Share News

మసీదును కోల్పోయాం.. మీ గుండెల్లో బాధ లేదా?

ABN , Publish Date - Jan 03 , 2024 | 04:12 AM

మనం 500 ఏళ్ల పాటు ఎక్కడైతే కూర్చుని ఖురాన్‌ చదివామో ఆ ప్రదేశం ఇప్పుడు మన చేతుల్లో లేదు. మనం మన మసీదుని కోల్పోయాం.

మసీదును కోల్పోయాం.. మీ గుండెల్లో బాధ లేదా?

బాబ్రీపై ముస్లిం యువతను ఉద్దేశించి మజ్లిస్‌ అధ్యక్షుడు ఒవైసీ వ్యాఖ్యలు

అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠాపన వేళ ఒవైసీ యువతను రెచ్చగొడుతున్నారు

జిన్నా ఆత్మ ఒవైసీలో ప్రవేశించింది: బీజేపీ

హైదరాబాద్‌, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ‘మనం 500 ఏళ్ల పాటు ఎక్కడైతే కూర్చుని ఖురాన్‌ చదివామో ఆ ప్రదేశం ఇప్పుడు మన చేతుల్లో లేదు. మనం మన మసీదుని కోల్పోయాం. అక్కడేం జరిగిందో మీరు చూస్తున్నారు. మీ గుండెల్లో బాధ లేదా?’ అని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ముస్లిం యువతను ప్రశ్నించారు. బాబ్రీ మసీదును ఉద్దేశించి ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఢిల్లీలోని సున్హేరీ మసీదు సహా మూడు నాలుగు మసీదుల విషయంలో జరుగుతున్న కుట్రను మీరు గమనించడం లేదా’ అని కూడా ఆయన ముస్లిం యువతను ప్రశ్నించారు. యాకుత్‌పురలోని తలాబ్‌కట్ట మదర్సా-ఎ-అరేబియా అన్వర్‌-ఉల్‌-ఉలూమ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘చాలా ఏళ్ల పాటు చేసిన కఠోర పరిశ్రమ వల్ల మనం ఈ స్థాయిలో ఉన్నాం. కానీ, తాజాగా జరుగుతున్న పరిణామాలను మనం గమనించుకోవాలి. ముస్లిం యువత అప్రమత్తంగా, సంఘటితంగా ఉండాలి. మీ బలం, మద్దతు కొనసాగించండి. మీ మసీదులు జనంతో నిండిపోవాలి. ఈ మసీదులను సైతం రేపు మన నుంచి లాక్కోవచ్చు. నేటి యువతే రేపటి పెద్దలు.

ముందుచూపుతో ప్రతి ఒక్కరూ ఎవరికి వారు... వారి కుటుంబానికి, వారి నగరానికి ఏం సాయం చేయగలరో లోతుగా ఆలోచించాలి. ఐకమత్యమే బలమ’ని ఒవైసీ పేర్కొన్నారు. ‘మన మసీదులను మన నుంచి లాక్కోనివ్వకుండా చూడాల’ని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను గమనించాలని సూచించారు. కాగా, అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠాపన మహోత్సవం సమీపిస్తున్న వేళ ఒవైసీ యువతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ మండిపడింది. భారత్‌లో హిందువులు, ముస్లింలది ఒకే డీఎన్‌ఏ అని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ అన్నారు. ఒవైసీని పాకిస్థాన్‌ వ్యవస్థాపకుడు మహమ్మద్‌ అలీ జిన్నాతో పోల్చారు. 1947లో జిన్నా భారత్‌ను వదిలి వెళ్లిపోయినా ఆయన ఆత్మ మాత్రం ఇక్కడే ఉండిపోయిందని, అది ఒవైసీలాంటి వ్యక్తుల్లోకి ప్రవేశించిందని వ్యాఖ్యానించారు. భారత్‌కు గుర్తింపు శ్రీరాముడు అని, ఈ దేశంలో బాబర్‌ కొడుకులు ఎవరూ లేరన్నారు. ఏ గజినీ, బాబర్‌, ఔరంగజేబుల కన్ను రామ మందిరం పడనివ్వబోమని, ఒకవేళ పడితే మహారాణా ప్రతా్‌పలా బదులిస్తామని హిందూ యువత ప్రతిజ్ఞ చేయాలన్నారు. 2020లో హైదరాబాద్‌లో సచివాలయం నిర్మాణం కోసం రెండు మసీదులను కూల్చివేసినప్పుడు ఒవైసీ నోరు మెదపలేదని మరో కేంద్ర మంత్రి అమిత్‌ మాలవియా విమర్శించారు.

Updated Date - Jan 03 , 2024 | 06:37 AM