Share News

ఏ సాఫ్ట్‌వేర్‌ వాడారు?

ABN , Publish Date - Mar 20 , 2024 | 04:46 AM

ఎస్‌ఐబీలో ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారానికి సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.

ఏ సాఫ్ట్‌వేర్‌ వాడారు?

ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు??

మూడోరోజు విచారణలో ప్రణీత్‌రావుపై

దర్యాప్తు అధికారుల ప్రశ్నలు

రిట్రీవ్‌ అయిన మొబైల్‌ డేటా

సహకరించిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లకు బేడీలు

అనంతగిరిలో హార్డ్‌డి్‌స్కల శకలాలు

వాటి రిట్రీవ్‌ కష్టమేనంటున్న నిపుణులు!

నిబంధనలకు విరుద్ధంగా కస్టడీకి ఇచ్చారు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసులు

మీడియాకు లీకులు ఇస్తున్నారు

హైకోర్టును ఆశ్రయించిన ప్రణీత్‌రావు

హైదరాబాద్‌ సిటీ, వికారాబాద్‌, హైదరాబాద్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐబీలో ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారానికి సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు పోలీసు కస్టడీ మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో.. కోర్టులో నేరాన్ని రుజువుచేసేందుకు కావాల్సిన ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో మూడోరోజు కస్టడీలో భాగంగా మంగళవారం ఫోన్‌ట్యాపింగ్‌కు ప్రణీత్‌రావు ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌పై ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ‘‘టార్గెట్‌గా చేసుకున్న వ్యక్తుల ఫోన్లలోకి రిమోట్‌ యాక్సెస్‌ టూల్‌/ట్రోజన్‌(ర్యాట్‌)ను ఎలా చొప్పించారు? అసలు ఆ మాల్‌వేర్‌ను ఎక్కడ కొనుగోలు చేశారు? ఆ టూల్‌ కొనుగోలుకు ఫండింగ్‌ చేసిందెవరు?’’ అనే ప్రశ్నలకు సమాధానం రాబట్టేందుకు యత్నించినట్లు సమాచారం. ఈ వివరాలు బయటకు పొక్కొద్దనే ఉద్దేశంతోనే ప్రణీత్‌రావు హార్డ్‌డి్‌స్కలను ధ్వంసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ హార్డ్‌డి్‌స్కలను కటర్‌తో ధ్వంసం చేసి, అనంతగిరి అడవుల్లో పారేసినట్లు ప్రణీత్‌రావు వాంగ్మూలమివ్వడంతో.. ఓ బృందం ఇప్పుడు ఆ శకలాల కోసం అన్వేషిస్తోంది. అయితే.. హార్డ్‌డి్‌స్కలను ధ్వంసం చేస్తే.. వాటిల్లోని డేటాను రిట్రీవ్‌ చేయడం దాదాపు అసాధ్యమని సైబర్‌సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. ‘‘హార్డ్‌డి్‌స్కలలో ఉండే సెక్టార్లు అత్యంత సున్నితంగా ఉంటాయి. వాటిని విద్యుదయస్కాంత క్షేత్రాల వద్ద పెట్టినా.. సెక్టార్లు ధ్వంసమవుతాయి. అలాంటిది.. హార్డ్‌డి్‌స్కలను ధ్వంసం చేసి, అడవుల్లో పారేస్తే.. సెక్టార్లు పూర్తిగా దెబ్బతిని ఉంటాయి. ఆ సెక్టార్లకు ఎండ తగిలినా డేటా తుడిచిపెట్టుకుపోతుంది’’ అని సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడొకరు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అయితే.. ప్రణీత్‌రావు సెల్‌ఫోన్‌ డేటాను రిట్రీవ్‌ చేసినట్లు తెలిసింది. అందులోని చాటింగ్‌ డేటా ఆధారంగా ప్రణీత్‌రావును ప్రశ్నిస్తున్నారు.

కుట్రలో భాగస్వాముల అరెస్టులు షురూ..

ఈ కేసులో ప్రణీత్‌రావుకు విజిలెన్స్‌లో పనిచేసే ఓ ఎస్పీ మొదలు.. పలువురు ఇన్‌స్పెక్టర్లు సహకరించినట్లు దర్యాప్తు అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ క్రమంలో వరంగల్‌కు చెందిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను మంగళవారం ఉదయం అరెస్టు చేసినట్లు తెలిసింది. వారిని హైదరాబాద్‌లో ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. ప్రణీత్‌రావు పోలీసు కస్టడీ ముగిసేలోపే.. వీరిని ముఖాముఖి కూర్చోబెట్టి ప్రశ్నించనున్నారు. మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను సోమవారం విచారించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇక ప్రణీత్‌రావుకు సహకరించిన అధికారులు, ఎస్‌ఐబీ ఉన్నతాధికారులు.. ఇలా వరుసపెట్టి విచారణలు, అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది.

హైకోర్టును ఆశ్రయించిన ప్రణీత్‌రావు

తనను దిగువ కోర్టు నిబంధనలకు విరుద్ధంగా పోలీసు కస్టడీకి అనుమతించిందని, ఆ ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు తన అడ్వొకేట్‌ ద్వారా మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. ‘‘నాంపల్లి మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు యాంత్రికంగా రిమాండ్‌కు అనుమతినిచ్చింది. పోలీసు కస్టడీలో ఎంతసేపు ప్రశ్నించాలి? ఏ సమయం వరకు? అనేది పేర్కొనలేదు. రోజువారీ దర్యాప్తు పూర్తవ్వగానే జైలుకు తరలించాలి. కానీ, పోలీ్‌సస్టేషన్‌లోనే నిర్బంధిస్తున్నారు. నిద్రపోవడానికి కూడా అక్కడ సదుపాయాల్లేవు’’ అని ఆయన కోర్టుకు అందజేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు లీకులుగా అందజేస్తున్నట్లు వివరించారు. ‘‘నన్ను బంజారాహిల్స్‌ ఠాణాలో రహస్యంగా విచారిస్తున్నారు. నా రక్తసంబంధీకులు, కనీసం నా అడ్వొకేట్‌ను కూడా కలవనివ్వడం లేదు. నాపై ఫిర్యాదు చేసిన ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ రమేశ్‌ విచారణలో ఎలా పాల్గొంటారు? రిమాండ్‌ కాపీని నాకు, న్యాయవాదికి చాలా ఆలస్యంగా అందజేశారు. దాని వల్ల అప్పీల్‌ చేసుకోవడంలో ఆలస్యమేర్పడింది’’ అని కోర్టుకు వివరించారు. డీకే బసు, పరంజిత్‌సింగ్‌ సైనీ కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దిగువకోర్టు పోలీసులకు కచ్చితంగా నిర్దేశించలేదని తెలిపారు. ఇంటరాగేషన్‌ సమయం విషయంలోనూ బీవీరావు కేసులో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పు(రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు దర్యాప్తు చేయకూడదు)ను పాటించాలనే షరతులను కిందికోర్టు విధించలేకపోయిందని వాపోయారు. ఈ పిటిషన్‌ మంగళవారం జస్టిస్‌ రాధారాణి ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ వ్యాజ్యంపై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలంటూ రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావును ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

Updated Date - Mar 20 , 2024 | 04:46 AM