Share News

పాస్‌పుస్తకాలు అందేదెప్పుడో?

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:25 AM

రైతు భూమి తనదని నిరూపించు కోవడానికి పట్టాదారు పాస్‌ పుస్తకమే కీలకం.

పాస్‌పుస్తకాలు అందేదెప్పుడో?

రైతు భూమి తనదని నిరూపించు కోవడానికి పట్టాదారు పాస్‌ పుస్తకమే కీలకం. కొత్తగా వ్యవసాయ భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న రైతులకు ఆరు నెలలుగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందడం లేదు. రిజిస్ట్రేషన్‌ అయ్యాక 15రోజుల్లో అందాల్సిన రావాల్సిన పట్టాదారు పాస్‌ పుస్తకాలు నెలల తరబడి రాకపోవడంతో కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి సీజన్‌లో పెట్టుబడులు, వ్యవసాయ పరికరాల కోసం బ్యాంకుల్లో రుణం తీసుకోవడానికి వెళితే పట్టాదారు పాస్‌ పుస్తకం లేకుండా రుణం ఇవ్వడం కుదరదని వెనక్కి పంపుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు.

- మోత్కూరు, (ఆంధ్రజ్యోతి).

వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌ సందర్భంగా భూమి మ్యూటేషన్‌కు భూమి విలువలో 0.50 శాతం చొప్పున ఫీజు, కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకానికి రూ.300 చొప్పున భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి స్లాట్‌ బుక్‌ చేసినప్పుడే ప్రభుత్వం వసూలు చేస్తుంది. రిజిస్ట్రేషన్‌ చేసిన తర్వాత తహసీల్దార్‌ ప్రొసీడింగ్‌, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌, డూప్లికేట్‌ పీపీ ఇస్తున్నారు. వాటి ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. పట్టాదారు పాస్‌ పుస్తకం ఉంటేనే ఇస్తామంటున్నారు. ఇది యాసంగి సీజన్‌. పెట్టుబడులకు రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడానికి వెళితే పట్టాదారు పాస్‌ పుస్తకం లేకుండా రుణం ఇవ్వడం కుదరదని మేనేజర్లు వెనక్కి పంపుతున్నారు. దీంతో లక్షలాది రూపాయలు వెచ్చించి భూమి కొనుగోలు చేస్తే అవసరానికి బ్యాంకులో రుణాలు తీసుకోలేక పోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో పాస్‌ పుస్తకాలు పెండింగ్‌

యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలు, సూ ర్యాపేట జిల్లాలో 23 మండలాలు, నల్లగొండ జిల్లాలో 31 మండలాల చొప్పున ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 71 మండలాలు ఉన్నాయి. అన్ని మండలాల తహసీల్దార్‌ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా యి. గతంలో పాస్‌ పుస్తకం ఉన్నవారు భూమి కొనుగో లు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే వెంటనే అందులో నమోదు చేసేవారు. ఇప్పుడు కొత్తగా భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నవారికి వారం, పది రోజుల్లో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకం వస్తుందని అధికారులు చెప్పి పంపుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సగటున రోజుకు ఒక్కో తహసీ ల్దార్‌ కార్యాలయంలో 15కొత్త రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. మండలానికి నెలకు 15చొప్పున ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,065 రిజిస్ట్రేషన్లు జరుగు తాయి. ఆరు నెలలకు 6,390 రిజిస్ట్రేషన్లు అవుతుండగా, కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలు రాక వారు ఇబ్బందులు పడుతున్నారు.

సమగ్ర కుటుంబ సర్వేలోనూ లెక్క తప్పుతోంది

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తో న్న సమగ్ర కుటుంబ సర్వేలో భూమి ఉంటే విస్తీర్ణం, పట్టాదారు పాస్‌ పుస్తకం నంబరు న మోదు చేస్తున్నారు. కొత్తగా భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారు పట్టాదా రు పాసు పుస్తకం రాకపోవడంతో వారు సర్వేలో తమ భూమి నమోదు చేసుకోవడం లేదంటున్నారు. దీంతో మున్ముందు ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చినప్పుడు తమకేమైన ఇబ్బంది అవుతుందా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.

కారణం తెలియదంటున్న అధికారులు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను మా ర్చి ‘భూమాత’ను తెస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాల జారీ నిలిపివేసిందా, లేక పాస్‌ పుస్తకాల ముద్రణ సంస్థ సకాలంలో పాస్‌ పుస్తకాలు ముద్రించడం లేదా అన్న చర్చ జరుగుతోంది. రిజిస్ట్రేషన్‌ చేయించుకుని నెలలు గడుస్తున్నా పట్టాదారు పాస్‌ పుస్తకం ఎందుకు రావడం లేదని తహసీల్దార్లను అడిగితే కారణాలేమిటో తమకు తెలియదని సమాధానం ఇస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయాలని రైతులు కోరుతున్నారు.

ఐదు నెలలైనా పట్టాదారు పాస్‌ పుస్తకం రాలేదు

నా కుమారుడు సాయివంశీ పేరున గత జూలై 8న ఎకరం పది గుంటలు భూమి రిజిస్ట్రేషన్‌ చేయించా. కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకానికి స్లాట్‌ బుకింగ్‌ రోజే రూ. 300తీసుకున్నారు. ఇంతవరకు పట్టాదారు పాస్‌ పుస్తకం రాలేదు. వెంటనే పాస్‌ పుస్తకం ఇవ్వాలి.

- లెంకల వేణు, రైతు, కొండగడప.

బ్యాంకులో రుణం ఇవ్వడం లేదు

కొండగడపలో నాలుగు ఎకరాల భూమి కొని నా భార్య అంబటి రాములమ్మ పేరున రిజిస్ట్రేషన్‌ చేయించా. రిజిస్ట్రేషన్‌ చేసి రెండు నెల లు అయినా పట్టాదారు పాస్‌ పుస్తకం రాలేదు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్నప్పుడు తహసీల్దార్‌ ఇచ్చిన ప్రొసీడింగ్‌, రిజిస్ట్రేషన్‌ డ్యాక్యుమెంట్‌ తీసుకెళ్లి మో త్కూరు రైతు సేవా సహకారం సంఘంలో రుణం కోసం వెళ్లితే పట్టాదారు పాస్‌ పుస్తకం లేనిది రుణ ం ఇవ్వమని చెప్పారు. బ్యాంకులో రుణం తీసుకుందామంటే పాస్‌ పుస్తకం లేదని ఇవ్వడం లేదు.

-అంబటి నర్సయ్య, రైతు, కొండగడప

పాస్‌ పుస్తకాలు రాక పోవడానికి కారణం తెలియదు

వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌ చేసినప్పుడు ప్రొ సీడింగ్‌, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌, డూప్లికేట్‌ పీపీ ఇస్తున్నాం. పట్టాదారు పాస్‌పుస్తకం రైతు ఇంటి అ డ్ర్‌సకు వెళుతుంది. పట్టాదారు పాస్‌పుస్తకం ఎవరికి వచ్చింది, ఎవరి రాలేదు అని మాకు తెలియదు. కొందరు పాస్‌పుస్తకం రాలేదని అడుగుతున్నారు.

- డి.రాంప్రసాద్‌,తహసీల్దార్‌,మోత్కూరు.

Updated Date - Nov 28 , 2024 | 12:25 AM