Share News

అభివృద్ధి కోసం తండ్లాడి ఎన్నికల్లో తడబడ్డాం

ABN , Publish Date - Jan 18 , 2024 | 04:43 AM

‘‘తెలంగాణను పోరాడి తెచ్చుకున్నాం. అభివృద్ధి చేసేందుకు పదేండ్లు తన్లాడినం. అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డాం’’ అని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

అభివృద్ధి కోసం తండ్లాడి ఎన్నికల్లో తడబడ్డాం

ఇకపై కార్యకర్తలు కోరుకున్నట్లే పార్టీ పనిచేస్తుంది

కాంగ్రెస్‌ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీదే

వందరోజులు కాలేదని ఆగాం.. లేకుంటే చెండాడేవాళ్లం: హరీశ్‌

సొంత పార్టీ వారే ముంచారు: నాగర్‌కర్నూల్‌ బీఆర్‌ఎస్‌ శ్రేణులు

హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణను పోరాడి తెచ్చుకున్నాం. అభివృద్ధి చేసేందుకు పదేండ్లు తన్లాడినం. అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డాం’’ అని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా కేసీఆర్‌ రాష్ట్రాన్ని అభివృద్థి చేసిన విషయాన్ని ఎవరూ కాదనలేరన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలతో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సంప్రదాయ రాజకీయ పద్ధతులకు కేసీఆర్‌ దూరంగా ఉన్నారని, అది కొంత నష్టం చేసిందన్న భావన కార్యకర్తల్లో ఉందన్నారు. ‘‘మన పార్టీ స్థానం అధికారం నుంచి ప్రతిపక్షానికి మారింది. దీనికి అధైర్య పడాల్సిన అవసరం లేదు. ఓటమి నుంచి తేరుకుని నెలరోజులకే సమీక్ష సమావేశాలను ప్రారంభించాం. ఇది పదకొండో పార్లమెంటరీ స్థాయి సమావేశం. కార్యకర్తల నుంచి విలువైన సూచనలు వచ్చాయి. కార్యకర్తలు కోరుకుంటున్న ప్రకరామే ఇకపై పార్టీ పనిచేస్తుంది. మోసపూరిత హామీలతో గెలిచిన కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. వాటిని అమలు చేయమని అడిగితే.. కాకమ్మ కథలు చెబుతోంది’’ అని విమర్శించారు.

కాంగ్రెస్‌ పార్టీ వరుసగా పదేళ్లు పాలన సాగించడం అరుదని, ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుని ఐదేళ్లలోపే ఇంటికి పోయిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఈ దేశంలో ఎక్కువగా ఉన్నాయన్నారు. అరచేతిలో వైకుంఠం చూపేలా కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తెచ్చిందని, హామీల అమలు గడువు ప్రకారం వంద రోజులు కాలేదని ఆగామని, లేకుంటే.. కాంగ్రెస్‌ సర్కారును చీల్చి, చెండాడే వారిమన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలకు నిధుల్లేవని ఆ రాష్ట్ర సలహాదారు చెబుతున్నారని, ఇక్కడ కూడా కాంగ్రెస్‌ నేతలు చావుకబురు చల్లగా చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని జోస్యం చెప్పారు. ‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దావో్‌సకు వెళ్లడమంటే ఖర్చు దండగ అన్నారు. ఇప్పుడేమంటారు? సీఎం బృందం దావో్‌సకు వెళ్లింది. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ హత్యారాజకీయాలు మొదలు పెడుతోంది’’ అని హరీశ్‌ మండిపడ్డారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పైనా హరీశ్‌రావు ఫైర్‌ అయ్యారు. ‘‘కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ కొంటారని బండి సంజయ్‌ చెబుతున్నారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలను కూల్చిన, పలు ప్రాంతీయ పార్టీలను చీల్చిన చరిత్ర బీజేపీదే. ఆ విషయాన్ని ఆయన తెలుసు కోవాలి’’ అని సూచించారు.

కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లే..

అధికారంలో ఉన్నన్ని రోజులు పార్టీ కార్యకర్తలను, ముఖ్య నాయకులు పట్టించుకోనేలేదని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసు కునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు, ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారని తెలిసింది. పక్క పార్టీల వల్ల కాకుండా.. సొంత పార్టీ నేతలే ముంచారని ఆరోపించినట్లు సమాచారం. పార్టీ ఓటమికి కారణాలు చెబుతూ.. అధిష్ఠానం తీరుపైనా పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘‘అసంతృప్తి మొదలైనప్పుడే బుజ్జగించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. జూపల్లి కృష్ణారావు లాంటి వారు పార్టీని వీడడం వల్ల నష్టం వాటిల్లింది’’ అని వారు అభిప్రాయపడ్డట్లు తెలిసింది.

రాష్ట్రం పరువు తీసేలా రేవంత్‌ వ్యాఖ్యలు

దావోస్‌ పర్యటనలో ఉన్న సీఎం రేవంతర్‌ తెలంగాణ గురించి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రం పరువు తీసేలా ఉన్నాయని బీఆర్‌ఎస్‌ నేతలు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, విజయుడు, జైపాల్‌యాదవ్‌ ఆరోపించారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. విదేశీ పర్యటనల్లో సీఎం అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం తగదని, ఇటువంటి పరిస్థితులు ఇకపై రాకుండా చూసుకోవాలని హెచ్చరించారు.

Updated Date - Jan 18 , 2024 | 04:43 AM