Share News

సాగులో ‘విజయ’ం

ABN , Publish Date - Oct 19 , 2024 | 11:40 PM

ఆమె మొదట సాధారణ గృహిణి. వ్యవసాయం, పొలం పనులపై ఉన్న ఆసక్తితో ఆధునిక పద్ధతులతో సాగును ప్రారంభించింది. కందిలో నూతన వంగడాలను వినియోగించి అనూహ్యమైన దిగుబడిని సాధించి ఔరా అనిపించారు. ఆమె ప్రతిభ, ఆసక్తిని గమనించిన ఇక్రిశాట్‌ రాష్ట్రస్థాయి ఉత్తమ మహిళ రైతుగా సత్కరించింది. పాత తాండూరుకు చెందిన మహిళా రైతు గాండ్ల విజయనిర్మల సాగు ప్రస్థానంపై ప్రత్యేక కథనం.

సాగులో ‘విజయ’ం
కందిపంటను పరిశీలిస్తున్న మహిళా రైతు విజయనిర్మల

-వినూత్న పద్ధతులతో దూసుకెళ్తున్న మహిళారైతు

-2014లో ఉత్తమ మహిళా రైతు అవార్డు గ్రహీత

-నాలుగెకరాల విస్తీర్ణంలో డ్రిప్‌ విధానంలో కంది సాగు

-భర్త నర్సింహులు సహకారంతో సాగులో ముందుకు

-ఆదర్శరైతు అంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు

-మహిళా రైతు విజయనిర్మల సాగుపై ప్రత్యేకం

ఆమె మొదట సాధారణ గృహిణి. వ్యవసాయం, పొలం పనులపై ఉన్న ఆసక్తితో ఆధునిక పద్ధతులతో సాగును ప్రారంభించింది. కందిలో నూతన వంగడాలను వినియోగించి అనూహ్యమైన దిగుబడిని సాధించి ఔరా అనిపించారు. ఆమె ప్రతిభ, ఆసక్తిని గమనించిన ఇక్రిశాట్‌ రాష్ట్రస్థాయి ఉత్తమ మహిళ రైతుగా సత్కరించింది. పాత తాండూరుకు చెందిన మహిళా రైతు గాండ్ల విజయనిర్మల సాగు ప్రస్థానంపై ప్రత్యేక కథనం.

తాండూరు : పాత తాండూరుకు చెందిన గాండ్ల విజయనిర్మలకు వ్యవసాయంపై పెద్దగా అవగాహన లేనప్పటి కీ ఆమెకున్న ఆసక్తితో ఆధునిక సాగుపై దృష్టి పెట్టింది. ఎప్పటికప్పుడు తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ ఆదాయాన్ని ఇచ్చే పంట సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు. కంది, జొన్న, సజ్జ, శనగ పంటలతోపాటు కూరగాయల్లో నూతన వంగడాలతో అధిక దిగుబడి సాధిస్తోంది. సాగు క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలోనూ అధిక దిగుబడి సాధించింది. విజయనిర్మలకు 2014 సెప్టెంబర్‌ 12న ఇక్రిశాట్‌ జాతీయ ఉమెన్స్‌ ఫార్మర్స్‌ డే-2014 సందర్భంగా ఉత్తమ మహిళ రైతుగా గుర్తించి ఇక్రిశాట్‌ డైరెక్టర్‌ విలియం డి.ఽథర్‌ అవార్డు అందజేశారు.

కందిసాగులో విజయం

రాష్ట్రంలోనే కంది పంటను మొదటిసారి డ్రిప్‌ కింద సాగు చేసి అద్భుత ఫలితాలు సాధించారు. కందిలో డ్రిప్‌ సిస్టమ్‌తో నారు నాటి కొత్త పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడి సాధించింది. హైబ్రిడ్‌ విత్తనాలతో ఎకరాకు 4 క్వింటాళ్లకు బదులు 12 క్వింటాళ్లకు దిగుబడిని పెంచింది. కందితోపాటు జొన్న, కుసుమ, పెసర పంటలను సాగు చే సింది.

టాంజానియా కందిలో నూతన పద్ధతి

విజయనిర్మల తన వ్యవసాయ క్షేత్రంలో టాంజానియా కందిలో నూతన పద్ధతిలో ప్రయోగాత్మకంగా సాగు చేసింది. ఈ సాగును తాండూరు వాసులే కాకుండా ఆఫ్రికా, టాంజనియా దేశ శాస్త్రవేత్తలు కూడా ఆమె పొలానికి వచ్చి పరిశీలించారు. టాంజానియా వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్‌ ఫిలోమాన్‌మోసి కూడా ఈ సాగును చూసి విజయనిర్మలను అభినందించారు. ఈ నూతన పద్ధతి కందిసాగులో ఎకరాకు 20కి ్వంటాళ్ల వరకు దిగుబడి సాధించడం గమనార్హం.

నాలుగు ఎకరాల భూమితోనే సాగు

గాండ్ల విజయనిర్మల భర్త నర్సింహులు సహకారంతో డ్రిప్‌ పద్ధతిలో టమాట, వంకాయ, ఉల్లిగడ్డ, ఆకు కూరలు సాగు చేస్తున్నారు. ఇంటి పనులు చేస్తూనే అధిక సమయంలో పొలం పనులకు కేటాయిస్తుంది. విజయ నిర్మలకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు రాజవర్ధన్‌ జిన్‌గుర్తి ఏకలవ్య అగ్రికల్చర్‌ పాల్‌టెక్నిక్‌ ప్రిన్సిపల్‌గా పనిచేస్తుండగా.. చిన్నకుమారుడు మణివర్దన్‌ వ్యవసాయ పనులు చేస్తున్నాడు.

పొలం పనులంటే ఎంతో ఇష్టం

నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం, పొలం పనులంటే ఎంతో ఇష్టం. ఉన్న నాలుగు ఎకరాల పొలంలోనే ఆధునిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడి సాధిస్తున్నాం. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వినియోగంతో కూరగాయలు సాగు చేసుకుంటూ రోజువారీగా విక్రయిస్తూ సంపాదిస్తున్నాము. మాకు ఎప్పటికప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్తలు తగు సూచనలు ఇవ్వడంతోపాటు సేంద్రియ సాంకేతిక సంస్థ పద్ధతిలో సాగు చేస్తున్నాము. 2014లో ఇక్రిసాట్‌ నుంచి అవార్డు పొందిన తర్వాత మరింత ఉత్సాహంతో సాగు చేస్తున్నాము. మున్ముందు కొత్తరకమైన వంగడాలతో అంతర పంటలు వేసి వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలని నిర్ణయించాం.

-విజయనిర్మల, మహిళా రైతు

............................................................

అందరికీ ఆదర్శం విజయనిర్మల

సాగులో నూతన ఒరవడులు సృష్టించడంతోపాటు డ్రిప్‌ ద్వారా కంది సాగు చేస్తున్న మహిళా రైతు విజయనిర్మలను ఇతర మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి. వంటింటికే పరిమితం కాకుండా ఉన్న నాలుగెకరాల పొలంలో కొత్తరకం కంది విత్తనాన్ని నమూనా పంటగా సాగుచేసి ఎకరాకు 14 క్వింటాళ్లు దిగుబడి సాధించారు. అంతర పంటల సాగుతో స్థిరాదాయాన్ని సంపాదిస్తూ అందరికీ స్పూర్తిగా నిలుస్తోంది. జాతీయ మహిళ దినోత్సవం రోజున ఇక్రిసాట్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు ఉత్తమ మహిళా రైతులను ఎంపిక చేసింది. ఆ ఇద్దరిలో విజయనిర్మల ఒకరు. వ్యవసాయ సాగుకు ఆమె చేస్తున్న శ్రమను, దిగుబడి, లాభాలను చూసి ఇక్రిసాట్‌ ద్వారా ప్రశంసలు అందుకుంది. ఇతరులకు ఆదర్శంగా నిలిచిన ఈ మహిళలను పలువురు శాస్త్రవేత్తలు సైతం అభినందించారు.

Updated Date - Oct 19 , 2024 | 11:40 PM