Share News

మేం కూడా గేట్లు ఎత్తినం!

ABN , Publish Date - Mar 18 , 2024 | 04:45 AM

పార్టీ ఫిరాయింపులకు తాము కూడా గేట్లు ఎత్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఒక సిటింగ్‌ ఎమ్మెల్యే, సిటింగ్‌ ఎంపీ గేటు తెరుచుకొని వచ్చేశారని, అవతలి వైపు ఖాళీ అయ్యేదాకా ఇలాగే ఉంటుందని అన్నారు.

మేం కూడా గేట్లు ఎత్తినం!

వంద రోజులు పూర్తిగా పాలనకే.. ఇక నా రాజకీయం చూపిస్తా

కుట్రలను తిప్పికొట్టాలంటే కఠినమైన నిర్ణయాలు తప్పవు

విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్‌ ఇచ్చిన నోటీసు సరికాదు

కేసీఆర్‌ నాటిన గంజాయి మొక్కలను ఏరిపారేస్తున్నాం

ఈఆర్‌సీ చైర్మన్‌ ఇంటి పేరు తన్నీరు

ఉన్నంత మాత్రాన.. ఆయన పన్నీరు అనుకోవద్దు

కేసీఆర్‌, నిజాం ఇద్దరి తీరు ఒక్కటే.. పేర్లు మాత్రమే వేరు

రాష్ట్ర ప్రజలపై రూ.9 లక్షల కోట్ల అప్పుల కుంపటి పెట్టారు

ప్రవీణ్‌కు టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఇస్తామన్నా అంగీకరించలే

జీఎస్టీ రాబడి పెరుగుతోంది.. సంక్షేమానికి ఖర్చు చేస్తం

గ్రేటర్‌లో 4 సహా 14కు పైగా ఎంపీ సీట్లు గెలుస్తాం

టీయూడబ్ల్యూజే ‘మీట్‌ ది మీడియా’లో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయింపులకు తాము కూడా గేట్లు ఎత్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఒక సిటింగ్‌ ఎమ్మెల్యే, సిటింగ్‌ ఎంపీ గేటు తెరుచుకొని వచ్చేశారని, అవతలి వైపు ఖాళీ అయ్యేదాకా ఇలాగే ఉంటుందని అన్నారు. వంద రోజులు మంచి పరిపాలన అందించామని, ఎవరొచ్చినా చేరికల దాకా పోకుండా పరిపాలనకే పరిమితమయ్యామని చెప్పారు. కానీ, ప్రతిరోజూ బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని పడగొడతామంటూ కుట్రలు చేస్తున్నారని, ఆ కుట్రలను తిప్పి కొట్టాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఆదివారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘వంద రోజుల ప్రజాపాలన.. మీట్‌ ది మీడియా’ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ‘‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి పారదర్శకంగా పనిచేసే అవకాశం ఇవ్వకుండా.. కేసీఆర్‌ నుంచి మొదలుకొని కడియం శ్రీహరి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ప్రకటనలు చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలు పూర్తికాగానే ఆపరేషన్‌ మొదలుపెడతామని బహిరంగంగా అంటున్నారు. ఇది దేనికి సంకేతం? ఈ వంద రోజుల్లో మేం ఎక్కడైనా ఫిరాయింపులను ప్రోత్సహించామా? రాజకీయ ప్రయోజనాలు ఆశించామా? వాళ్లిద్దరూ (బీఆర్‌ఎస్‌, బీజేపీ) ఒకే లైన్‌లో మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూసుకుంటూ కూర్చుంటామా? నేను ఇదివరకే చెప్పిన. తారీఖు మీరే చెప్పండి.. చూసుకుందామని. అందుకే ఈరోజు మొదలుపెట్టిన. నిన్న కోడ్‌ రానంతవరకు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించిన. ఇప్పుడు ఎన్నికల నగారా మోగినందున.. ఎన్నికల రూపం చూపిస్తా. ఈ రోజు నుంచి పీసీసీ అధ్యక్షుడిగా పని మొదలుపెట్టిన. ఒక గంటలో మీ దృష్టికి వస్తది’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. ఔటర్‌ రింగురోడ్డు లోపలి వైపు ఉన్న సిటీ మొత్తాన్ని గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోకి తీసుకొస్తామని, ఔటర్‌ నుంచి రీజినల్‌ రింగురోడ్డు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని హెచ్‌ఎండీఏ పరిధిలోకి తీసుకొస్తామని తెలిపారు. రీజినల్‌ రింగు రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్న ప్రాంతాన్ని రూరల్‌ తెలంగాణగా పరిగణించి అభివృద్ధి చేస్తామని వివరించారు. వైబ్రెంట్‌ తెలంగాణ-2050 సాధనే లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేస్తామని ప్రకటించారు.

నిజాం నవాబు, కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటే..

‘‘భారతదేశ చరిత్రలో 1948 సెప్టెంబరు 17వ తేదీకి ఎలాంటి ప్రత్యేకత ఉందో.. తెలంగాణ రాష్ట్రంలో 2023 డిసెంబరు 3వ తేదీకి కూడా అంతే ప్రత్యేకత ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘ఏడు తరాలపాటు తన రాచరికాన్ని, ఆధిపత్యాన్ని ప్రజలమీద రుద్ది, స్వేచ్ఛాయుత వాతావరణం లేకుండా పెత్తనం చేసిన నిజాం ప్రభుత్వం సాయుధ రైతాంగ పోరాటానికి తలొగ్గి సెప్టెంబరు 17న ఎలా కూలిపోయిందో.. కేసీఆర్‌ ప్రభుత్వం కూడా డిసెంబరు మూడో తేదీన అలాగే కూలిపోయింది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు, నిజాం కాలేజీ, నిజాం హాస్పిటల్‌, ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్‌ తానే కట్టానని, తెలంగాణ ప్రజలకు కావాల్సినవన్నీ ఇచ్చానని, సంక్షేమం- అభివృద్ధి తానే చేశానని, వారసత్వంగా ప్రజలు బానిసలుగా ఉండాలని, వెట్టిచాకిరి చేయాలని, ఎనిమిదో తరం కూడా తన వారసులే ఏలుతారని ఏడో నిజాం ప్రభువు కోరుకున్నడు. కానీ, ఈ ప్రాంత ప్రజలు అంగీకరించలేదు. కట్టుబానిసత్వం, వెట్టిచాకిరి, హరించిన స్వేచ్ఛ ముందు ఏమిచ్చినా తక్కువేనని భావించి.. కమ్మూనిస్టులు, ఎర్రజెండా నీడలో వేలాది మంది రైతులు ప్రాణత్యాగాల ుచేసి, పోరాటాలు చేసి నిజాం నిరంకుశత్వం నుంచి విముక్తి కలిగించారు. అలాగే.. 2014 జూన్‌ రెండో తేదీన ఏర్పడిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా.. కాళేశ్వరం కట్టానని, కల్యాణలక్ష్మి ఇచ్చానని, సచివాలయం కట్టానని, ప్రగతిభవన్‌ నిర్మించుకున్నానని అధికార గర్వంతో విర్రవీగి.. తన వారసత్వాన్ని తెలంగాణ ప్రజల నెత్తిమీద రుద్దటానికి, కట్టుబానిసలుగా మార్చటానికి ప్రయత్నించారు. ఆనాడు ఖాసీం రిజ్వీని అడ్డుపెట్టుకొని నిజాం నవాబు ఎలాంటి దారుణాలకు ఒడిగట్టాడో.. కేసీఆర్‌ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రభాకర్‌రావు అనే ఖాసీం రిజ్వీని అడ్డం పెట్టుకొని ప్రజల ఛీత్కారానికి గురయ్యారు. విజ్ఞులైన తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ కుటుంబాన్ని ఎన్నికల్లో అంతమొందించారు. నూటికి నూరుశాతం ఇద్దరిలో సారూప్యత ఉంది. కేసీఆర్‌- నిజాం.. పేర్లు మాత్రమే వేరు. విధానాలు, ఆలోచనలు ఇద్దరివీ ఒక్కటే’’ అని రేవంత్‌ అన్నారు.

సాంస్కృతిక, సంక్షేమ, పరిపాలనా విధానాలు

సహజసిద్ధంగా, వారసత్వంగా ఏర్పడిన సంస్కృతిపై దాడిచేసి కొత్త సంస్కృతిని నెలకొల్పాలనే ధోరణిలో నియంతృత్వ పాలకులు గతంలో కొందరు ఉండేవారని సీఎం రేవంత్‌ తెలిపారు. కేసీఆర్‌ కూడా అదే తరహాలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాలగర్భంలో కలిపేశారని ఆరోపించారు. ‘‘ఉద్యమంలో టీజీ ఉంటే తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ టీఎ్‌సను తీసుకొచ్చారు. తెలంగాణ తల్లి అంటే.. ఆయన కుటుంబ సభ్యురాలి మాదిరిగానే ఉండాలనే విధానాన్ని అమలు చేసి సంస్కృతిపై దాడి చేశారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిషేఽధించారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరికపు పోకడలు, జమీందారీ విధానాలనే కేసీఆర్‌ పొందుపరిచారు. కొందరు కవులు, కళాకారులను తన గడీలో బంధించి దొరగారి భుజకీర్తులను శ్లాఘించుకున్నారు. అందుకే టీఎ్‌సకు బదులుగా టీజీని తీసుకొచ్చినం! జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించాం. ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ప్రజలకు అందుబాటులో ఉంటున్నం. సంక్షేమం, అభివృద్ధిని కూడా పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తున్నాం’’ అని రేవంత్‌ వివరించారు.

రాష్ట్రంపై రూ.9 లక్షల కోట్ల అప్పుల కుంపటి..

పౌరసరఫరాల సంస్థలో రూ.60 వేల కోట్ల అప్పులున్నాయని, విద్యుత్తు సంస్థలపై రూ.81 వేల కోట్ల అప్పు ఉందని, మరో రూ.20-25 వేల కోట్ల మొండి బకాయిలు ఉన్నాయని సీఎం రేవంత్‌ తెలిపారు. అన్ని లెక్కలూ తీస్తే స్థూలంగా రూ.9 లక్షల కోట్ల అప్పుల కుంపటి రాష్ట్ర ప్రజలపై ఉందని వెల్లడించారు. ‘‘2014 జూన్‌ 2న తెలంగాణ ఏర్పడినప్పుడు.. ఈ రాష్ట్రం ఏడాదికి చెల్లించాల్సిన అప్పు రూ.6 వేల కోట్లు ఉండేది. మొన్న 2023 డిసెంబరు 7న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పుడు లెక్క చూస్తే.. ఏడాదికి రూ.64 వేల కోట్ల అప్పు చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడది రూ.70 వేల కోట్లకు పెరిగింది. 600 శాతం అప్పులు చెల్లించే పరిస్థితి కేసీఆర్‌ కల్పించారు. ప్రతి నెలా జీతభత్యాలు, పెన్షన్లు, ప్రభుత్వ నిర్వహణ కోసం అన్నీ కలిపి ఏటా రూ.1.20 లక్షల కోట్లు మార్చి నెలాఖరుకు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రతి నెలా తక్కువలో తక్కువగా రూ.11 వేల కోట్లు అవసరమవుతున్నాయి. ఆర్థిక నిబద్ధతతో పనిచేస్తున్నాం’’ అని అన్నారు.

నీ ఇంటిపేరు తన్నీరు ఉన్నంత మాత్రాన.. నీవు పన్నీరు కాదు!

కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో చాలా విభాగాల్లో విష పురుగులు, గంజాయి మొక్కలను నాటారని, ఆ గంజాయి మొక్కలు పరిమళాలు వెదజల్లుతూనే ఉన్నాయని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. ‘‘విద్యుత్తు సంస్థలకు ముందుగా సబ్సిడీ చెల్లించిన తర్వాతే.. జీరో బిల్లులు ఇవ్వాలని తెలంగాణ విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్‌ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. ఆ మేధావిని నేను అడుగుతున్నా. ఇన్ని రోజులు ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటు ఇస్తే.. ఏ రోజైనా ఇలాంటి ఆదేశం ఇచ్చావా? నీ జాతి బుద్ధి ఇంకా పోనిచ్చుకోవడంలేదు. నీ ఇంటిపేరు తన్నీరు ఉన్నంత మాత్రాన.. నీవు పన్నీరు అనుకుంటున్నావా? కేసీఆర్‌ ప్రభుత్వం 40 వేల కోట్ల విద్యుత్తు సబ్సిడీలకు బొక్క పెడితే ఈ తన్నీరు (ఈఆర్‌సీ చైర్మన్‌ తన్నీరు శ్రీరంగారావు) కళ్లకు కనిపించలేదా? తన్నీరూ.. గుర్తుపెట్టుకో! నీవు కూడా ఎక్కువసేపు ఆ కుర్చీలో కూర్చోలేవు. యథాలాపంగా ఉన్నప్పుడు వేటు వేద్దామనుకుంటున్నావేమో! అలా కుదరదు. అందుకే ఈ గంజాయి మొక్కలను ఏరిపారేస్తున్నా. పేదలకు గృహజ్యోతి జీరో బిల్లు పథకాన్ని అమలు చేయటానికి, ఉచిత్‌ విద్యుత్తు అమలు చేయటానికి ఎవరు అడ్డొచ్చినా.. అడ్డం తొలగించుకొని ముందుకెళ్తాం’’ అని సీఎం ప్రకటించారు.

విలేకరులు అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్‌ సమాధానాలు..

రైతుబంధులో 5 ఎకరాల వరకు 62 లక్షల మందికి ఖాతాల్లో డబ్బులు జమ చేశాం. భవిష్యత్తులో అమలు చేసే రైతు భరోసా పథకంలో.. గుట్టలు, చెట్లు, పుట్టలు, రాళ్లు, రప్పలు, లేఅవుట్లు, బంగళాలకు ఇచ్చేదిలేదు. అనర్హులుంటే సర్వే చేసి ఆ భూములు తొలగిస్తాం. ఈ మధ్య మీ ‘ఆంధ్రజ్యోతి’లో కూడా కథనాలు రాశారు. జాతీయ రహదారి రోడ్ల కింద పోయిన భూములకు కూడా రైతుబంధు ఇస్తున్నారని! అవన్నీ తొలగిస్తాం.

రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం పెరుగుతోంది. మొదటి నెలలో రూ.289 కోట్లు, రెండో నెల రూ. 500 కోట్లు పెరిగింది. ఈ నెల రూ.700 కోట్లు పెరుగుతుంది. వచ్చే మూడు నెలల్లో ప్రతి నెలా జీఎస్టీలో రూ.1,000 కోట్ల ఆదాయం అదనంగా వస్తుంది. పన్ను ఎగవేతదారులను వదిలిపెట్టేదిలేదు. ఎక్సైజ్‌లోనూ ఇలాంటివి జరుగుతున్నాయి. లెక్కలు చూస్తే ఒక్క ఏడాది పన్నులో తేడా రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లు వచ్చింది. ఐదేళ్ల లెక్క తీస్తే ఇంకా పెరుగుతుంది. ఏడాదికి రూ.12 వేల కోట్ల జీఎస్టీ ఆదాయం పెరిగితే.. ఆ నిధులను సంక్షేమ పథకాలకు ఖర్చు పెడతాం.

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఎన్‌డీఎ్‌సఏ విచారణ కొనసాగుతోంది. జ్యుడీషియల్‌ విచారణకు కూడా ఆదేశించాం. ఆ నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకుంటాం. కక్షసాధింపు చర్యలు ఉండవు. కేసీఆర్‌ కుటుంబానికి అధికారం కోల్పోవడమే శిక్ష.

ఎన్నికల వ్యూహం మాకు స్పష్టంగా ఉంది. గ్రేటర్‌ పరిధిలో 4 ఎంపీ సీట్లు, రాష్ట్రంలో 14 కు పైచిలుకు సీట్లు ఎలా గెలవాలో మాకంటూ ఓ ప్రణాళిక ఉంది. ఏపీలోనే కాదు.. గతంలో కేరళలో కూడా ప్రచారానికి వెళ్లిన. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఏపీకి వెళ్లిన! ఈ రోజు మహారాష్ట్ర వెళ్తున్న.

బీజేపీకి రాష్ట్రంలో 8 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే ఉన్నాయి. బీఆర్‌ఎ్‌సకు 38 సీట్లు ఉన్నాయి. రెండు పార్టీలు కలిసినా మ్యాజిక్‌ ఫిగర్‌ చేరుకునే అవకాశం లేదు. కానీ, ఎందుకు మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారో అర్థంకావడంలేదు. ఇకమీదట ఉపేక్షించేది లేదు. మాల్‌ మసాలా అంతా రెడీగా ఉంది. ఎలా అంటే అలా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా.

మేం పదేళ్లు అధికారంలో ఉంటామనే భరోసాతో ఉన్నాం. ఆ తర్వాత కూడా ప్రజలు ఆశీర్వదిస్తే కొనసాగుతాం. అయితే అభివృద్ధికి ఐదేళ్లకు, పదేళ్లకు రోడ్‌ మ్యాప్‌ రూపొదించటం సరైన చర్య కాదు. అందుకే మేం వైబ్రెంట్‌-2050 అనే లక్ష్యం పెట్టుకున్నాం. 25 ఏళ్ల ముందుచూపుతో మెగా మాస్టర్‌ ప్లాన్‌ తయారుచేస్తున్నాం. రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కూడా ఎలాంటి ఢోకా లేదు. ఎన్నికల సమయంలో కాస్త స్తబ్ధుగా ఉండటం సహజం. పార్లమెంటు ఎన్నికల తర్వాత మళ్లీ పుంజుకుంటుంది. భవిష్యత్తులో మేడ్చల్‌ వరకు కూడా మెట్రోరైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తాం.

ఈ రోజు ఒక గేటు ఓపెన్‌ చేసిన. ఒక సిటింగ్‌ ఎమ్మెల్యే, సిటింగ్‌ ఎంపీ గేటు తెరుచుకొని వచ్చేశారు. అవతలి వైపు ఖాళీ అయ్యేదాకా అలాగే ఉంటది. అయితే చేరికలపై కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. చేరికలతో ఉపయోగం ఉందా? లేదా? స్థానిక పరిస్థితులేంటి? సామాజికవర్గాలేంటి? బలాబలాలేంటి? అనే అంశాలపై పార్టీ చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుంది. కొత్తగా పార్టీలో చేరినవారు.. వచ్చీరాగానే అధికారాన్ని చెలాయించే పరిస్థితి ఉండదు. ఏఐసీసీ అధ్యక్షుడి ఆదేశాల మేరకు చేరికలు, ఎన్నికల్లో పోటీకి టికెట్లు సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ నిర్ణయిస్తుంది.

సీఎం రేవంత్‌ సమాధానాలు..

కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మంత్రివర్గ కూర్పు, ప్రభుత్వ విప్‌లు, ముఖ్యమంత్రి పేషీ సహా చీఫ్‌ సెక్రటరీల నుంచి ప్రిన్సిపల్‌ సెక్రటరీల వరకు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాల్లో సామాజిక సమతుల్యతను పాటించాం. సామాజిక న్యాయానికి మారుపేరుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తుంది.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగిన అవినీతి వందల కోట్లకు పరిమితం కాలేదు. రూ.వేల కోట్లకు పెరిగిపోయింది. అవినీతి, అక్రమాలపై విచారణ సంస్థలు నివేదిక ఇచ్చిన తర్వాత ఆ వివరాలు వెల్లడిస్తాం. అక్రమార్కులను వదిలేది లేదు. గతంలో ఏసీబీ నామమాత్రంగా పనిచేసేది. ఇప్పుడు ఏసీబీ దూకుడుగా పోతోంది. అవీనితిపరులపై రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకుంటాం.

అమ్మగారు లేరు కదా.. బతుకమ్మ పండుగ ఎలా జరపాలి? అని కొందరు ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది. బతుకమ్మను వ్యాపారంగా, సహజమైన పూల నుంచి ప్లాస్టిక్‌ పూల బతుకమ్మగా మార్చింది కూడా కేసీఆర్‌ కుటుంబమే. ఈసారి ప్లాస్టిక్‌ పూలతో బతుకమ్మ ఆడేటోళ్లు లేకపోవచ్చు. బతుకమ్మలు, బోనాలు, ఇతరత్రా పండుగలు.. ఎవరున్నా, ఎవరు లేకపోయినా కొనసాగుతూనే ఉంటాయి.

ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడటంతో భూగర్భ జలాలు పడిపోయాయి. తాగునీటి, సాగునీటి సమస్యలు అక్కడక్కడ వస్తున్నాయి. వాటిని పరిష్కరిస్తున్నాం. బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు చేస్తున్నంత పరిస్థితి రాష్ట్రంలో లేదు. కొందరు నేతలు లైన్‌మెన్లకు ఫోన్‌చేసి విద్యుత్తు సరఫరా నిలిపివేయిస్తున్నారు. అందుకే కొందరు సైకో ఫ్యాన్స్‌పై చర్యలు తీసుకున్నాం. నీరు, కరెంటు సరఫరా నిలిపివేస్తే ఉపేక్షించేదిలేదు.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే జీవోలు ఏవీ కూడా దాచిపెట్టాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. జీవోలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తాం. కొద్దిరోజుల్లో సమాచార హక్కు కమిషనర్లను నియమిస్తాం

ధరణి పోర్టల్‌ గతంలో ఒక ప్రైవేటు సంస్థ చేతిలో ఉండేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండే ‘సీజీజీ’ అనే సంస్థకు అప్పగించినం. పోర్టల్‌ సమస్యలు, అప్పటి ప్రభుత్వ నిర్ణయాలపై విచారణకు ఒక కమిటీ వేసినం. 2014కు ముందు భూములు ఎవరి పేర్లపై ఉన్నాయి? ఆ తర్వాత ఎలా మార్పు చెందుతూ వచ్చాయి? అధికార దుర్వినియోగం ఎలా జరిగింది? అనే అంశాలపై విచారణ పూర్తికాగానే చర్యలు తీసుకుంటాం.

ఈటలకు చిత్తశుద్ధి ఉంటే.. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలి. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌ చేరతాడని అనుకోవడంలేదు. టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌గా ప్రవీణ్‌కుమార్‌ను నియమిస్తానని ఆఫర్‌ ఇచ్చిన. 15 రోజులు జాప్యం కావడానికి ఇదో కారణం. కానీ, ప్రవీణ్‌కుమార్‌ అంగీకరించలేదు.

Updated Date - Mar 18 , 2024 | 04:45 AM