ఇంటికి శ్రీకారం!
ABN , Publish Date - Mar 03 , 2024 | 03:40 AM
పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు.. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ఈ నెల 11న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది.
11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం.. ఐదో గ్యారంటీ అమలుకు నిర్ణయం
సొంత ఇల్లు లేని అర్హులందరికీ ప్రయోజనం
తొలి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు
స్థలం ఉన్నవారికి రూ.5 లక్షల నగదు
లేని వారికి స్థలం ఇచ్చి రూ.5 లక్షల సాయం
వెంటనే విధి విధానాలు తయారు చేయండి
లబ్ధిదారు ఇష్టప్రకారమే ఇంటి నిర్మాణం..
కానీ ఒక వంట గది, టాయ్‌లెట్ తప్పనిసరి
డబుల్ బెడ్ రూం తరహా తప్పులు జరగొద్దు
ఇళ్ల పథకంపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు.. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని ఈ నెల 11న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు పథకం విధి విధానాలు, నిబంధనలను రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇంటి నమూనాలు, డిజైన్లు తయారు చేయించాలని సూచించారు. నిరుపేదల సొంతింటి కలను దశల వారీగా నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై శనివారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని అధికారులకు నిర్దేశించారు. లబ్ధిదారులకు ఆర్ధిక సాయం ఏయే దశల్లో విడుదల చేయాలనేదానిపై నిబంధనలను సిద్ధం చేయాలని సూచించారు. ఈ నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యతలను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వివిధ శాఖల్లో ఉన్న ఇంజినీరింగ్ విభాగాలకు అప్పగించాలని.. గూడు లేని పేదల సొంతింటి కలను దశల వారీగా నెరవేర్చడమే తమ సంకల్పమని సీఎం పేర్కొన్నారు. తొలి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇవ్వాలని గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. స్థలం లేని అర్హులైన పేదలకు స్థలమిచ్చి రూ.5 లక్షలు, స్థలం ఉన్నవారికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
ప్రజా పాలన దరఖాస్తులకు తొలి ప్రాధాన్యం
ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో చేసిన తప్పులు ఈసారి జరగకుండా చూడాలని అప్రమత్తం చేశారు. సొంత జాగాలో కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ నమూనాలు, డిజైన్లను తయారుచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. లబ్ధిదారులు వారి ఇష్టప్రకారమే నిర్మాణం చేసుకున్నప్పటికీ వంట గది, టాయ్‌లెట్ తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. కాగా, ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొన్న ఆరు హామీల్లో నాలుగింటి అమలును ఇప్పటికే ప్రారంభించారు. ఇళ్ల నిర్మాణ పథకానికీ శ్రీకారం చుడితే ఐదో హామీనీ పట్టాలెక్కించినట్లు అవుతుంది. సమీక్షలో మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, గృహ నిర్మాణ శాఖ అధికారులు ఈశ్వరయ్య, బలరాం పాల్గొన్నారు.