Share News

వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:35 PM

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్‌ గౌతమ్‌ అన్నారు.

వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి
ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌.

కలెక్టర్‌ గౌతమ్‌

మేడ్చల్‌ జూలై 8(ఆంధ్రజ్యోతి) : మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్‌ గౌతమ్‌ అన్నారు. సోమవారం ప్రజావాణిని పురస్కరించుకుని కలెక్టర్‌ కలెక్టరేట్‌లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. వనమహోత్సవం కింద అధికారులకు వారికి నిర్ధేశించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రూరల్‌, గ్రామపంచాయతీలలో మొక్కలు సిద్ధ్దంగా ఉన్నాయన్నారు. వర్షాలు కురుస్తున్నందున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. జిల్లా కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో బయోమెట్రిక్‌ విధానాన్ని త్వరలో అమలు చేస్తున్నామన్నారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి, డీఆర్‌ఓ హరిప్రియ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి : కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

వికారాబాద్‌, జూలై 8 : ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్‌ ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదును స్వీకరించి మాట్లాడారు. ప్రధానంగా విద్య, వైద్య, బీసీ, గిరిజన సంక్షేమం, విద్యుత్‌, పంచాయతీ, పింఛన్లు, మున్సిపాలిటీ, ధరణి, మైన్స్‌, భూసర్వే తదితర అంశాలకు సంబంధించి 122 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రజావాణితో పాటు సీఎం కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత నిస్తూ పరిష్కరించాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఇక నుంచి మండలాల్లో నిర్వహించే ప్రజావాణిలో అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు., నియోజకవర్గ పరిధిలో మున్సిపల్‌ కమిషనర్లు ప్రజావాణి దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సుధీర్‌, లింగ్యానాయక్‌ ,ఆర్‌డీవో వాసుచంద్ర, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ భూములు, చెరువుల రక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలు : జిల్లా కలెక్టర్‌, శశాంక

రంగారెడ్డి అర్బన్‌, : ప్రభుత్వ భూముల పరిరక్షణకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, ఏసీపీ స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్‌ శశాంక అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ, ఇరిగేషన్‌, మున్సిపల్‌, పంచాయత్‌, పోలీసు, హెచ్‌ఎండీఏ విద్యుత్‌, సర్వే జిల్లా అధికారులతో కలెక్టర్‌ శశాంక ప్రభుత్వ భూములు పరిరక్షణ, సరస్సుల ఆక్రమణల తొలగింపుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ భూములను ఆక్రమణల నుండి రక్షించడానికి, సరస్సుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ ప్రాంతాలను ఆక్రమణల నుండి రక్షించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ భూములు, సరస్సుల రక్షణ, ప్రభుత్వ భూములు, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ ఏరియాలోని ఆక్రమణలను తొలగించడం కోసం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, ఏసీపీ స్థాయిలో రెండు ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. టీమ్‌-1 (ఎల్బీనగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం), టీమ్‌-2 (రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, షాద్‌నగర్‌, చేవెళ్ల) టాస్క్‌ఫోర్స్‌ బృందాలుగా ఉంటాయని తెలిపారు. అంతే కాకుండా ప్రస్తుతం ప్రజావాణి, సాధారణ ఫిర్యాదులలో ప్రజల నుండి వచ్చే వినతులపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్‌, మున్సిపల్‌, పంచాయతీ, పోలీసు అధికారుల సహాయంతో ప్రభుత్వ భూములు, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ ఏరియాపై జరిగిన ఆక్రమణలు టాస్క్‌ఫోర్స్‌ బృందాల పరిధిలో భౌతిక తనిఖీ నిర్వహించాలన్నారు. అన్ని రకాల అక్రమ నిర్మాణాలను అరికట్టడానికి చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు ఏదైనా నిర్లక్ష్యం వహిస్తే సీసీఏ నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు, రెవెన్యూ, పోలీస్‌, ఇరిగేషన్‌, మున్సిపల్‌ కమిషనర్‌, హెచ్‌ఎండీఏ, పంచాయతీ, విద్యుత్‌, సర్వే సిబ్బంది తదితర అధికారులు టాస్క్‌ఫోర్స్‌ బృందంలో ఉంటారని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్‌వో సంగీత, ఆర్డీవోలు సాయిరాం, సూరజ్‌ కుమార్‌, అనంతంరెడ్డి, వెంకట్‌రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణి’ సమస్యలను పరిష్కరించాలి

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ శశాంక అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆయన హాజరై ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లాకు సంబంధించి ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులకు, సంబంధిత రెవెన్యూ అధికారులకు పంపించామన్నారు. వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. సోమవారం ప్రజావాణిలో 110 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్‌, భూపాల్‌రెడ్డి, డీఆర్వో సంగీత పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 11:35 PM