Share News

ధూం ధాం..!

ABN , Publish Date - Apr 05 , 2024 | 05:45 AM

అసెంబ్లీ ఎన్నికల ముందు గత ఏడాది సెప్టెంబరు 17న తుక్కుగూడలో కాంగ్రెస్‌ పార్టీ భారీఎత్తున విజయ భేరి బహిరంగ సభను నిర్వహించింది. ఆరు గ్యారెంటీలను ప్రకటించింది! తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది! ఇప్పుడు అదే సెంటిమెంటుతో లోక్‌సభ ఎన్నికల ముందు కూడా

ధూం ధాం..!

బలం, బలగం చాటేలా తుక్కుగూడ సభ

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఊపు తెచ్చే వ్యూహం

విజయవంతంగా ఆరు హామీల అమలుపై వివరణ

కేంద్రంలో అధికారంలోకి వస్తే పాంచ్‌ న్యాయ్‌ అమలు!

జన జాతర సభలోనే మ్యానిఫెస్టో విడుదలకూ చాన్స్‌

సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి, ఇతర నేతలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల ముందు గత ఏడాది సెప్టెంబరు 17న తుక్కుగూడలో కాంగ్రెస్‌ పార్టీ భారీఎత్తున విజయ భేరి బహిరంగ సభను నిర్వహించింది. ఆరు గ్యారెంటీలను ప్రకటించింది! తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది! ఇప్పుడు అదే సెంటిమెంటుతో లోక్‌సభ ఎన్నికల ముందు కూడా శనివారం (ఏప్రిల్‌ 6) తుక్కుగూడలోనే ‘జన జాతర’ పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. పార్టీ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరు కానున్న ఈ సభను ధూం ధాంగా నిర్వహించాలని కసరత్తు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు చెప్పిన ప్రతి హామీనీ అమలు చేస్తున్నామని వివరించనుంది! ఆరు గ్యారెంటీల తరహాలోనే.. కేంద్రంలో అధికారంలోకి వస్తే ‘పాంచ్‌ న్యాయ్‌’ను అమలు చేస్తామని స్పష్టం చేయనుంది. వెరసి, తమ బలం, బలగం చాటేలా తుక్కుగూడ జన జాతర సభను నిర్వహించాలని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఊపు తెచ్చే విధంగా దీనిని నిర్వహించాలని నిర్ణయించారు. జన జాతర సభకు పెద్ద ఎత్తున జన సమీకరణను చేయాలని పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు సభ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటున్న కాంగ్రెస్‌ దేశంలోని పలు విపక్ష పార్టీలను కలుపుకొని ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంతోపాటు దానికి నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మోదీ పదేళ్ల పాలనకు తెరదించి దేశంలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని పునరుద్ధరించాలని భావిస్తోంది. ఇందుకు తుక్కుగూడ సభనే వేదికగా మార్చాలని భావిస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామో తెలియజేసే మ్యానిఫెస్టోను ఈ వేదిక నుంచి విడుదల చేయనుంది. దీంతో ఈనెల 6న నిర్వహించే తుక్కుగూడ సభపై తెలంగాణ ప్రజలతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలు, రాజకీయ పార్టీల్లోనూ ఆసక్తి నెలకొంది. అలాగే, తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ భారీ ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక్కడ 14 లోక్‌సభ సీట్లను గెలుచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. మూడు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ బావుటా ఎగుర వేసినట్లే.. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ జైత్రయాత్రను కొనసాగించాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తున్న సంక్షేమ, అభివృద్థి పథకాలు, ప్రజాస్వామ్యయుతమైన పాలనతో రాష్ట్రంలో కాంగ్రె్‌సకు సానుకూలత ఏర్పడిందని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, 30 వేల ఉద్యోగ నియామకాలు, 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు జమతోపాటు ఇతర అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువైనట్టు అంచనా వేస్తున్నారు. దీనిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు తుక్కుగూడ సభను వేదిక చేసుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న పథకాలతోపాటు దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్న పాంచ్‌ న్యాయ్‌ను తుక్కుగూడ వేదిక నుంచి దేశ ప్రజలకు ఆ పార్టీ అగ్ర నాయకత్వం తెలియజేయనుంది.

ఇదే కాంగ్రెస్‌ తొలి భారీ బహిరంగ సభ

ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు ముందు సొంతంగా ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభ తుక్కుగూడ జన జాతర సభనే కావడం విశేషం. రాహుల్‌ గాంధీ న్యాయ్‌ యాత్ర ముగింపు సభను ముంబైలో నిర్వహించారు. దానికి కాంగ్రె్‌సతోపాటు ఇండియా కూటమిలోని ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. అనంతరం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పేరిట ఇండియా కూటమి మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ రెండూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన సభలే. వీటి తర్వాత దేశవ్యాప్తంగా ఇండియా కూటమిపై ప్రజల విశ్వాసం మరింత పెరిగిందని కాంగ్రెస్‌ నేతలు అంచనా వేస్తున్నారు. ఆ విశ్వాసాన్ని రెట్టింపు చేసేలా జన జాతర సభను నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. దాంతో, ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సభను విజయవంతం చేయడంపై పీసీసీ అధ్యక్షునిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే రెండుసార్లు ఆయన సభ ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయన ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకులంతా సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పది లక్షలకు తగ్గకుండా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని, దాంతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసేందుకు ప్రతి అంశంపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిర్ణయించారు. మూడు నెలల కిందట ప్రజల మనసులు గెలుచుకున్న తమ ప్రభుత్వం.. ఈ కొద్దికాలంలోనే వారి మన్ననలు మరింతగా పొందిందనే విషయాన్ని నిరూపించుకునేందుకు, తమ బలం, బలగం చాటుకునేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నిస్తున్నారు. జన జాతర వేదికగా తమ బలం చాటి చెప్పి దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీలో సమరోత్సాహం నింపేందుకు కృషి చేయాలని నిర్ణయించారు.

Updated Date - Apr 05 , 2024 | 05:45 AM