Share News

అసెంబ్లీకి ఓటు.. లోక్‌సభకు వేటు

ABN , Publish Date - May 15 , 2024 | 03:16 AM

వీరంతా అసెంబ్లీ ఎన్నికల్లో హక్కు వినియోగించుకున్నవారే. ఈ వైనంపై ఫిర్యాదులు రావడంతో ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం షేక్‌పేట ప్రాంతంలో పరిశీలన చేపట్టింది. 40 మందితో

అసెంబ్లీకి ఓటు.. లోక్‌సభకు వేటు

జూబ్లీహిల్స్‌ షేక్‌పేట డివిజన్‌లో 3,942 మంది హక్కు గల్లంతు..

చిరునామాల్లో ఎలాంటి మార్పు లేకున్నా ఓటు మాయంఈసీ పరిశీలన లేకుండానే తీసివేసినట్లుగా అనుమానం.. ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలన.. నేడు ఈసీకి బీజేపీ ఫిర్యాదు

ఈమె పేరు దుంపల యాదమ్మ. సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధి జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం షేక్‌పేట మారుతీనగర్‌ నివాసి. ఈమె భర్త, ఇద్దరు కుమారులు, కోడలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు. లోక్‌సభకు వచ్చేసరికి యాదమ్మ ఒక్కరి ఓటే మిగిలింది.

ఈయన పేరు పూస సురేష్‌. షేక్‌పేటలో ఉంటారు. కుటుంబంలో మొత్తం 9 మంది ఓట్లుండగా.. అందరివీ తొలగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వీరందరూ ఓటేసినవారే కావడం గమనార్హం.

వీరంతా షేక్‌పేట మారుతీనగర్‌ వాసులు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు. ఐదు రోజుల క్రితం పోలింగ్‌ కేంద్రం వివరాలతో చీటీలు అందించినా, ఓటు మాత్రం లేదు. షేక్‌పేట డివిజన్‌లో ఇలా వీరే కాదు.. 3,942 మంది ఓట్లు తొలగింపునకు గురయ్యాయి.

వీరంతా అసెంబ్లీ ఎన్నికల్లో హక్కు వినియోగించుకున్నవారే. ఈ వైనంపై ఫిర్యాదులు రావడంతో ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం షేక్‌పేట ప్రాంతంలో పరిశీలన చేపట్టింది. 40 మందితో మాట్లాడింది. ఇంటి చిరునామా సహా ఎలాంటి మార్పులు లేకున్నా ఈ ఎన్నికల్లో తమ ఓట్లు గల్లంతయ్యాయని చాలామంది వాపోయారు. ఎన్నికల సంఘం యాప్‌లోనూ డిలీటెడ్‌ అని చూపుతోంది. వీరంతా ఐదు రోజుల కిందట ఓటరు స్లిప్పులను పొందడం గమనార్హం. కాగా, షేక్‌పేట డివిజన్‌లో భారీగా ఓట్లు మాయం కావడంపై కేంద్ర మంత్రి, సికింద్రాబాద్‌ బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు ప్రతి ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ ఉంటుంది. 18 ఏళ్లు నిండినవారు కొత్తగా పేర్లను నమోదు చేసుకోవడం, మృతులు, ఇతర ప్రాంతాలకు వెళ్లినవారి ఓట్లను తొలగించే ప్రక్రియను ఎన్నికల సంఘం చేపడుతుంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల ఓటర్ల జాబితా పరిశీలన మాత్రం అడ్డగోలుగా చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓట్లను తొలగించే ముందు బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లు (బీఎల్‌వో) ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను పరిశీలించాలి. అనంతరమే.. మృతులు, అక్కడినుంచి వెళ్లిపోయినవారి పేర్లను తీసివేయాలి. బీఎల్వోలు ప్రతిపాదించినప్పటికీ.. ఎన్నికల సంఘం మరోసారి పరిశీలించిన తర్వాతే తొలగించాలి. కానీ, ఈసారి నేరుగా బీఎల్వోలు పేర్కొన్నవారి పేర్లను ఎత్తివేశారని తెలుస్తోంది. కాగా, రాష్ట్రంలో రెండేళ్లలో మొత్తం 32.08 లక్షల ఓట్లను తొలగించినట్లు ఎన్నికల ప్రధానాధికారి వికా్‌సరాజ్‌ ఏప్రిల్‌లో వెల్లడించారు.


బాధ్యులపై చర్యలేవి? సాంకేతికత ఏమైంది..?

ప్రతి ఎన్నికల్లో భారీగా ఓట్లను తొలగించడం సాధారణంగా మారిపోయింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీటి వెనక కారణాలను గుర్తించడంలో ఈసీ విఫలమవుతోంది. ముఖ్యంగా ఓట్ల తొలగింపులో కీలకంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోకపోవడంతో క్షేత్రస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. షేక్‌పేట డివిజన్‌ ఉదంతంపై స్థానిక బీజేపీ నేతలు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదు. ఓటు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు సలహా ఇచ్చి వెళ్లారు. కాగా, ఒకే వ్యక్తి పేరిట రెండు చోట్ల పేరుంటే ఒకటి దానంతటదే తొలగిపోతుందని, దీనికోసం ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు పలుసార్లు చెప్పుకొన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే అసలు టెక్నాలజీని వినియోగిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే నియోజకవర్గం పరిధిలో రెండు ఓట్లు ఉంటే తొలగిస్తుండగా.. ఒకే వ్యక్తికి వేర్వేరు నియోజకవర్గాల్లో ఉంటే గుర్తించి తీసేయడంలో ఈసీ విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఉంటున్న అనేకమందికి రెండుచోట్ల ఓట్లున్నాయి. పోలింగ్‌ రోజు వీరు వెళ్లిపోతున్నారు. నగరంలో పోలింగ్‌ శాతం తక్కువగా నమోదు కావడానికి ఇదీ ఓ ప్రధాన కారణమని తెలుస్తోంది.

-ఆంధ్రజ్యోతి,హైదరాబాద్‌

Updated Date - May 15 , 2024 | 03:16 AM