అప్పులపాలయ్యాం.. ఆదుకోరూ..
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:45 AM
‘కోట్లాది రూపాయల అప్పులు చేసి మిషన్ భగీరథతోపాటు గుట్టలపై ఉన్న ప్రాంతాల లిప్టుల పనులు చేపట్టాం. కానీ చేసిన పనులకు ఇప్పటి వరకు బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులుపడుతున్నాం. ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించి బిల్లులు చెల్లించి ఆదుకోవాలి’ ఇదీ మిషన్‌భగీరథతోపాటు లిప్టుల ఎత్తిపోతల పథకం కాంట్రాక్టర్ల ఆవేదన.
మిషన్‌భగీరథ, లిప్టు ఎత్తిపోతల పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు
ఏళ్లు గడుస్తున్నా మిషన్‌భగీరథ బిల్లులు రావడం లేదని ఆవేదన
చేసిన లిఫ్ట్ పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ల ఇబ్బందులు
పూర్తిచేసిన పనులకు బిల్లులు చెల్లించాలని వేడుకోలు
దేవరకొండ, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ‘కోట్లాది రూపాయల అప్పులు చేసి మిషన్ భగీరథతోపాటు గుట్టలపై ఉన్న ప్రాంతాల లిప్టుల పనులు చేపట్టాం. కానీ చేసిన పనులకు ఇప్పటి వరకు బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులుపడుతున్నాం. ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించి బిల్లులు చెల్లించి ఆదుకోవాలి’ ఇదీ మిషన్‌భగీరథతోపాటు లిప్టుల ఎత్తిపోతల పథకం కాంట్రాక్టర్ల ఆవేదన. నల్లగొండ జిల్లా దేవరకొండ డివిజన్‌లోని మిషన్‌భగీరథ పనులు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా చేసిన పనులకు బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చింతపల్లి మండలానికి చెందిన రమారావు అనే కాంట్రాక్టర్ 2018లో రూ.27లక్షలతో మిషన్‌భగీరథ పైప్‌లైన్‌లు, నల్లాల పనులకు అగ్రిమెంట్ చేసుకొని సంవత్సరంలోపే పనులను పూర్తిచేశారు. పైప్‌లైన్ పనులు పూర్తికావడంతో మంచినీరు సరఫరా అవుతోంది. కాని చేసిన పనులకు సంబంధించి రూ.7లక్షలకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నల్లగొండ, హైదరాబాద్‌లోని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితంలేకుండా పోయిందని ఆయన వాపోయారు. చింతపల్లికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు కాంట్రాక్ట్ పనులు కూడా చేస్తుంటాడు. ఆయన 2019లో రూ.60లక్షలతో పైప్‌లైన్ పనులు పూర్తిచేశాడు. ఇప్పటివరకు రూ.25లక్షల బిల్లులే వచ్చాయి. మిగితా రూ.35లక్షల బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఐదు సంవత్సరాల క్రితం పనులు పూర్తి చేసినప్పటికీ బిల్లులు రాకపోవడంతో హైదరాబాద్‌లో ఇల్లు అమ్ముకొని విధిలేని పరిస్థితిలో అప్పులు తీర్చాల్సి వచ్చిందని తన గోడును వెలిబుచ్చారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా చేసిన పనులకు 2019లోనే బిల్లులు రాలేదని ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని పేర్కొన్నారు. 2023 అక్టోబరులో చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని హైదరాబాద్ వెళ్లి మిషన్‌భగీరథ ఇంజనీరింగ్ చీఫ్ కృపాకర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం కూడా అందజేశామని తెలిపారు.
బిల్లులు రాక.. పనులు సాగక
. దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి, గుడిపల్లి, దేవరకొండ, డిండి, పీఏపల్లి మండలాల్లోని కాంట్రాక్టర్లకు చేసిన పనులకు బిల్లులు రాకపోవడం, పెట్టుబడులు వడ్డీకి తేవడంతో పెనుభారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి చేసిన పనులకు బిల్లులు వచ్చేలా చూసి ఆదుకోవాలని మిషన్‌భగీరథ పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లు వేడుకుంటున్నారు.
. నాగార్జునసాగర్ ముంపునకు గురైన బాధితులు చందంపేట, నేరేడుగొమ్ము, పీఏపల్లి మండలాలలోని గుట్టలపై ఉన్న గ్రామాల్లో పునరావాసం ఏర్పాటు చేసుకొని పంటలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఆ గ్రామాల రైతులకు లిప్టుల ద్వారా సాగునీరు అందించాలని 2021 ఫిబ్రవరి 19న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేశారు. నిధులు కేటాయించకపోవడం, అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో కొన్ని లిప్టుల పనులు మందకొడిగా సాగుతున్నాయి. మరికొన్ని శంకుస్థాపనకే పరిమితమయ్యాయి.
. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంభాలపల్లి అంభా భవాని ఎత్తిపోతల పథకం పనులు 25శాతంపైగా పూర్తయ్యాయి. కాంట్రాక్టర్‌కు రూ.60 కోట్లకుపైగా బిల్లులు రావాల్సి ఉంది. దీంతో కాంట్రాక్టర్‌లు పనులు నిలిపివేశారు. వర్షాలు కురవడంతో నీరు చేరుకొని పనులు నిలిచిపోయాయి. చేసిన పనులకు బిల్లులు చెల్లించి ఆదుకోవాలని మిషన్‌భగీరథ, ఎత్తిపోతల పథకాల కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదిక పంపించాలి
మిషన్‌భగీరథ ద్వారా చేపట్టి పూర్తయిన పనుల వివరాల నివేదికను ఉన్నత అధికారులకు పంపించాం. కాంట్రాక్టర్‌లకు కొంతమేర చేసిన పనులకు డబ్బులు వస్తున్నాయి. పూర్తిస్థాయిలో చేసిన పనులకు డబ్బులు అందేవిధంగా ఉన్నత అధికారులకు తెలియజేస్తాం.
- వెంకటేశ్వర్లు, మిషన్‌భగీరథ ఎస్‌ఈ.