబాద్‌ జిల్లా పులుమద్ది శివారులో కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యం

రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లిలో యువకుడి మృతదేహం

వికారాబాద్‌, ఆదిభట్ల, జనవరి 16: వేర్వేరు చోట్ల అనుమానాస్పద స్థితిలో ఒకేరోజు రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒకటి వికారాబాద్‌ జిల్లా కేంద్రం సమీపంలో.. మరొకటి రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లి సమీపంలో లభ్యమయ్యాయి. మృతదేహాల్లో ఒకటి మహిళది. పొలంలో సగం కాలిన స్థితిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించిందంటూ వికారాబాద్‌ మండలం పులుమద్ది గ్రామస్థులు సమాచారమివ్వడంతో పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. హతురాలి వయసు 30-35 మధ్య ఉంటుందని.. అత్యాచారం చేసి చంపి.. మృతదేహంపై పెట్రోలు పోసి తగులబెట్టి ఉంటారని భావిస్తున్నారు. హతురాలి ఒంటిపై ఆకుపచ్చ రంగు చీర, అదే రంగు జాకెట్‌, గులాబీ రంగు పెట్టికోట్‌ ఉందని పోలీసులు వెల్లడించారు. ఇక రంగారెడ్డి జిల్లాలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభించింది. ఆదిభట్ల పరిధిలోని బ్రాహ్మణపల్లి సమీపంలో ఔటర్‌ బ్రిడ్జి కింద మూటగట్టి ఉన్న సంచీలో నుంచి దుర్వాసన వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.. పోలీసులొచ్చి పరిశీలించగా కుళ్లిపోయిన స్థితిలో యువకుడి మృతదేహం కనిపించింది. ఎక్కడో హత్య చేసి.. మూటగట్టి తెచ్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు. హతుడి వయసు 35 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. మృతుడు కుడి కాలుకు నల్ల దారం, మెడలో రోల్డ్‌గోల్డ్‌ గొలుసు ఉన్నాయని వెల్లడించారు.

Updated Date - Jan 17 , 2024 | 03:58 AM