Share News

ఆ గదిలో ఏం మాట్లాడారు?

ABN , Publish Date - Feb 07 , 2024 | 04:58 AM

ఇద్దరు బాలికలను హాస్టల్లోని ఏ గదిలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? బాలికలతో ఏం మాట్లాడారు? ఆ గదిలో ఇంకా ఎవరెవరున్నారు

ఆ గదిలో ఏం మాట్లాడారు?

బాలికలు ఎందుకు చనిపోయారు

భువనగిరి ఎస్సీ హాస్టల్‌ ఘటనపై విచారణ అధికారి నియామకం

హాస్టల్‌ వార్డెన్‌ సస్పెన్షన్‌?

దోషులపై చర్యలు తీసుకోవాలి: కవిత

హైదరాబాద్‌, యాదాద్రి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు బాలికలను హాస్టల్లోని ఏ గదిలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? బాలికలతో ఏం మాట్లాడారు? ఆ గదిలో ఇంకా ఎవరెవరున్నారు? అసలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వారికెందుకు ఏర్పడ్డాయి? ఈ కోణంలోనే ఇద్దరు బాలికల ఆత్మహత్య కేసును విచారణ జరుగుతోంది. భువనగిరి ఎస్సీ బాలికల వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్ధినులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ప్రభుత్వం స్పందించింది. ఆత్మహత్యకు గల కారణాలను తేల్చేందుకు ప్రత్యేకంగా విచారణ అధికారిని నియమించింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు శాఖ జాయింట్‌ డైరక్టర్‌ (స్కీమ్స్‌) లక్ష్మిదేవిని విచారణ అధికారిగా నియమిస్తూ కార్యదర్శి వాకాటి కరుణ ఆదేశాలిచ్చారు. త్వరితగతిన పూర్తిస్థాయిలో విచారణ జరిపి.. ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీతక్క ఆదేశించారు. కాగా, విచారణలో భాగంగా ఓ అధికారి భువనగిరి ఎస్సీ హాస్టల్‌కు వెళ్లి, వివరాలు ఆరా తీశారు. విద్యార్ధినుల మరణంపై అనుమానాలున్నాయంటూ వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. దాంతో పోలీసుల విచారణలోనూ ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయని సర్కారు నియమించిన విచారణ అధికారి తెలుసుకోనున్నట్లు తెలిసింది.

విచారణలో భాగంగా పోలీసులు మరింత సమాచారం కోసం సూసైడ్‌ నోట్‌ సహా పలు నమూనాలను ఫోరెన్సిక్‌కు పంపారు. ఆ నివేదిక వస్తేగానీ పలు విషయాలు తెలుస్తాయని, తదుపరి విచారణ ముందుకు సాగనుందని అంటున్నారు. కాగా ఘటన జరిగిన ఎస్సీ హాస్టల్‌ వార్డెన్‌ శైలజను సస్పెండ్‌ చేస్తూ యాదాద్రి కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. భువనగిరి ఎస్సీ హాస్టల్లో ఇద్దరు బాలికల మృతి తీవ్ర విషాదకరమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇద్దరు విద్యార్థినులు అనుమానాస్పదస్థితిలో మృతిచెంది నాలుగు రోజులవుతున్నా సరైన కారణాలు దొరకడం లేదని పోలీసులు అంటున్నారని, ఘటనపై విచారణ పారదర్శకంగా జరగాలని కవిత అన్నారు. మంగళవారం ఆమె హాస్టల్‌కు వచ్చి.. బాలికల గదిని పరిశీలించారు. హాస్టల్‌ సిబ్బందితో మాట్లాడారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించడం పట్ల ప్రభుత్వానికి కవిత ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. సంక్షేమ హాస్టల్లో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య అనుమానాస్పదంగా ఉందని, ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య డిమాండ్‌ చేశారు.

హాస్టల్‌ నిర్వహణ అస్తవ్యస్తం

ఘటన జరిగిన భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్‌పై సరైన పర్యవేక్షణ లేదనే ఆరోపణలున్నాయి. ఈ హాస్టల్లో మొత్తంగా 112 మంది పిల్లలు ఉంటున్నారు. కి.మీ పరిధిలోని వివిధ స్కూళ్లలో చదువుతుంటారు. కొందరు ఆటల్లో వెళితే ఇంకొందరు నడుచుకుంటూ వెళ్తారు. ఈ హాస్టల్‌ వార్డెన్‌ శైలజ, నాలుగు వేర్వేరు చోట్ల విధులు నిర్వహిస్తున్నారని ఫలితంగా సరైన పర్యవేక్షణ లేదనే విమర్శలున్నాయి హాస్టల్లో సీసీ కెమెరాలున్నా పనిచేయడం లేదని తెలుస్తోంది.

Updated Date - Feb 07 , 2024 | 09:39 AM