Share News

కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేది లేదు

ABN , Publish Date - Feb 13 , 2024 | 03:42 AM

నీటి వాటాలు తేలే దాకా కృష్ణా ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు శాసనసభలో సోమవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ తీర్మాన కాపీని అసెంబ్లీలో చదివి వినిపించారు. ‘‘దక్షిణ తెలంగాణలో తాగు, సాగు నీటికి కృష్ణా

కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేది లేదు

తెలంగాణ, ఏపీ మధ్య నీటి వాటా తేలేదాకా ఒప్పుకోం

అసెంబ్లీలో సర్కారు తీర్మానం... ఏకగ్రీవంగా ఆమోదం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): నీటి వాటాలు తేలే దాకా కృష్ణా ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు శాసనసభలో సోమవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ తీర్మాన కాపీని అసెంబ్లీలో చదివి వినిపించారు. ‘‘దక్షిణ తెలంగాణలో తాగు, సాగు నీటికి కృష్ణా జలాలే ప్రాణాధారం. గతంలో బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డు మేరకు 811 టీఎంసీల నీటిని గంపగుత్తగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. దీంతో గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా నీటిపారుదల సామర్థ్యాన్ని గణనీయంగా సృష్టించాయి. కానీ, తెలంగాణ ఏర్పాటు తర్వాత కృష్ణా బేసిన్‌ అవసరాలకు గత ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంరఽధప్రదేశ్‌కు 512 టీఎంసీలు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేసీఆర్‌ సర్కారు అంగీకరించింది. పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య నీటి భాగస్వామ్యాన్ని నియంత్రించేందుకు కృష్ణా బోర్డు(కేఆర్‌ఎంబీ)ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌ను కూడా కేఆర్‌ఎంబీకే అప్పగించాలని కేసీఆర్‌ సర్కారు ప్రతిపాదించింది. ఇది తెలంగాణ ప్రయోజనాలకు పూర్తిగా విఘాతం కలిగించడమే. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా కేఆర్‌ఎంబీ అధికార పరిధిని నోటిఫై చేసింది. దీనిపై గత ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. గత ఏడాది నవంబరు 29న రాత్రి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాయుధ పోలీసులను పంపి, బలవంతంగా సాగర్‌ డ్యామ్‌ కుడివైపు భాగాన్ని స్వాధీనం చేసుకుంది.

అప్పటి వరకు సాగర్‌ డ్యామ్‌ తెలంగాణ ఆధీనంలో ఉంది. ఈ ఘటన తర్వాత కేంద్రం రంగంలోకి దిగి సీఆర్పీఎఫ్‌ బలగాలను మోహరించి, ఏపీ పోలీసులను వెనక్కి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన షరతులను పట్టించుకోని పక్షంలో కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేది లేదు. పరీవాహక ప్రాంతం, కరువు పీడిత ప్రాంతం, బేసిన్‌ జనాభా, సాగు చేయదగిన ప్రాంతాల ఆధారంగా ఏపీ, తెలంగాణ మధ్య నీటి భాగస్వామ్యం ఉండాలి. నాగార్జున సాగర్‌కు 264 టీఎంసీల నీటిని కేటాయించేందుకే 1962లోశ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టును ప్రణాళిక సంఘం మంజూరు చేసింది. కృష్ణా వాటర్‌ డిస్ప్యూట్‌-1 అవార్డు ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్‌ అవుట్‌ సైడ్‌ బేసిన్‌కు 34 టీఎంసీలు (చైన్నె నీటి అవసరాలకు 15 టీఎంసీలు, మరో 19 టీఎంసీలు ఎస్‌ఆర్‌బీసీకి) మాత్రమే కేటాయించారు. మొత్తం వినియోగంలో 20శాతం తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలి. కేంద్ర జల సంఘం ఆమోదిస్తే తప్ప కృష్ణా జలాలను బయట బేసిన్‌కు మళ్లీంచేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు’’ అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. అనంతరం ఈ అంశంపై చర్చ జరిగింది. ఈ తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ ప్రకటించారు.

Updated Date - Feb 13 , 2024 | 03:42 AM