Share News

మీడియాతో మాటలేంటి?

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:41 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి మందలించారు. కోర్టు ఆవరణలో కవిత మీడియాతో మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడురోజుల సీబీఐ కస్టడీ ముగిసిన కవితను సోమవారం

మీడియాతో మాటలేంటి?

కోర్టు ఆవరణలో మాట్లాడడంతో కవితపై న్యాయమూర్తి ఆగ్రహం

ఏదైనా చెప్పాలనుకుంటే విచారణ సమయంలో చెప్పాలని ఆదేశం

సీబీఐ కేసులో కవితకు తొమ్మిది రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

14 రోజులు అడిగిన సీబీఐ.. ఈ నెల 23 వరకు విధించిన కోర్టు

గర్భకోశ సమస్య, హైబీపీ, అల్సర్‌తో బాధపడుతున్నా.. బెయిల్‌ ఇవ్వండి

కవిత పిటిషన్‌.. 22న విచారిస్తామన్న న్యాయమూర్తి

ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ: మీడియాతో కవిత

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి మందలించారు. కోర్టు ఆవరణలో కవిత మీడియాతో మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడురోజుల సీబీఐ కస్టడీ ముగిసిన కవితను సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచగా.. కోర్టు హాలులోకి వచ్చేముందు, వెళ్లేముందు ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ కేసులో కొత్తగాం ఏమీ లేదు. రెండు సంవత్సరాల నుంచి అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారు. ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్లు మాట్లాడే మాటలనే మళ్లీ లోపల సీబీఐ వాళ్లు అడుగుతున్నారు’’ అని కవిత వ్యాఖ్యానించారు. దీంతో కవిత వ్యవహార శైలిపై న్యాయమూర్తి కావేరీ బవేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ేస్టట్‌మెంట్లు కోర్టులో ఇస్తే ఎలా? అని ప్రశ్నించారు. ‘‘ఆమె ఏం చెప్పాలనుకుంటున్నారో విచారణ సమయంలో చెప్పమనండి. అంతేతప్ప.. కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడితే ఎలా? కోర్టు ఆవరణలో ఇలా మాట్లాడడం సరికాదు. ఒకవేళ మీడియాతో మాట్లాడాలనుకుంటే కోర్టు బయట మాట్లాడమని చెప్పండి’’ అని కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావుకు న్యాయమూర్తి సూచించారు.

23 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ..

కవితను సోమవారం ఉదయం 10 గంటలకు కోర్టులో హాజరు పరచగా.. ఆమెకు న్యాయమూర్తి ఈ నెల 23 వరకు తొమ్మిది రోజులపాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. కవిత మూడురోజుల కస్టడీ ముగియడంతో న్యాయస్థానంలో ప్రవేశ పెట్టిన సీబీఐ.. ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించాలని కోరింది. అయితే.. ఢిల్లీ మద్యం కేసులోనే కవితకు ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ గతంలోనే కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో సీబీఐ కేసులో సైతం ఆమెకు న్యాయమూర్తి తొమ్మిదిరోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. ఈ నెల 23న మళ్లీ న్యాయస్థానం ఎదుట హాజరు పరచాలని ఆదేశించారు. కాగా, కవిత మూడురోజుల సీబీఐ విచారణకు సంబంధించి 11 పేజీల రిపోర్టుకు దర్యాప్తు సంస్థ కోర్టుకు సమర్పించింది. సీబీఐ తరఫున న్యాయవాది పంకజ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. మద్యం కేసుకు సంబంధించిన ఆధారాలు, సహ నిందితుల వాంగ్మూలాలు ముందు పెట్టి మరీ కవితను ప్రశ్నించామని తెలిపారు. కానీ, విచారణకు ఆమె సహకరించలేదని, సరైన సమాధానాలు చెప్పలేదని న్యాయస్థానానికి వెల్లడించారు.

ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించినా..

‘‘నిందితుడు గోరంట్ల బుచ్చిబాబు మొబైల్‌ ఫోన్లలో లభించిన వాట్సాప్‌ సంభాషణలు, సాక్షులు, అప్రూవర్ల స్టేట్‌మెంట్ల ఆధారంగా కవితను ప్రశ్నించాం. మహబూబ్‌నగర్‌లో భూమి కుంభకోణం పేరుతో డబ్బు మళ్లింపు, ఆమ్‌ ఆద్మీ పార్టీకి విజయ్‌ నాయర్‌, ఇతర నిందితుల ద్వారా రూ.100 కోట్లు మళ్లించడం, ఆ డబ్బును ఇతరుల నుంచి వసూలు చేయడంలో కవిత పాత్రపై ప్రశ్నించాం. శరత్‌ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న రూ.14 కోట్ల గురించి కూడా విచారించాం. అలాగే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్‌ చంద్రారెడ్డి, విజయ్‌ నాయర్‌ సహా నిందితులతో జరిగిన సమావేశాల గురించి ప్రశ్నించాం. కానీ, నగదు బదిలీల గురించి కవిత సరైన సమాధానాలు ఇవ్వలేదు. ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా సమాధానాలు చెప్పారు. కవిత ప్రముఖ రాజకీయ నాయకురాలు. సమాజాన్ని ప్రభావితం చేేస మహిళ. ఆమె బయటికి వెళితే సాక్షులను బెదిరించే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం కేసు కీలక దశలో ఉంది. ఇప్పుడు కవిత బయటికి వెళితే కేసుపై ప్రభావం పడుతుంది. మరికొంత మందిని విచారించాల్సి ఉంది. మరిన్ని కీలక ఆధారాలను, డిజిటల్‌ పరికరాలను పరిశీలించాల్సి ఉంది. అందుకే కవితకు 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించండి’’ అని న్యాయస్థానాన్ని పంకజ్‌కుమార్‌ కోరారు. ఇదిలా ఉండగా. ఈడీ కేసుకు సంబంధించి కవిత దాఖలు చేసిన రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టులో మంగళవారం విచారణ జరగనుంది. మరోవైపు సీబీఐ అరెస్టుకు సంబంధించి కవిత మరో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై 20వ తేదీలోపు కౌంటర్‌ దాఖలు చేయాలంటూ సీబీఐకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 22న విచారణ చేపడతామని పేర్కొంది.

అనారోగ్య సమస్యలున్నాయి.. బెయిలివ్వండి: కవిత

సీబీఐ కేసులో తనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ సోమవారం రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన కవిత.. అందుకు తన అనారోగ్య సమస్యలను ప్రస్తావించారు. ఇందుకు సంబంధించిన మెడికల్‌ రిపోర్టులను జత చేశారు. ఈ కేసులో సహ నిందితులకు బెయిల్‌ ఇచ్చారని, అలాగే తనకూ బెయిల్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు 664 పేజీలతో కూడిన బెయిల్‌ పిటిషన్‌ వేశారు.

పిటిషన్‌లో కవిత పేర్కొన్న కొన్ని కీలక అంశాలు..

  • 20 ఏళ్ల క్రితం చేతి మణికట్టు వద్ద ఎముక విరిగింది. అది ప్రస్తుతం నన్నెంతో బాధిస్తోంది.

  • 2013లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్నారు. 2020లో గర్బసంచి సంబంధిత వ్యాధితో బాధపడ్డాను.

  • 2023లో అల్సర్‌ మొదలైంది. ఆ సమస్య నన్నెంతో బాధిస్తోంది.

  • బీపీతో బాధ పడుతున్నాను. మార్చి 16న ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు రాత్రి 12.15 గంటలకు బీపీ చెక్‌ చేయగా.. 186/103గా నమోదైంది. దీంతో అదేరోజు రాత్రి 3:35 గంటలకువైద్యులు చికిత్స అందించారు.

  • బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున నేను స్టార్‌ క్యాంపెయినర్‌ను. అందుకే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ కు ఒకరోజు ముందు ఈడీ అరెస్టు చేసింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించడానికి 10 రోజుల ముందు సీబీఐ అరెస్టు చేసింది.

  • చార్జిషీట్‌లో నా పేరు లేదు. మొదట నన్ను సాక్షిగా మాత్రమే విచారించారు. ఆ తర్వాత రాజకీయ కోణంలోనే నన్ను అరెస్టు చేశారు.

  • ఈ కేసు గురించి నాకు ఏమీ తెలియదు. ఈడీ, సీబీఐ ఒకే ప్రశ్నలు మళ్లీ మళ్లీ అడుగుతున్నాయి. నేనేమీ చెప్పడం లేదని ఈడీ, సీబీఐ చెబుతున్నాయి. ఆ సాకుతో ఎన్నికలు ముగీేస వరకూ నన్ను జైల్లోనే ఉంచాలని చూస్తున్నారు. నాకేమీ తెలియదు కాబట్టే ఎన్నిసార్లు అడిగీనా నేనేమీ చెప్పడం లేదు.

  • కేసు విచారణలో ఉన్నందున ట్రయల్‌ ప్రారంభం కావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే బెయిల్‌ ఇవ్వండి.

Updated Date - Apr 16 , 2024 | 03:41 AM