ఈ ఎన్నికలు దేనికి రెఫరెండం?
ABN , Publish Date - May 12 , 2024 | 05:39 AM
ఈ ఎన్నికలు రెఫరెండం అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అది కాంగ్రెస్ పార్టీ అవినీతికా ? ఆర్‌ఆర్ ట్యాక్స్‌కా ? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి

కాంగ్రెస్ అవినీతికా? ఆర్‌ఆర్ ట్యాక్స్‌కా ?
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధ్వజం
హైదరాబాద్, మే 11 (ఆంధ్రజ్యోతి): ఈ ఎన్నికలు రెఫరెండం అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అది కాంగ్రెస్ పార్టీ అవినీతికా ? ఆర్‌ఆర్ ట్యాక్స్‌కా ? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి కూడా అత్యంత ప్రమాదకారి అని అన్నారు. ప్రధాని మోదీ పదేళ్ల కాలంలో తెలంగాణకు ఏం చేయలేదంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు మీడియా సమావేశంలోనూ, సీఎం రేవంత్‌రెడ్డికి, ప్రజలకు రాసిన లేఖలోనూ కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని, అబద్ధాలు చెప్పడంలో వారికి వారే సాటి అని కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ చెబుతున్న మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. అవినీతికి మారుపేరైన కాంగ్రెస్ మాదిరిగానే బీజేపీ కూడా ఉంటుందని రేవంత్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో అభద్రతాభావం, అసహనం, అబద్థాలు, వక్రీకరణలు పెరిగిపోతున్నాయని చెప్పారు. నిజాలు చెబితే కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవదని తెలిసే అబద్ధాలు చెప్పి బీజేపీపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. అణుబాంబు కలిగి ఉన్న పాకిస్థాన్‌కు అణిగిమణిగి ఉండాలంటూ కాంగ్రెస్ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటరిచ్చారు. పాక్‌కు అణిగిమణిగి ఉండటం కాంగ్రెస్‌కు అలవాటని, నేడు దేశంలో అధికారంలో ఉన్నది బీజేపీ అని గుర్తు చేశారు.
భారత్‌పై ఒక్కసారి దాడి చేస్తే వందసార్లు ఎదురుదాడి చేస్తామనే విధంగా మోదీ పాక్‌కు జవాబిచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబ వైఖరి కారణంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకోలేదంటూ గతంలో మాట్లాడిన కాంగ్రెస్ నేతలు వాటిని మరిచిపోయి గాడిదలతో గుడ్లు పెట్టించే స్థాయికి దిగజారారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. పేద ప్రజల కోసం మోదీ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం రేవంత్ రెడ్డికి, కాంగ్రె్‌సకు, రాహుల్ గాంధీకి గాడిద గుడ్డులాగా కనిపిస్తున్నాయా? అని ప్రశ్నించారు. బస్తీ దవాఖానాలు, పీఎం కిసాన్ డబ్బులు, తెలంగాణలో నిర్మించిన 2500కి.మీ హైవేలు, యూరియా పరిశ్రమ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గాడిద గుడ్డులాగా కనిపిస్తున్నాయా? అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.