Share News

రాష్ట్రంలో యూ ట్యాక్స్‌ బాదుడు

ABN , Publish Date - May 22 , 2024 | 05:16 AM

రాష్ట్రంలో రైతుల నుంచి తాలు, తరుగు, తేమ పేరిట ఎక్కువ ధాన్యం తూకం వేసిన మిల్లర్లు యూ ట్యాక్స్‌ పేరుతో మంత్రికి, అధికారులకు చెల్లింపులు చేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన ఆరోపణ చేశారు.

రాష్ట్రంలో యూ ట్యాక్స్‌ బాదుడు

ధాన్యం కొట్టేసిన మిల్లర్ల నుంచి 500 కోట్ల వసూళ్లు.. అందులో నుంచి ఢిల్లీకి 100 కోట్లు

ఉత్తమ్‌, అధికారులపై ఏలేటి ఆరోపణలు

హైదరాబాద్‌, మే 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతుల నుంచి తాలు, తరుగు, తేమ పేరిట ఎక్కువ ధాన్యం తూకం వేసిన మిల్లర్లు యూ ట్యాక్స్‌ పేరుతో మంత్రికి, అధికారులకు చెల్లింపులు చేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ధాన్యం కొనుగోలులో క్వింటాకు 10-12 కిలోల చొప్పున ఎక్కువ తూకం వేస్తున్నారని, ఈ ప్రక్రియలో వసూలవుతున్న రూ.వందల కోట్లు ఎవరి ఖాతాలోకి వెళుతున్నాయో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కమిషనర్‌ చౌహాన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో ఇటీవల రూ.500 కోట్లు చేతులు మారితే, అందులో రూ.100 కోట్లు ఎన్నికల ఫండ్‌ పేరిట ఢిల్లీకి పంపించిన మాట వాస్తవం కాదా..? అని ఉత్తమ్‌ను నిలదీశారు. సీఎం రేసులో తాను కూడా ఉన్నానని చెప్పుకోవడానికి ఉత్తమ్‌ ఈ మొత్తాన్ని ఢిల్లీకి పంపించారని ఆరోపించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ధాన్యాన్ని ఎక్కువ తూకం వేయడంతో పాటు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) ఇవ్వని మిల్లర్ల నుంచి అనధికారిక జరిమానా పేరిట రాష్ట్రంలో రూ.950 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. డీఫాల్టర్‌ మిల్లర్లకు సీఎంఆర్‌ కోటా ఎలా ఇచ్చారో కమిషనర్‌ చౌహాన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రూ.వేల కోట్ల ధాన్యం మిల్లర్ల వద్ద ఉన్నా.. మళ్లీ వారికే ధాన్యం ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి సీఎంఆర్‌ ద్వారా రావాల్సిన బియ్యం విలువ సుమారు రూ.25వేల కోట్లు అని, మిల్లర్ల వద్ద ఉన్న ఈ ధాన్యానికి ప్రభుత్వం వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి కొనసాగుతోందని దుయ్యబట్టారు. గడచిన మూడేళ్లుగా ధాన్యం సేకరించి, సీఎంఆర్‌ ఇవ్వని మిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని నిలదీశారు. ఇలాంటి మిల్లర్లపై రూ.450 కోట్లు రశీదు లేని జరిమానా విధించారని ఆరోపించారు.

వారాణసీలో వార్‌ వన్‌సైడే: సంజయ్‌

వారాణసీలో వార్‌ వన్‌ సైడే ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. వచ్చే నెల 1న జరిగే ఎన్నికల్లో అత్యధిక ఓట్లు ప్రధాని మోదీకే వస్తాయని తెలిపారు. మంగళవారం సంజయ్‌ వారాణసీలో తెలుగు ప్రజలు ఎక్కువ సంఖ్యలో నివసించే పాండే హవేలీ, సోనార్‌పురలో ఎన్నికల ప్రచారం చేశారు. కాగా, ఉత్తరాదిలో బీజేపీ గెలుపు కోసం దక్షిణాది నేతలంతా ప్రచారం చేస్తున్నారని కర్ణాటక, తమిళనాడు బీజేపీ కో ఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - May 22 , 2024 | 05:16 AM