ఉత్తిమాటలే.. ఎత్తిపోసేదెన్నడో
ABN , Publish Date - Jul 15 , 2024 | 12:27 AM
‘రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల ద్వారా ప్రతి ఎకరానికీ సాగునీరు అందిస్తాం’ అన్న నేతల మాటలు ఉత్తిమాటలుగానే మిగిలిపోతున్నాయి.
2021లో 13లిఫ్టులకు నాటి ప్రభుత్వం శంకుస్థాపన
నిధులు లేక నత్తనడకన పనులు ఎన్నికల ప్రచార అస్ర్తాలుగానే లిఫ్టులు
నెల్లికల్ లిఫ్టు ఏర్పాటు చేసే ప్రాంతం
ఈ ప్రభుత్వ హయాంలోనైనా పూర్తయ్యేనా ?
‘రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల ద్వారా ప్రతి ఎకరానికీ సాగునీరు అందిస్తాం’ అన్న నేతల మాటలు ఉత్తిమాటలుగానే మిగిలిపోతున్నాయి. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా రైతులకు సాగునీటి ఇబ్బందులు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. 2021లో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఫలితంగా సూర్యాపేట, నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధుల విన్నపాల మేరకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2021 ఫిబ్రవరి 10న తిరుమలగిరి(సాగర్) మండలంలోని ఎర్రచెరువుతండా వద్ద జరిగిన సభలో మొత్తం 13లిఫ్టుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దీంతో ఉమ్మడి జిల్లాలో లిఫ్టుల ఏర్పాటు పనుల ప్రారంభానికి తొలి అడుగు పడింది. అయితే నిధుల సమస్యలతో లిఫ్టుల పనులు నత్తనడకగా సాగుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. లక్ష్యం మంచిదే అయినప్పటికీ నిధులు కేటాయించకపోవడం, అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో కొన్ని లిప్టుల పనులు మందకొడిగా సాగుతున్నాయి.
తిరుమలగిరి(సాగర్), జూలై 14: కృష్ణపట్టె రైతుల చిరకాల డిమండ్ దృష్ట్యా ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో 4,200 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నెల్లికల్ లిఫ్ట్‌కు సుమారు రూ.58 కోట్లు మంజూరు చేసేందుకు జీవో జారీ చేశారు. అటవీశాఖ అనుమతులు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఆ ప్రాంత ప్రజలు 2014 ఎన్నికల్లో అన్ని పార్టీల నేతలను నెల్లికల్‌ను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 2018 అక్టోబరు 22న లిఫ్టు పనులను పూర్తి చేయకుంటే అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరిస్తామని ఉమ్మడిగా ప్రకటించారు. దీంతో అప్పటి పాలకులు దిగివచ్చి నెల్లికల్ లిఫ్టుకు నిధులు మంజూరు చేయడంతోపాటు అన్ని అనుమతులు తీసుకొచ్చి పనులను ప్రారంభిస్తామని హామీలు గుప్పించారు. అనంతరం 2021లో అప్పటి ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతితో వచ్చిన ఉప ఎన్నిక సందర్భంగా ఈ పథకం మరోసారి తెరపైకి రాగా ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో నాటి సీఎం కేసీఆర్ నెల్లికల్ లిఫ్టుతోపాటు జిల్లాలోని ఆయా ఎమ్మెల్యేల విన్నపం మేరకు ఆయా నియోజకవర్గాల్లోని లిఫ్టులకు సైతం మోక్షం కలిగించి శంకుస్థాపన చేశారు. లిఫ్టును 18నెలల్లో పూర్తి చేస్తామని అప్పటి మంత్రి జగదీష్‌రెడ్డి ఉప ఎన్నికల సందర్భంగా సవాలు చేసినప్పటికీ అదీ అమలుకు నోచుకోలేదు.
లిఫ్టు వ్యయం రూ.692కోట్లు.. మంజూరైంది రూ.25కోట్లే
నెల్లికల్ లిఫ్టుకు రీడిజైనింగ్ చేయడం ద్వారా మండలంలోని కృష్ణపట్టె గ్రామాల్లో సుమారు 24,886 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని రిటైర్డ్ ఇంజనీర్ల బృందం సభ్యుల సిఫారసుతో అప్పటి సీఎం కేసీఆర్ దానికి ఆమోదం తెలిపి శంకుస్థాపన చేశారు. నిర్మాణానికి రూ.692కోట్ల వ్యయం అవుతుందని అంచనా చేశారు. రూ.539కోట్లకు పనులు పూర్తి చేస్తామని మెగా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పనులు దక్కించుకుంది. పంప్‌హౌస్ పనులను ప్రారంభించారు. మూడున్నర సంవత్సరాలుగా అప్పటి బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో లిఫ్టు నిర్మాణ పనులకు కేటాయింపులు చేసింది కేవలం రూ.25కోట్లు మాత్రమే. దశలవారీగా ఇస్తుండడంతో సంబంధిత కాంట్రాక్ట్ దక్కించుకున్న నిర్మాణ సంస్థ పనులను వేగంగా చేయలేకపోతుందని సమాచారం. ప్రస్తుతం పంప్‌హౌస్‌కు సంబంధించి స్టేజింగ్, సెంట్రింగ్, షట్టరింగ్‌తోపాటు 8వ లిఫ్టుకు సంబంధించిన కాంక్రీట్ పనులు నిర్వహిస్తున్నారు. మొత్తం లిఫ్టు పనుల్లో ఇప్పటివరకు కేవలం పదిశాతం పనులు మాత్రమే పూర్తయినట్లు తెలుస్తోంది.
పెండింగ్‌లోనే ఇంకా పలు పనులు
లిఫ్టుకు సంబంధించిన ప్రెషర్‌మెయిన్ పైపులైన్లు పనులు వన్యప్రాణుల అభయారణ్యం గుండా వేయాల్సి ఉండడంతో అటవీశాఖ అనుమతుల కోసం పలు నిబంధనలను పెట్టింది. పైపులైన్ వల్ల 9 ఎకరాల అటవీ భూమికి నష్టం కలుగుతుండడంతో ఆ భూమికి ప్రత్యామ్నాయంగా నెల్లికల్ రెవెన్యూ శివారులో సర్వే నెం.290/2లోని సుమారు 8.66ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీశాఖకు అప్పగించారు. అటవీప్రాంతంలో పనుల వల్ల మొక్కలు, చెట్లకు, వన్య ప్రాణులకు నష్టం కలుగుతుండడంతో 2020-21లో రూ.2.34కోట్ల పరిహారం ఇవ్వాలని సంబంధిత అటవీశాఖ అధికారులు ఇరిగేషన్ శాఖకు ప్రతిపాదనలు పంపారు. అప్పటి ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో ప్రస్తుతం ఆ పరిహారం రెట్టింపు కానుందని తెలిసింది. పైపులైన్లు, డీసీలు, గ్రావిటి కెనాల్స్, ప్రెషర్‌మెయిన్ పైపులైన్ పనులు, సర్టిట్యాంక్‌లు, డెలివరీ సిస్టంలు, పంట కాల్వల నిర్మాణాల సర్వే పనులు నేటికీ చేపట్టలేదు.
దశలవారీగా లిఫ్టు పనుల పూర్తికి యోచన
ప్రభుత్వానికి నిధుల సమస్య వెంటాడుతుండడంతో 25,886 ఎకరాలకు ఒకేసారి పనులను పూర్తిచేసే పరిస్థితి లేకపోవడంతో దశలవారీగా పనులను చేయాలని ప్రభుత్వం, అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ఎర్రచెరువు, నెల్లికల్ గ్రామాల్లో 4,175 ఎకరాలకు, తునికినూతలతండాకు 1586 ఎకరాలు, సుంకిశాలతండాలో 2,251ఎకరాలు, తిమ్మాయిపాలెం 10920, చింతలపాలెం 8220, జమ్మనకోట 298, రాజవరం మేజర్ చివరి భూములకు 4వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అప్పటి బీఆ ర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసి లిఫ్టుకు శంకుస్థాపనలు చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల సమస్యతో విడతలవారీగా పనులు పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. మొదట ఎర్రచెరువుతండా, నెల్లికల్ సమీప ప్రాంతాల్లో సుమారు 5వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేలా మొదటి విడతలో పనులను పూర్తిచేయించి సాగునీరు అందించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
డీ-8,9 లిఫ్టుకు పూర్తిస్థాయిలో కలగని మోక్షం
అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి డిస్ర్టిబ్యూటరీ- 8,9 ద్వారా 28వేల ఎకరాలకు ఆరుతడి పంటలకు సాగునీరు అందించాలని సుమారు 25 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం, అధికారులు ప్రతిపాదించారు. కాని 34 కిలో మీటర్ల మేర కాల్వలు ఉండడంతో చివరి రైతుల భూములకు సాగునీరు పారని పరిస్థితి నెలకొంది. దీంతో ఏఎమ్మార్పీ లోలెవల్ కెనాల్‌పై లిఫ్టు ఏర్పాటు చేయడం ద్వారా సుమారు 7200 ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించేందుకు గత ప్రభుత్వాలు ప్రతిపాదనలు చేశాయి. సాగర్ ఉప ఎన్నిక ఫలితంగా శంకుస్థాపన చేసిన లిఫ్టుల్లో డి-8,9 ఒకటి. లోలెవల్ కెనాల్‌పై మూడు భారీ సైజ్ మోటార్లు ఉండగా ఒకటవ మోటార్ ద్వారా డి-8,9 కాల్వలకు నీ టిని అందించేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదించారు. అందుకు తగ్గట్లు భారీ సంప్, కాంక్రీట్ పనులు, మోటార్లు ఏర్పాటు చేసిన ప్రాంతం నుంచి సుమారు 550మీటర్ల మేరా కాల్వల వరకు పైపు లైన్లను ఏర్పాటు చేసే పనులను పూర్తి చేశారు. అయితే మోటార్‌పైపుకు నీటిని మళ్లించే బటర్‌ఫ్లయ్ వాల్వ్ సిద్ధంగా లేకపోవడంతో మూడు నెలల్లో పూర్తి చేయకలగిన పనులను మూడు సంవత్సరాల వరకు కొనసాగించారు. రైతుల నుంచి విమర్శలు వస్తుండడంతో పశ్భిమబెంగాల్‌లోని నిర్మాణ సంస్థ వద్ద ప్రత్యేకంగా ఆ వాల్వ్‌ను తయారు చేయించి ఉపఎన్నిక ముందు దాన్ని పంప్ పైపులైన్‌కు బిగించి నీటిని కాల్వలకు విడుదల చేసి అనధికారికంగా ట్రయల్‌రన్ పూర్తి చేశారు. అయితే పాతికేళ్ల క్రితం తవ్విన కాల్వలో పెద్ద ఎత్తున కంపచెట్లు, మట్టి, చెత్త పేరుకపోవడంతో కాల్వలో నీరు పారే పరిస్థితి లేదు.
నిధులు కేటాయిస్తే.. సస్యశ్యామలమే
దేవరకొండ /చందంపేట, పీఏపల్లి: నాగార్జునసాగర్‌లో ముంపునకు గురైన బాధితులు చందంపేట, నేరేడుగొమ్ము, పీఏపల్లి మండలాల్లోని గుట్టలపై ఉన్న గ్రామాల్లో పునరావాసం ఏర్పాటు చేసుకొని వర్షాధారంగానే పంటలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామాల రైతులకు లిప్టుల ద్వారా సాగునీరు అందించాలని 2021 ఫిబ్రవరి 10న అప్పటి సీఎం కేసీఆర్ ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేశారు. నిధులు కేటాయించక పోవడం, అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో కొన్ని లిప్టుల పనులు మందకొడిగా సాగుతున్నాయి. మరికొన్ని శంకుస్థాపనకే పరిమితమయ్యాయి. పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసే పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఉమ్మడి జిల్లాకు చెందిన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు డిండి ఎత్తిపోతల, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయించారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఎస్‌ఎల్‌బీసీ, డిండి ఎత్తిపోతల పథకాలకు నిధులు కేటాయించి, పూర్తిచేయాలని సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. లిప్టులు పూర్తయితే గుట్టలపై ఉన్న ప్రాంతాల రైతులకు సాగునీరు అందనుంది. రూ.585కోట్లతో నియోజకవర్గంలో ఐదు ఎత్తిపోతల పథకాల పనులకు శంకుస్థాపన చేశారు.
పొగిళ్ల ఎత్తిపోతల పథకం
పొగిళ్ల ఎత్తిపోతలకు రూ.24.64 కోట్లు కేటాయించారు. ఈ పథకానికి అటవీశాఖ అనుమతి రాకపోవడంతో శంకుస్థాపనకే పరిమితమై ప్రారంభానికి నోచుకోలేదు. ఈ పథకం పూర్తయితే 1019 ఎకరాలకు సాగునీరు అందనుంది. సుమారు 40 ఎకరాల వరకు అటవీశాఖ అనుమతి రావలసి ఉందని అధికారులు తెలుపుతున్నారు.
కంబాలపల్లి ఎత్తిపోతల పథకం
కంబాలపల్లి ఎత్తిపోతలకు రూ.202.15 కోట్లు కేటాయించారు. ఈ పథ కం పనులు 20శాతం పూర్తయ్యాయి. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపో వడంతో పనులు ఆగిపోయాయి. ఈ ఎత్తిపోతల పథకం పూర్తయితే కంభా లపల్లి, పాత కంభాలపల్లి, యలమలమంద, గువ్వలగుట్ట, కాచరాజుపల్లి గ్రామాలకు సాగునీరు అందుతుంది. 20వేల ఎకరాలకు నీరందుతుంది.
అంభభవాని ఎత్తిపోతల పథకం
అంభభవాని ఎత్తిపోతలకు రూ.184.56 కోట్లు కేటాయించారు. ఈ ఎత్తిపోతల పథకం పనులు 30శాతం మాత్రమే పూర్తయ్యాయి. కాంట్రా క్టర్‌కు రూ. 50కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో ప్రస్తుతం పనులు నిలిచి పోయాయి. ఈ పథకం కింద 8444 ఎకరాలు నీరందనుంది. వైజాగ్‌కాలనీ, చిన్నమునిగల్, పెద్దమునిగల్, బచ్చాపురం, బుడ్డోనితండా, కేతేపల్లి, మోసంగితండా, గుర్రపుతండా, పేర్వాల గ్రామాల్లోని సాగునీరు అందనుంది.
ఏకేబీఆర్ ఎత్తిపోతల పథకం
ఏకేబీఆర్ ఎత్తిపోతలకు రూ.90.96 కోట్లు కేటాయించారు. నిధులు మంజూరు చేయకపోవడంతో 4శాతం పనులు పూర్తికాగా పనులు కొనసాగుతున్నాయి. దీని ద్వారా గుర్రంపోడ్, గుడిపల్లి, పీఏపల్లి మండలాల్లో 6,691 ఎకరాల ఆయకట్టుకు నీరందేలా రూపకల్పన చేశారు. పెద్దగట్టు లిప్టు పనులు అటవీశాఖ అనుమతి రాకపోవడంతో సర్వే చేసి నిలిపి వేశారు. పనుల ప్రారంభంపై సంధిగ్ధత ఏర్పడింది.
పెద్దగట్టు ఎత్తిపోతల పథకం
పెద్దగట్టు ఎత్తిపోతలకు రూ.82.727 కోట్లు కేటాయించారు. దీని ద్వారా పెద్దగట్టు, ఎల్లాపురం, నంబాపురం గ్రామాల్లో మూడు వేల ఎకరాల ఆయకట్టుకు నీరందేలా రూపకల్పన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కంభాలపల్లి, ఏకేబీఆర్, అంభ భవాని ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమయ్యాయి. కాని కాంట్రాక్టర్ నిధులు కేటాయించడంలో జాప్యం జరుగుతుండడంతో ప్రస్తుతానికి కంభాలపల్లి అంభ భవాని ఎత్తిపోతల పథకం నిలిచిపోగా, ఏకేబీఆర్ ఎత్తిపోతల పనులు జరుగుతున్నాయి. లిప్టులు పూర్తయితేనే గుట్టలపై ఉన్న గ్రామాలకు సాగునీరు అందనుంది.
నిధులున్నా.. మరమ్మతుల్లో నత్తనడక
మేళ్లచెర్వు: హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలో కృష్ణానదిపై ఉన్న పాత, కొత్త ఎత్తి పోతల పథకాలు ఈ వానాకాలం నాటికి పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చేది ప్రశ్నార్థ కంగా మారాయి. ఈ ప్రాంతంలో గతంలో నిర్మించిన నక్కగూడెం, పెద్దవీడు, చౌటుపల్లి, దొండపాడు, గుండ్లపల్లి, రామచంద్రాపురం, వెల్లటూరు పథకాల ద్వారా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి, మేళ్లచెర్వు, చింతలపాలెం మండలాల్లోని 26,742 ఎకరాలకు సాగునీరు అందించే పథకాల మరమ్మతులతో పాటు దొండపాడు-2 నూతన పథకానికి శ్రీకారం చుట్టారు. భారీ పథకాల ద్వారా కంటే చిన్న చిన్న ఎత్తిపోతల పథకాల ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ విస్తీర్ణం సాగులోకి వస్తుందనే ఉద్దేశంతో నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ పథకాల మరమ్మతులకు నిధులు విడుదల చేశారు.
నిధులు మంజూరైనా పూర్తికాని మరమ్మతులు
పాత ఎత్తిపోతల పథకాల మోటార్లకు, పైప్పు లైన్ మరమ్మతుల కోసం మంత్రి రూ.7.30 కోట్ల నిధులు మంజూరు చేసి ఆగస్టు 15నాటికి పూర్తిస్థాయిలో పూర్తిచేయాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువుకు ముందే పైపులైన్లు రిపేరు చేసి ట్రయిల్ రన్ నిర్వహించి, మోటార్లు, పైప్పు లైన్ రిపేర్లను సరిచేయాల్సి ఉండగా.. నేటికీ రిపేర్లు నత్తనడకన కొనసాగుతున్నాయి.
ఎత్తిపోతల పథకాల నిర్వహణపై రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాలు కృష్ణానది నుంచి దాదాపు 10 నుంచి 20 కిలోమీటర్ల దూరం పైపులు ద్వారా ప్రవహించి ఎన్నెస్పీ కాలువలో కలుపుకుంటారు. ఈ పైపులు పాతవి కావడంతో ఎక్కువ ఒత్తిడికి లోనై, మధ్యలో పైపులు పగులుతుండడంతో పగిలిన పైపులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. నిర్లక్ష్యంతో ఒక్కసారి పైపు పగిలితే వారం పది రోజులు మరమ్మతులకు గురవుతున్నాయి. దారిలో ఉన్న పైపులు ధ్వంసమయితే వాటిని గుర్తించి, మరమ్మతులు చేయించడంలో జాప్యం చేస్తున్నారు. ఎత్తిపోతల పథకాల వద్ద ఉన్న ఆపరే టర్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తుండడంతో ఎత్తిపోతల పథకాల లక్ష్యం చేరుకోవడం లేదు. ఎత్తిపోతల పథకాలతో నేరుగా లబ్ధిచేకూరే పంట పొలాలతో పాటుగా ఈ ప్రాంతంలో భూగర్భజలాలు వృద్ధిచెందుతాయి. దీంతో పరోక్షంగా మరో 5060 ఎకరాలు అదనంగా బావులు, బోర్లు ద్వారా సాగులోకి వచ్చే అవకాశాలు ఉండడంతో మంత్రి ఆదేశాలతో ఈ పథకాలు పూర్తవుతాయని ఈ ప్రాంత రైతులు ఆశగా చూస్తున్నారు.
ఇంకా ప్రాథమిక దశలోనే..
దామరచర్ల: ఉమ్మడి దామరచర్ల మండలంలో మూడు భారీ ఎత్తిపోతల పథకాలకు అప్పటి సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. అడవిదేవులపల్లి మండలంలోని చిట్యాల వద్ద ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన హాలియా వాగు కలుస్తుంది. ఈ ప్రాంతంలో నీటి వృథాను అరికట్టేందుకు దున్నపోతుల గండి వద్ద ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. రూ.219 కోట్ల వ్యయంతో 16కిలో మీటర్ల పైపులైన్ ద్వారా అడవిదేవులపల్లి మండలంలోని బాల్నెపల్లి, అడవిదేవులపల్లి, ఉల్సాయిపాలెం, చాంప్లాతండా, ముదిమాణిక్యం, చిట్యాల, మొల్కచర్ల తదితర గ్రామాల పరిధిలోని 12,610 ఎకరాల భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో పనులను ప్రారంభించారు. దున్నపోతులగండి ఎత్తిపోతల పథకం, అన్నమేరువాగుపై చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులు మాత్రం ప్రాఽథమిక దశలోనే ఉన్నాయి. పథకం పనులు ఇప్పటివరకు కేవలం 4శాతం వరకే పూర్తయినట్లు సమాచారం.
మూసీ నదిపై..
ముసీ నది నీరు వృథాగా కృష్ణా నదిలో కలిసి దిగువ పులిచింతలకు వెళ్తుంది. దీంతో ఈ ప్రాంతంలో ఎత్తిపోతల అసరముందని అప్పటి ప్రభుత్వం రూ.229.90 కోట్లతో 12,610 ఎకరాల భూమిని సాగులోకి తెచ్చేందుకు మండలంలోని మంగళదుబ్బతండా సమీపంలో ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించింది. దీని ద్వారా కొండ్రపోల్, బొత్తలపాలెం, నూనా వత్‌తండా, ధనియాలబండతండా, తెట్టెకుంట, మాన్‌తండా, జైత్రాంతండా, లావూరిబి క్యాతండా పరిధిలోని భూములకు సాగునీరు అందనుంది. మంగళదుబ్బ తండాలోని ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్ నిర్మాణం కావస్తుండగా పైపులైన్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అడవిదేవుపల్లి మండలంలోని దున్నపోతులతండా పథకంతోపాటు దామరచర్ల మండలంలోని రెండు ఎత్తిపోతల పథకాల పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి.
అన్నమేరువాగు ఆధారంగా..
ఎగువ ప్రాంతం నుంచి వృథా దామరచర్ల మండలంలోని తాళ్లవీరప్పగూడెం సమీ పంలోని కృష్ణానదిలో అన్నమేరువాగు కలుస్తుంది. దీంతో ఈ ప్రాంతంలో బీడు భూములు అధికంగా ఉన్నప్పటికీ నీటిని వినియోగిం చుకునే అవకాశం లేదు. దీంతో ఈ ప్రాంతంలో ఎత్తిపోతలకు శంకుస్థాపన జరిగింది. రూ.75.93కోట్లతో తొమ్మిది కిలో మీటర్ల పైపులైన్ల ద్వారా బొత్తలపాలెం సమీపంలోని దుప్పలగట్టు వద్ద వజీరాబాద్ మేజర్ కాల్వలకు, నర్సాపురం చెరువు సమీపంలో మరో పైపు డెలివరి పాయింట్లకు ఏర్పాటు చేశారు. ఈ ఎత్తిపోతల పూర్తయితే దామరచర్లతోపాటు బొత్తలపాలెం, వాచ్యాతండా, నర్సాపురం, తాళ్లవీరప్పగూడెం, వాడపల్లి పరిధిలోని 5,875 ఎకరాల భూమి సస్యశ్యామలమవుతుంది.
శంకుస్థాపనతో సరి.. పనులు ఎప్పుడో మరి!
మాడ్గులపల్లి: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.9.30 కోట్లతో మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని మాడ్గుల పల్లి మండలంలోని తోపుచర్ల లిఫ్టును మంజూరు చేసింది. నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఎల్-14 స్టేజ్-1 పంప్‌హౌస్ నుంచి మాడ్గుల పల్లి మండలంలోని తోపుచర్ల. పుచ్చకాయలగూడెం, సీత్యాతండా, దేవతలబావిగూడెం, గణపతివారిగూడెం, బొమ్మకల్ గ్రామాల గొలుసుకట్టు చెరువులను నింపేందుకు లిఫ్టు మంజూరు చేస్తామని అప్పుడు కేసీఆర్ ప్రకటించారు. దీంతో అధికారులు భూములను సర్వే చేసి వేములపల్లి పరిధిలోని ఎల్-14 స్టేజ్-1 పంప్‌హౌస్ నుంచి తోపుచర్ల, పుచ్చకాయ లగూడెం వరకు సుమారు 5.6కిలో మీటర్ల మేరా భూ గర్భ పైపులైన్ వేసి చివరి చెరువులకు నీటిని నింపేం దుకు ప్రతి పాదనలు ప్రభుత్వానికి పంపించారు. పుచ్చకాయలగూడెం గ్రామ శివారులో లిఫ్టును నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు లిఫ్టు పనులకు శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్ అలసత్వం కారణంగా అప్పటి నుంచి పనులు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. లిఫ్టు పూర్తయితే వ్యవసాయ భూములు సాగులోకి వస్తాయని అనుకున్న రైతులకు నిరాశే మిగిలింది.
లిఫ్టు పూర్తయితేనే చెరువులకు జలకళ
తోపుచర్ల లిఫ్టు ద్వారా గొలుసుకట్టు చెరువులను నింపేందుకు ప్రభుత్వం లిఫ్టును మంజూరు చేసినప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఈ లిఫ్టు ద్వారా మండలంలోని తోపుచర్ల, పుచ్చకాయలగూడెం, గణపతివారిగూడెం, బొమ్మకల్ గ్రామాల పరిధిలోని చిన్నచెరువు, పెద్దచెరువు, బల్పువానికుంట, ఊర చెరువు, ఊర కుంట, పాత బొమ్మకల్ చెరువులకు ప్రస్తుతం నీరందకపోవడంతో కేవలం దాదాపు 60ఎకరాలకు నీరు అందుతుండగా లిఫ్టు పూర్తయితే ఈ చెరువుల కింద సుమారు 316ఎకరాలకు నీరందే అవకాశం ఉంది. నిండు కుండలా మారడంతోపాటు సుమారు 315 ఎకరాల వ్యవసాయ భూములు సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా భూగర్భజలాలు సమృద్ధిగా పెరిగి బోరుబావులకు నీరందే అవకాశం ఉంది. అదేవిధంగా చెరువులోకి సమృద్ధిగా నీరు చేరినట్లయితే భూగర్భజలాలు వృద్ధి చెంది బోరుబావుల కింద సుమారు మరో 500ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు.
అయిటిపాముల.. నెరవేరేనా రైతుల కల
కట్టంగూరు: కట్టంగూరు మండలంలోని అయిటిపాముల రిజర్వాయర్ వద్ద రూ.100కోట్లతో చేపట్టనున్న అయిటిపాముల ఎత్తిపోతల పథకం పనులు పది నెలల నుంచి నిలిచిపోయాయి. 2023 సెప్టెంబర్‌లో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ ఏర్పాటు చేసే ప్రాంతం వరకు సుమారు 500మీటర్ల మేర అప్రోచ్ కెనాల్ పనులు ప్రారంభించారు. కట్టంగూరు, శాలిగౌరారం, నకి రేకల్ మండలాల్లోని 11గ్రామాల్లోని 8వేలకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఎత్తిపోతల పథకా నికి 240 ఎకరాలు అవసరముండగా ఉండగా అధికారులు భూసేకరణ చేసి సర్వే పనులు పూర్తిచేశారు. భూమి కోల్పోతున్న చాలామంది రైతు లకు నష్టపరిహారం కూడా అందింది. చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన పాల్వాయి నర్సింహారెడ్డి, పాపయ్య అనే రైతులు తమకు సరిపడా నష్టపరిహారం ఇవ్వలేదని కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే విధించడంతో పనులు నిలిచిపోయాయి.