Share News

మా సంగతేంటి?

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:40 PM

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పదవులు దక్కినవారు సంతోషంలో ఉంటే.. రానివారు నారాజ్‌లో ఉన్నారు. రాష్ట్రప్రభుత్వం తాజాగా విడుదల చేసిన రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్ల జాబితాలో ఐదుగురికి చోటు దక్కింది. ఇందులో ఇద్దరు వికారాబాద్‌ జిల్లాకు చెందిన వారు కాగా.. ముగ్గురు రంగారెడ్డి జిల్లా వారున్నారు. మేడ్చల్‌ జిల్లా నుంచి ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం లభించలేదు. అయితే, ఉమ్మడి జిల్లా నుంచి అనేకమంది నామినేటెడ్‌ పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కానీ, చాలామందికి ఆ పదవులు దక్కలేదు. దీంతో వారంతా నిరుత్సాహంగా ఉన్నారు. తొలి విడత జాబితాలో పదవి దక్కకున్నా రెండో జాబితాలోనైనా తప్పకుండా పదవి వస్తుందన్న ఆశతో ఉన్నారు.

మా సంగతేంటి?

ఐదుగురికి దక్కిన రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు

మేడ్చల్‌ జిల్లాకు మొండిచేయి

నారాజ్‌లో సీనియర్లు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పదవులు దక్కినవారు సంతోషంలో ఉంటే.. రానివారు నారాజ్‌లో ఉన్నారు. రాష్ట్రప్రభుత్వం తాజాగా విడుదల చేసిన రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్ల జాబితాలో ఐదుగురికి చోటు దక్కింది. ఇందులో ఇద్దరు వికారాబాద్‌ జిల్లాకు చెందిన వారు కాగా.. ముగ్గురు రంగారెడ్డి జిల్లా వారున్నారు. మేడ్చల్‌ జిల్లా నుంచి ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం లభించలేదు. అయితే, ఉమ్మడి జిల్లా నుంచి అనేకమంది నామినేటెడ్‌ పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కానీ, చాలామందికి ఆ పదవులు దక్కలేదు. దీంతో వారంతా నిరుత్సాహంగా ఉన్నారు. తొలి విడత జాబితాలో పదవి దక్కకున్నా రెండో జాబితాలోనైనా తప్పకుండా పదవి వస్తుందన్న ఆశతో ఉన్నారు.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కాంగ్రెస్‌ నేతలు అయిదుగురికి రాష్ట్ర కార్పొరేషన్‌ చెర్మన్‌ పదవులు దక్కాయి. గతంలో పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు ప్రకటించిన వారికే పదవులు కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందులో ఒకరికి గతంలో ఇచ్చిన పదవికి బదులు మరో పదవిని కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కార్పొరేషన్ల చైర్మన్లు రెండేళ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. ఇదిలా ఉంటే మేడ్చల్‌ జిల్లా నుంచి ఏ ఒక్కరికీ ప్రాతినిధ్యం లభించలేదు. దీంతో మేడ్చల్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. అలాగే రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో కూడా నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్న సీనియర్లు తాజాగా విడుదల చేసిన జాబితాలో తమకు అవకాశం దక్కక పోవడంతో నిరాశ చెందారు. త్వరలో విడుదలయ్యే రెండో జాబితాలోనైనా అవకాశం దక్కుతుందా? లేదా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. పదేళ్ల తరువాత అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌ సీనియర్లు అనేకమంది నామినేటెడ్‌ పోస్టులపై ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. అధికారంలోకి రాగానే మొత్తం రాష్ట్ర స్థాయిలో 54 నామినేటెడ్‌ పోస్టులను రద్దు చేసిన కాంగ్రెస్‌ సర్కార్‌ ఈ స్థానంలో తమ పార్టీ నేతలను నియమించేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఈ మేరకు 35 మందితో తొలి జాబితా విడుదల చేసింది. అయితే ఇదే సమయంలో పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ జాబితాలో స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్‌ జిల్లా నుంచి కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డికి రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి దక్కగా కాల్వ సుజాతను ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా నియమించారు. ఇక రంగారెడ్డి జిల్లాకు మూడు పదవులు దక్కాయి. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డిని పట్టణ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. మల్‌రెడ్డి రాంరెడ్డికి రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి లభించింది. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌కు ముదిరాజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి కేటాయించారు. వాస్తవానికి గతంలో ఇచ్చిన జాబితాలో జ్ఞానేశ్వర్‌కు డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పదవి ఇవ్వగా తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో దీన్ని మార్చి ముదిరాజ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. ఇక మేడ్చల్‌ జిల్లా నుంచి ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదు. దీంతో స్థానిక కాంగ్రెస్‌ నేతలంతా నారాజ్‌గా ఉన్నారు. రెండో జాబితాలోనైనా అవకాశం దక్కుతుందని ఎదురు చూస్తున్నారు. కొందరు నేతలు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్‌ కోరుతుండగా ఇంకొందరు జిల్లాస్థాయి పోస్టులను అడుగుతున్నారు. పదవులు దక్కించుకునేందుకు సన్నిహిత మంత్రులు, ఏఐసీసీ, టీపీసీసీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు.

ఆశావాహులు వీరే

నామినేటెడ్‌ పోస్టులు ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి నామినేటెడ్‌ రేస్‌లో ఉన్నారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గం నుంచి సానెం శ్రీనివాస్‌గౌడ్‌, సామ రాజ్‌పాల్‌రెడ్డి , రాచమల్లు సిద్ధేశ్వర్‌ నామినేటెడ్‌ పదవిని ఆశిస్తున్నారు. చేవెళ్ల అసెంబ్లీ స్థానం నుంచి గతంలో ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు సున్నపు వసంతం, షాబాద్‌ దర్శన్‌, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెంచుకున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ధరణి కమిటీ సభ్యుడు ఎం. కోదండరెడ్డికి త్వరలో ఏర్పాటు కానున్న వ్యవసాయ కమిషన్‌లో కీలక పదవి వరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే సీనియర్‌ నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్‌, కొత్త కుర్మ శివకుమార్‌, కొంగరి విష్ణువర్ధన్‌రెడ్డి, కప్పాటి పాండురంగారెడ్డి పదవులు ఆశిస్తున్నారు. అలాగే కల్వకుర్తి నియోజకవర్గంలో ఆమనగల్‌ ప్రాఽథమిక వ్యవసాయ సహకార సంఘం మాజీ చైర్మన్‌, మైసిగండి మాజీ ఎంపీటీసీ అయిళ్ల శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు సూదిన రామిరెడ్డి , గూడురు శ్రీనివాస్‌రెడ్డి , వై.నర్సింహ, వి.జంగయ్య నామినేటెడ్‌ పోస్టులు ఆశిస్తున్నారు. అలాగే మేడ్చల్‌ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో పాటు సీనియర్‌ నేతలు హరివర్ధన్‌రెడ్డి, నక్కా ప్రభాకర్‌గౌడ్‌, నర్సిరెడ్డి భూపతిరెడ్డి రేస్‌లో ఉన్నారు. సుధీర్‌రెడ్డికి ఆర్టీసీ చైర్మన్‌ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలో ఎనుముల తిరుపతిరెడ్డి, నందారం ప్రశాంత్‌, వికారాబాద్‌ నియోజకవర్గం నుంచి మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ వి.సత్యనారాయణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, గుడిసె లక్ష్మణ్‌, ఎర్రవల్లి జాఫర్‌, మహిపాల్‌రెడ్డి తదితరులు నామినేటెడ్‌ పదవుల రేసులో ఉన్నారు. తాండూరు నియోజకవర్గం నుంచి మురళీకృష్ణగౌడ్‌, కరణం పురుషోత్తంరావు, సునీతా సంపత్‌, ధారాసింగ్‌, పరిగి నియోజకవర్గం నుంచి లాల్‌కృష్ణ ప్రసాద్‌, రాములు, కృష్ణారెడ్డి, ఆంజనేయులు, పరశురాంరెడ్డి, పాలాది శ్రీనివాస్‌, ఎర్రగడ్డపల్లి కృష్ణ, రామకృష్ణ, హన్మంత్‌ ముదిరాజ్‌ పోటీ పడుతున్నారు.

బాధ్యతలు స్వీకరించిన చల్లా నర్సింహారెడ్డి

రంగారెడ్డి అర్బన్‌, జూలై 8 : తెలంగాణ రాష్ట్ర అర్బన్‌ ఫైనాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కో-ఆపరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా చల్లా నర్సింహారెడ్డి సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఆయన కర్మన్‌ఘాట్‌ హనుమాన్‌ టెంపుల్‌లో పూజలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు చల్లా నర్సింహారెడ్డిని శాలువాలు కప్పి గజమాలతో సన్మానించారు. సన్మానించిన వారిలో పార్టీ సీనియర్‌ నాయకులు చల్లా బాల్‌రెడ్డి, చల్లా ప్రభాకర్‌రెడ్డి, చల్లా శ్రీనివాస్‌రెడ్డి, పైల శేఖర్‌రెడ్డి, కాల కుమార్‌, సంతోష్‌, సైదులు, మురళీగౌడ్‌, పరశురాం, కీసర యాదిరెడ్డి, విజయరెడ్డి, సుభాష్‌రెడ్డి తదితరులున్నారు.

కార్పొరేషన్‌ చైర్మన్లుగా నియమితులైన ఉమ్మడి జిల్లా నేతలు

పేరు పదవి

ఆర్‌.గురునాథ్‌రెడ్డి రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌

కాల్వ సుజాత రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్‌

మల్‌రెడ్డి రాంరెడ్డి రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

చల్లా నర్సింహారెడ్డి పట్టణ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ ముదిరాజ్‌ కార్పొరేషన్‌

Updated Date - Jul 09 , 2024 | 12:33 AM