Share News

మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డిల అక్రమాలను బయటపెడుతాం

ABN , Publish Date - Mar 08 , 2024 | 11:08 PM

మాజీ మంత్రి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డిల అక్రమాలన్ని బయటపెడుతామని ఇది కేవలం శాంపిల్‌ మాత్రమేనని అసలు కథ ముందున్నదని మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, సుధీర్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రే్‌షయాదవ్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్‌రెడ్డి తెలిపారు.

మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డిల అక్రమాలను బయటపెడుతాం
మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

వందల కోట్లు ఇచ్చి మంత్రి పదవిని కొనుక్కున్న ఘనత మల్లారెడ్డిది

కూల్చివేతలకు, సీఎంకు సంబంధం లేదు: కాంగ్రెస్‌ పార్టీ నేతలు

మేడ్చల్‌ మార్చి 8(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మాజీ మంత్రి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డిల అక్రమాలన్ని బయటపెడుతామని ఇది కేవలం శాంపిల్‌ మాత్రమేనని అసలు కథ ముందున్నదని మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, సుధీర్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రే్‌షయాదవ్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వారు గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ పరిధిలో నేడు జరుగబోయే సీఎం బహిరంగ సభ వేదిక వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలోవారు మాట్లాడుతూ చిన్నదామర చెరువు ఎఫ్‌టీఎల్‌లో రాజశేఖర్‌రెడ్డి అక్రమంగా నిర్మాణాలు కట్టాడని, కూల్చివేయాలని 2011లోనే బీజేపీ, సీపీఎం, బీఆర్‌ఎస్‌ వాళ్లు ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు జేఏసీగా ఏర్పాటై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని వారు వివరించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం కూల్చివేతలు జరుగుతున్నాయని, కూల్చివేతలకు సీఎంకు గాని ఎవ్వరికి గాని ఎటువంటి సంబంధం లేదన్నారు. గతంలో వందల కోట్లు ఇచ్చి మంత్రి పదవి కొనుక్కున్న ఘనత మల్లారెడ్డిదన్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా తప్పులు చేసి ఇప్పుడు సుద్దపూసలా మాట్లాడుతున్నారన్నారు. మల్లారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీలో చేరనివ్వమని, పాలమ్మిన మల్లారెడ్డిని మళ్లీ అక్కడికే తీసుకెళ్తామన్నారు.

సీఎం సభను విజయవంతం చేయాలి

నేడు జరిగే సీఎం సభను విజవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. దాదాపు 50 వేల మందితో నిర్వహిస్తున్న సభకు మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల పరిధి నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ శ్రేణులు తరలిరావాలని వారు కోరారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంటు పై కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని వారు కోరారు. సమావేశంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 11:08 PM