Share News

100 రోజుల పాలనకు ఓటు

ABN , Publish Date - Mar 24 , 2024 | 03:05 AM

లోక్‌సభ ఎన్నికల శంఖారావానికి సన్నద్ధమవుతున్న తెలంగాణ కాంగ్రెస్‌.. వంద రోజుల పాలనను అస్త్రంగా ఉపయోగించుకోనుంది.

100  రోజుల  పాలనకు ఓటు

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రచారాస్త్రమిదే

తుక్కుగూడ నుంచే ఎన్నికల శంఖారావం

ఏప్రిల్‌ తొలి వారంలో భారీ బహిరంగ సభ

రాహుల్‌, మల్లికార్జున ఖర్గే హాజరయ్యే అవకాశం

తెలుగులో మేనిఫెస్టో విడుదల చేయనున్న నేతలు

పథకాలు, పాలన చూసి ఓటేయాలని

ఓటర్లను కోరనున్న హస్తం పార్టీ

లోక్‌సభ, అసెంబ్లీ, బూత్‌స్థాయిలో కమిటీలు

రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న ఉత్సాహం.. వంద రోజుల పాలనతో ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న సానుకూలత.. ప్రత్యర్థి పార్టీల్లో ఒకటి పూర్తిగా బలహీనపడటం. సర్వేలన్నీ తామే ఎక్కువ సీట్లు గెలుస్తామని చెబుతున్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసివచ్చిన తుక్కుగూడలో మరోసారి సభ నిర్వహించి ప్రచారాన్ని ఉధృతం చేయనుంది.

హైదరాబాద్‌/మహేశ్వరం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల శంఖారావానికి సన్నద్ధమవుతున్న తెలంగాణ కాంగ్రెస్‌.. వంద రోజుల పాలనను అస్త్రంగా ఉపయోగించుకోనుంది. ఇదే అంశంతో రాష్ట్రంలో ప్రజలను ఓటు అడగాలని పార్టీ నిర్ణయించింది. వంద రోజుల్లో అమలు చేసిన పథకాలు, హామీలను ప్రజలకు వివరించి, తమకు ఓటేయాలని కోరనుంది. రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన వచ్చిందని చెబుతున్న కాంగ్రెస్‌.. దీన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఏప్రిల్‌ మొదటి వారంలో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. గత పదేళ్ల కాలంలో సాధారణ ప్రజలకు దరిదాపుల్లోనూ లేని ప్రగతిభవన్‌ను ‘మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌’గా మార్చి.. ప్రజల సమస్యలను నేరుగా వినడంతో పాటు ప్రజాపాలనను పునరుద్ధరించామని ప్రజలకు వివరించనుంది. హామీలను అమలు చేస్తున్నామని ప్రజలకు వివరించడానికి వీలుగా కమిటీలు కూడా వేయనుంది. లోక్‌సభ, అసెంబ్లీ, బూత్‌స్థాయిల్లో కమిటీలు వేసి.. ప్రతీ ఇంటికీ, ప్రతీ ఓటరుకు వంద రోజుల పాలనను వివరించి, ఓటు అడగాలని నిర్ణయించింది. ఇక బూత్‌స్థాయిలో ప్రభావవంతంగా పనిచేసి, కాంగ్రె్‌సకు అత్యధికంగా ఓట్లు రాబట్టినవారికి ‘ఇందిరమ్మ’ కమిటీల్లో చోటు కల్పించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి కూడా ప్రకటించారు. అంతేకాకుండా నామినేటేడ్‌ పదవుల్లో వారికి అవకాశం ఇస్తామని సంకేతాలిచ్చారు. ఇక పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన పలు సర్వేల ఫలితాలు కూడా కాంగ్రె్‌సకు అనుకూలతలు ఉన్నట్లు స్పష్టం చేశాయి. ఏ సర్వేలు చూసినా.. రాష్ట్రంలో కాంగ్రె్‌సకు 10-14 ఎంపీ స్థానాలు వస్తాయని చెబుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు కూడా 14 స్థానాలకు తగ్గకుండా దక్కించుకుంటామని ధీమాతో ఉన్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ కూడా బలహీనపడటంతో ఆశించిన స్థాయిలోనే పార్లమెంట్‌ స్థానాలపై కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. ఇక ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసుకునే పరిమితి పెంచడం, 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్‌, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ అందించడంతో పాటు త్వరలోనే ప్రతీ నియోజకవర్గానికి 3,500 దాకా ఇళ్లను పేద వర్గాలకు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒకటో తేదీన వేతనాలు ఇవ్వాలని నిర్ణయించడం, ధరణి కారణంగా ఉత్పన్నమైన భూ సమస్యలను క్రమంగా పరిష్కరించడం, గ్రూప్‌-1 పోస్టులను పెంచడం, మెగా డీఎస్సీని ప్రకటించడం, 30 వేల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన వంటి అంశాలు తమకు అనుకూలతను పెంచుతాయని కాంగ్రెస్‌ నమ్మకంతో ఉంది.

కాంగ్రెస్‌ సెంటిమెంట్‌గా ‘తుక్కుగూడ’

తెలంగాణ కాంగ్రె్‌సకు తుక్కుగూడ ఎన్నికల సెంటిమెంట్‌గా మారిపోయింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్నీ ఇక్కడి నుంచే ఉధృతం చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్‌ మొదటి వారంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్లాన్‌ చేసిన కాంగ్రెస్‌ పార్టీ.. దానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీలను ఆహ్వానించింది. పాంచ్‌ న్యాయ్‌ (ఐదు గ్యారెంటీలు) పేరిట పార్టీ మేనిఫెస్టోను తెలుగులో ఈ సభలో విడుదల చేయనున్నారు. తుక్కుగూడ సభకు హాజరయ్యేందుకు రాహుల్‌గాంధీ, ఖర్గేలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని, వారు ఇచ్చే తేదీలను బట్టి సభకు ఏర్పాట్లు జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఆయన సమయాన్ని బట్టి ఏప్రిల్‌ రెండో వారంలో సభ నిర్వహించే అవకాశమూ ఉందని వెల్లడించాయు. కాంగ్రెస్‌ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం.. తుక్కుగూడ సభ నుంచే ఉధృతం చేసిన సంగతి తెలిసిందే. సీడబ్ల్యూసీ సమావేశాల ముగింపుగా సెప్టెంబరు 17ను సందర్భంగా చేసుకుని తుక్కుగూడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ఖర్గే తదితరులు అసెంబ్లీ ఎన్నికల శంఖారవాన్ని మోగించిన సంగతి తెలిసిందే. ఆ సభలో అగ్రనేతలు ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, సభ విజయవంతం తదితర అంశాలు.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడానికి బాట వేశాయి. దీన్ని సెంటిమెంటుగా తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల శంఖారవాన్నీ తుక్కుగూడ సభ వేదికగానే మోగించాలని ప్లాన్‌ చేశారు.

Updated Date - Mar 24 , 2024 | 03:05 AM