Share News

కొనేదెప్పుడు?

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:35 PM

యాసంగి ధాన్యం కొనుగోళ్లలో అధికారుల తీరు ఆరంభ శూరత్వంగా కనిపిస్తోంది. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నా నిర్వాహకులు ఇంకా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రైతులు తెచ్చిన ధాన్యం నిల్వలు కేంద్రాల ఆవరణలో పేరుకుపోతున్నాయి. అకాల వర్షాలు కురిస్తే విక్రయించేందుకు ధాన్యం ఎక్కడ తడిసిపోతుందేమోనన్న ఆందోళన అన్నదాతలను పట్టిపీడిస్తోంది. ధాన్యం సేకరణకు చర్యలు తీసుకుంటున్నామని సర్కారు ప్రకటించినా.. సీఎం రేవంత్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్‌ జిల్లాలో కిలో ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొనేదెప్పుడు?

జిల్లాలో 122 కేంద్రాల ఏర్పాటు... కిలో ధాన్యం కొనుగోలు చేయని వైనం

రైతులు ధాన్యం తెస్తున్నా పట్టించుకోని యంత్రాంగం

కేంద్రాల ఆవరణలో ధాన్యం నిల్వలు..కొనుగోళ్ల కోసం రైతుల ఎదురుచూపులుఽ

కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ సమీక్షలు నిర్వహిస్తున్నా చలనం లేని పౌరసరఫరాల శాఖ

కేంద్రాల్లో గన్నీ బస్తాల కొరత.. పీపీసీలకు ఇంకా చేరని ఐరిష్‌ కిట్లు

వానొస్తే.. ధాన్యం వర్షార్పణమే

యాసంగి ధాన్యం కొనుగోళ్లలో అధికారుల తీరు ఆరంభ శూరత్వంగా కనిపిస్తోంది. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నా నిర్వాహకులు ఇంకా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రైతులు తెచ్చిన ధాన్యం నిల్వలు కేంద్రాల ఆవరణలో పేరుకుపోతున్నాయి. అకాల వర్షాలు కురిస్తే విక్రయించేందుకు ధాన్యం ఎక్కడ తడిసిపోతుందేమోనన్న ఆందోళన అన్నదాతలను పట్టిపీడిస్తోంది. ధాన్యం సేకరణకు చర్యలు తీసుకుంటున్నామని సర్కారు ప్రకటించినా.. సీఎం రేవంత్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్‌ జిల్లాలో కిలో ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పరిగి, ఏప్రిల్‌ 25 : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ ప్రారంభించామని చెబుతున్న అధికారులు .. వడ్ల కొనుగోలుకు చర్యలు తీసుకోవడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లు ప్రారంభం కాకపోడంతో రైతులు తమ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయిస్తూ నష్టపోతున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వీలుగా కేంద్రాలు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది. సీఎం రేవంత్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్‌ జిల్లాలో మాత్రం ఇంకా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం గమనార్హం. జిల్లాలో రెండు వారాలుగా యాసంగి ధాన్యం మార్కెట్లోకి వస్తోంది. రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా కొనుగోళ్ల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. తొలిదశకోత పూర్తి చేసిన రైతులు పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు తీసుకు వెళుతున్నా.. అక్కడ కొనుగోళ్లు ఇంకా ప్రారంభించకపోవడంతో అత్యవసరమైన రైతులు బహిరంగ మార్కెట్లకు తీసుకు వెళ్లి వ్యాపారులు నిర్ణయించిన ధరలకు విక్రయిస్తూ నిలువునా మోసపోతున్నారు

1.19 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

గత ఏడాది మాదిరిగానే ఈసారి యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లాలో 129 ఽకేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం 122 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు స్వయంగా అధికారులే చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఎక్కడా ధాన్యం సేకరణ ప్రారంభించలేదు. ఈ సీజన్‌లో 1.96 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చే అవకాశం ఉండగా, దీంట్లో 1.19 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్న లక్ష్యం అధికారులు నిర్దేశించుకున్నారు. ఽధాన్యం కొనుగోళ్లపై కేంద్రాల నిర్వాహకులకు ఓపీఎంఎ్‌సపై ఈనెల మొదటి వారంలో శిక్షణ ఇచ్చారు. జిల్లాలో 90 శాతం వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను హడావిడిగా ప్రారంభించి రెండు వారాలు గడిచినా ఇంత వరకూ ఒక్క కేంద్రంలో కూడా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. గత ఏడాది ఈ సీజన్‌లో ఇదే సమయానికి కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుని రైతుల ఖాతాల్లో చెల్లింపులు కూడా జరిగాయి. ఈసారి జిల్లాలో ఇంకా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

తూకాలు వేయని వైనం

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి ముందు ధాన్యం కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు అవేమీ లేకుండానే కేంద్రాలు ప్రారంభించినట్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళుతున్నా.. అక్కడ నిర్వాహకులు తూకాలు చేయకపోవడంతో రైతులు తాము తెచ్చిన ధాన్యాన్ని అక్కడే నిల్వ చేస్తున్నారు. దీంతో ధాన్యం నిల్వలు రోజురోజుకూ పేరుకుపోతున్నాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌లు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నా పౌరసరఫరాల శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం గమనార్హం.

కొనుగోలు కేంద్రాల్లో వసతులు నిల్‌

కేంద్రాల్లో కొనుగోళ్ల విషయం అటుంచితే ధాన్యం తీసుకు వచ్చే రైతులకు కనీస వసతులు కూడా కల్పించకపోవడం గమనార్హం. వాస్తవానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు నిల్వ చేసేందుకు వీలుగా గోదాములు ఉండాలి. అయితే జిల్లాలో ఎక్కడా ఈ సదుపాయం లేదు. తూకం మిషన్లు, టార్ఫాలిన్‌ షీట్లు, గన్నీ బస్తాలు, తేమ గుర్తించే మీటర్లు, ప్యాడీ క్లీనర్లు, లైటింగ్‌, తాగునీరు, రైతులకు వసతి వంటి సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ఈసాఽరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఐరిస్‌ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ ఐరిస్‌ కిట్లు ఇంకా కొనుగోలు కేంద్రాలకు సరఫరా కాకపోవడం గమనార్హం. గన్నీ బస్తాలు లేకుండా, ఐరిష్‌ కిట్లు సరఫరా చేయకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఏ విధంగా ముందుకు సాగుతుందనేది సంబంధిత అధికారులే సెలవివ్వాలి. ఓపీఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌ కూడా ఇన్‌స్టాల్‌ చేయలేదని తెలిసింది.

వ్యాపారులకు విక్రయించి నష్టపోతున్న రైతులు

రైతులు పండించే ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. ఈసారి ఏ-గ్రేడ్‌ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2,203, బి-గ్రేడ్‌ రకానికి రూ.2,183 చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. నిబంధనల ప్రకారం ధాన్యం తీసుకెళ్లినా కేంద్రాల్లో కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ధాన్యాన్ని రైతులు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తూ నష్టపోతున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు సిండికేట్‌గా మారి క్వింటాల్‌కు రూ.300 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. రూ.1900 నుంచి రూ.2,000 లోపే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. నష్టపోతున్నామని తెలిసినా కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో వేరే మార్గం లేక విక్రయిస్తున్నామని రైతులు వాపోతున్నారు.

వానొస్తే.. వర్షార్పణమే

వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో ఈదురుగాలులు, అకాల వర్షం కురిస్తే మాత్రం కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చిన ధాన్యం తడిసిపోయే ప్రమాదం పొంచి ఉంది. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రైతులు తాము తెచ్చిన ధాన్యాన్ని కేంద్రాల ఆవరణలో రాశులుగా పోసుకుని కాపలా ఉంటున్నారు. వర్షం కురిస్తే తాము తెచ్చిన పంట తడిసిపోయి తాము నష్టపోతామని, ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

చిరిగిన గోనె సంచులు సరఫరా

ధాన్యం కొనుగోళ్లకు ఉపయోగించే గన్నీ బస్తాల విషయంలో సంబంధిత అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గురువారం వరకు వేళ్ల మీద లెక్కించే కేంద్రాలకు మాత్రమే గన్నీ బస్తాలు పంపించినట్లు తెలుస్తోంది. ఽకొనుగోలు కేంద్రాల ఎదుట ధాన్యం నిల్వలు పెరిగిపోతున్న ఈ సమయంలో కేంద్రాల్లో అవసరమైన మేర గోనె సంచులు అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. గత ఏడాది ధాన్యం కొనుగోళ్ల కోసం గన్నీ బస్తాలకు ఇండెంట్‌ పెట్టగా, అప్పట్లో వచ్చిన 15లక్షల గన్నీ బస్తాలు పౌరసరఫరాల శాఖ అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. తమ వద్ద ఉన్న గన్నీ బస్తాలను కూడా కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేయకపోవడం పట్ల రైతులు మండిపడుతున్నారు. కేంద్రాలకు పంపించిన గన్నీ బస్తాలు కూడా ధాన్యం నిల్వ ఉంచడానికి ఏమాత్రం అనుకూలంగా లేకపోవడం గమనార్హం. గన్నీ బస్తాలకు పెద్దపెద్ద రంధ్రాలు ఉంటే.. ఏ విధంగా ధాన్యం సేకరణ సాధ్యమవుతుందనేది అధికారులకే తెలియాలి. జిల్లాలో అందుబాటులో ఉన్న 15లక్షల గన్నీ బస్తాలు పోనూ ఇంకా 14.25 లక్షల గన్నీ బస్తాలు అవసరం కానున్నాయి.

Updated Date - Apr 26 , 2024 | 12:14 AM