Share News

నంబర్లూ ఇచ్చేశాం!

ABN , Publish Date - Mar 22 , 2024 | 04:54 AM

యునిక్‌ నంబర్లతో సహా ఎన్నికల బాండ్లకు సంబంధించి అన్ని వివరాలూ ఎన్నికల కమిషన్‌కు అందజేశామని పేర్కొంటూ స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సుప్రీంకోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేసింది.

నంబర్లూ ఇచ్చేశాం!

ఎన్నికల బాండ్ల పూర్తి సమాచారాన్ని ఈసీకి సమర్పించాం

రాజకీయ పార్టీల ఖాతా, కేవైసీ, కొనుగోలుదారుల కేవైసీ డేటా ఇవ్వలేదు

అవి లేకున్నా ఏ పార్టీకి ఎవరు ఎన్నెన్నివిరాళాలిచ్చారనే వివరాలు తెలుస్తాయి

సుప్రీంలో ఎస్‌బీఐ చైర్మన్‌ అఫిడవిట్‌.. తాజా వివరాలను ప్రచురించిన ఈసీ

న్యూఢిల్లీ, మార్చి 21: యునిక్‌ నంబర్లతో సహా ఎన్నికల బాండ్లకు సంబంధించి అన్ని వివరాలూ ఎన్నికల కమిషన్‌కు అందజేశామని పేర్కొంటూ స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సుప్రీంకోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేసింది. ఎన్నికల బాండ్లను కొన్నవారు వాటిని ఏ పార్టీలకు ఇచ్చారో తెలిపే కీలక సమాచారం యునిక్‌ బాండ్‌ నంబర్‌. ఆ నంబర్‌ లేకుండా ఈసీకి బాండ్ల వివరాలు అందించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహించిన నేపథ్యంలో.. ఆ వివరాలను కూడా సమర్పించినట్టు ఎస్‌బీఐ చైర్మన్‌ పేరిట దాఖలు చేసిన ఈ అఫిడవిట్‌లో వెల్లడించింది. అయితే.. బాండ్లను నగదుగా మార్చుకున్న రాజకీయ పార్టీల ఖాతా నంబర్లు, కేవైసీ తాలూకూ పూర్తి వివరాలను ఇస్తే వాటి భద్రతకు భంగం (అకౌంట్‌ నంబర్‌ ఆధారంగా సైబర్‌ క్రిమినల్స్‌ వాటిని టార్గెట్‌ చేసే ప్రమాదం ఉంది) కాబట్టి ఆ వివరాలను మాత్రం ఇవ్వలేదని పేర్కొంది. బాండ్లను కొనుగోలు చేసినవారి కేవైసీ వివరాలను కూడా ఇదే కారణాలతో సమర్పించలేదని వివరించింది. తాము ఇచ్చిన వివరాలతో ఏయే కంపెనీలు/ఎవరెవరు ఏయే పార్టీలకు బాండ్ల రూపంలో విరాళాలు సమర్పించిందీ తెలుస్తుందని.. ఆ వివరాలు తెలుసుకోవడానికి బ్యాంకు ఖాతాలు, కేవైసీ వివరాలు అక్కర్లేదని స్పష్టం చేసింది. ఎస్‌బీఐ సమర్పించిన ఈ వివరాలను భారత ఎన్నికల కమిషన్‌ తన వెబ్‌సైట్‌లో రెండు పీడీఎఫ్‌ ఫైళ్ల రూపంలో విడుదల చేసింది. ఒక పీడీఎ్‌ఫలో బాండ్లను కొనుగోలు చేసినవారి/కంపెనీ పేరు, బాండు విలువ, బాండ్‌ నంబర్‌, ఆ బాండును ఎప్పుడు కొనుగోలు చేసింది?, దాని ఎక్స్‌పైరీ డేట్‌, అది నగదుగా మారిందీ లేనిదీ.. తదితర వివరాలు ఇచ్చింది. మరొక పీడీఎఫ్‌ ఫైల్‌లో.. బాండ్‌ నంబ ర్‌, దాన్ని నగదుగా మార్చుకున్న పార్టీ పేరు, ఏ తేదీన ఆ బాండ్‌ను ఆ పార్టీ సొమ్ము చేసుకుంది, ఏ ఖాతాలో డబ్బు జమ అయ్యిందీ (ఖాతానంబర్‌ చివరి నాలుగు అంకెలు మాత్రమే ఇచ్చారు) తదితర వివరాలు ఉన్నాయి.

Updated Date - Mar 22 , 2024 | 10:31 AM