Share News

అనవసరంగా ముందస్తు అరెస్టులా..?

ABN , Publish Date - Mar 24 , 2024 | 04:49 AM

తాము గతంలో ఇచ్చిన తీర్పులను పట్టించుకోకుండా, వివేకాన్ని ఉపయోగించకుండా ముందస్తు అరెస్టు(ప్రివెంటివ్‌ డిటెన్షన్‌) ఉత్తర్వులు జారీ చేయడం మానుకోవాలని సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని గట్టిగా మందలించింది.

అనవసరంగా ముందస్తు అరెస్టులా..?

పీడీ చట్టం అమలులో తెలంగాణను విమర్శించిన సుప్రీం కోర్టు

కూలీని గూండాగా పేర్కొని అరెస్టు చేసిన పోలీసులపై ఫైర్‌

న్యూఢిల్లీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): తాము గతంలో ఇచ్చిన తీర్పులను పట్టించుకోకుండా, వివేకాన్ని ఉపయోగించకుండా ముందస్తు అరెస్టు(ప్రివెంటివ్‌ డిటెన్షన్‌) ఉత్తర్వులు జారీ చేయడం మానుకోవాలని సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని గట్టిగా మందలించింది. ఓ వ్యక్తి ముందస్తు అరెస్టుకు సంబంధించి రాచకొండ సీపీ జారీ చేసిన ఒక ఉత్తర్వును దృష్టిలో ఉంచుకుని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జె.బి.పర్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం ఇచ్చిన ఆదేశాలు శనివారం అధికారికంగా వెల్లడయ్యాయి. నేనావతి రవి(బుజ్జి) అనే కూలీని గూండాగా పేర్కొని రాచకొండ సీపీ అరెస్టు చేశారు. దీన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. న్యాయస్థానం అనుమతించలేదు. దీన్ని కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఒక వ్యక్తి నేరాలకు పాల్పడే అవకాశాలున్నాయని, దాని వల్ల ప్రజా భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ప్రభుత్వం భావిస్తేనే అతడిని అరెస్టు చేయాలని తెలిపింది. ఈ కేసులో దోపిడీలకు సంబంధించిన ఆరోపణలపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసినంత మాత్రాన నిందితుడిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అనేక అక్రమ ముందస్తు నిర్బంధాలను కోర్టులు తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేసింది. నిందితుడిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.

Updated Date - Mar 24 , 2024 | 04:49 AM