Share News

Wall collapsed : ప్రహరీ కూలి.. శిథిలాల కింద నలిగి..

ABN , Publish Date - Jun 04 , 2024 | 04:52 AM

పాపం... ఆ చిన్నారులకేం తెలుసు.. అది శిథిలావస్థకు చేరిన ప్రహరీ అని.. అప్పటికే వర్షానికి బాగా తడిసి కూలేందుకు సిద్ధంగా ఉందని! ఆ గోడకు మేకు కొట్టి తాడు కట్టి మరో చివరను ఓ చెట్టుకు కట్టి సరదాగా ఉయ్యాల ఊగుతున్నారు. అప్పటికే శిథిలమై, వర్షానికి తడిసిపోవడానికి తోడు పందికొక్కులు చేరి

Wall collapsed : ప్రహరీ కూలి.. శిథిలాల కింద నలిగి..

ఇద్దరు పిల్లల దుర్మరణం.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు

రాజేంద్రనగర్‌, పేట్‌బషీరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): పాపం... ఆ చిన్నారులకేం తెలుసు.. అది శిథిలావస్థకు చేరిన ప్రహరీ అని.. అప్పటికే వర్షానికి బాగా తడిసి కూలేందుకు సిద్ధంగా ఉందని! ఆ గోడకు మేకు కొట్టి తాడు కట్టి మరో చివరను ఓ చెట్టుకు కట్టి సరదాగా ఉయ్యాల ఊగుతున్నారు. అప్పటికే శిథిలమై, వర్షానికి తడిసిపోవడానికి తోడు పందికొక్కులు చేరి గోడ కింద బొయ్యారం పడటం.. దానికి ఊయల ఒత్తిడీ తోడవడంతో ప్రహరీ నిలువునా కూలిపోయింది. ఆ శిథిలాలన్నీ పిడుగుల్లా చిన్నారుల మీద పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ మైలార్‌దేవుపల్లి డివిజన్‌ బాబుల్‌రెడ్డినగర్‌ బస్తీలో ఉదయం 10:30కు ఈ ఘటన జరిగింది. మృతులు, క్షతగాత్రులంతా పదేళ్లలోపు పిల్లలే! బిహార్‌ సమస్థీపూర్‌ జిల్లా కల్యాణపూర్‌కు చెందిన మహ్మద్‌ అక్బర్‌, మహ్మద్‌ నజీమ్‌, మహ్మద్‌ అప్జల్‌కు చెందిన మూడు కుటుంబాలు తొమ్మిదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలసొచ్చాయి. బాబుల్‌రెడ్డినగర్‌లో కె. వెంకటేశంగుప్తా ఇంట్లో అద్దెకుంటున్నారు. మహ్మద్‌ అక్బర్‌, మహ్మద్‌ నజీమ్‌, మహ్మద్‌ అప్జల్‌ సోమవారం పనికి వెళ్లారు. ఇంటి వద్ద ఈ మూడు కుటుంబాలకు చెందిన పిల్లలు ఆడుకుంటున్నారు. మహ్మద్‌ అక్బర్‌ కుమార్తె ఆఫియా పర్వీన్‌(5), మహ్మద్‌ నజీమ్‌ కుమార్తెలు నూర్జహాన్‌ ఖాతూన్‌(10), నబియా(6), కుమారుడు మహ్మద్‌ అలీరెయిన్‌(8), మహ్మద్‌ అప్జల్‌ కుమార్తె అఫ్రీది(3) ఇంటి ముందు ఉన్న జామ చెట్టు వద్ద ఉయ్యాల ఊగుతున్నారు. ఈ క్రమంలో గోడ కూలి ఐదుగురు చిన్నారులపై పడింది. ఈ ప్రమాదంలో ఆఫియా పర్వీన్‌, నూర్జహాన్‌ ఖాతూన్‌ మృతి చెందారు. నబియా, మహ్మద్‌ అలీ రెయిన్‌, అఫ్రీదికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కాగా, మరో ఘటనలో అపార్ట్‌మెంట్‌లో మరమ్మతులు చేస్తుండగా పాత గోడ కూలడంతో ఓ కార్మికుడు శిథిలాల కింద కూరుకుపోయాడు. కుత్బుల్లాపూర్‌ వెన్నెలగడ్డ శ్రీనిలయ ఎన్‌క్లేవ్‌లోని సాయి రామ్‌బృందావన్‌ అపార్టుమెంట్‌ సెల్లార్‌లోకి వర్షపు నీరు వస్తుండటంతో అపార్టుమెంట్‌ అసోసియేషన్‌ రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టింది. సోమవారం రిటైనింగ్‌ వాల్‌ కోసం తీసిన పునాది పక్కన ఉన్న పాత గోడ కూలింది. నలుగురు కూలీలు అప్రమత్తమై బయటకు రాగా.. మహబూబాబాద్‌ జిల్లా, పూర్వి మండలం నేరేడుకు చెందిన కార్మికుడు బల్వంత్‌రెడ్డి (32)గోడ కిందనే ఇరుక్కుపోయాడు. జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది 5గంటల పాటు శ్రమించి బయటకు తీశారు.

Updated Date - Jun 04 , 2024 | 04:52 AM