Share News

KTPS : తుక్కు మాటున నొక్కేశారు!

ABN , Publish Date - Apr 06 , 2024 | 04:17 AM

మార్కెట్‌ విలువలో పావు వంతు ధరకే అడ్డగోలుగా అప్పగింత..! అధికారులు సహా సెక్యూరిటీ అంతా వారి వారే..! అంచనాలు మొదలు.. టెండర్‌ కేటాయింపు వరకు అంతా అనుమానాస్పదమే..! ఇదీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌

KTPS : తుక్కు మాటున నొక్కేశారు!

కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం ప్లాంట్‌ కూల్చివేతలో గోల్‌మాల్‌

మెటీరియల్‌ విలువ రూ.2 వేల కోట్లు

రూ.485 కోట్లకే ముంబై సంస్థ చేతికి

గత ప్రభుత్వంపై భారీగా ఆరోపణలు

అక్రమాలపై జెన్‌కో సీఎండీ రిజ్వీ ఆగ్రహం

కొత్తగూడెం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 5: మార్కెట్‌ విలువలో పావు వంతు ధరకే అడ్డగోలుగా అప్పగింత..! అధికారులు సహా సెక్యూరిటీ అంతా వారి వారే..! అంచనాలు మొదలు.. టెండర్‌ కేటాయింపు వరకు అంతా అనుమానాస్పదమే..! ఇదీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌ (కొత్తగూడెం థరల్‌ పవర్‌స్టేషన్‌) ఓఅండ్‌ఎం ప్లాంట్‌ కూల్చివేతలో సాగిన తతంగం. దీనివెనుక రూ.కోట్లు చేతులు మారాయంటూ ఆరోపణలు వస్తున్నాయి. జపాన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన, విలువైన పంచలోహ సామగ్రి వినియోగించి 1966 జూలై 15న కేటీపీస్‌ నాలుగు యూనిట్ల నిర్మాణం చేపట్టారు. క్రమంగా 8 యూనిట్లుగా అభివృద్ధి చెంది 480 మెగావాట్ల విద్యుత్తును రాష్ట్ర గ్రిడ్‌కు అందించింది. ఇంతటి విలువైన కర్మాగారానికి కాలం చెల్లిందని, కాలుష్యం వెదజల్లుతోందని కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయం మేరకు కూల్చివేతకు 2022లో ఆదేశించారు. దీనికోసం టెండర్లు పిలిచారు. మార్కెట్‌ ధరల ప్రకారం ప్లాంట్‌ మెటీరియల్‌ విలువ రూ.2 వేల కోట్లకు పైనే ఉంటుదని ఇంజనీరింగ్‌ అధికారుల అంచనా. కానీ, ముంబైకి చెందిన హెచ్‌ఆర్‌ కంపెనీకి రూ.485 కోట్లకే ప్లాంట్‌ను కట్టబెట్టారు. అప్పటి ప్రభుత్వం, అధికారులు పిలిచిన టెండర్‌లోనే భారీ గోల్‌మాల్‌ జరిగిందని తెలుస్తోంది. రూ.కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్లాంట్‌ కూల్చివేత అనంతరం రాగి, తదితర విలువైన సామగ్రిని ముందు, వెనుక భారీ భద్రతతో కంటైనర్‌లో తరలించారు. కూల్చివేత మెటీరియల్‌లో దొరికిన పైప్‌ను పరీక్షకు పంపగా.. అది పంచలోహంతో చేసినదిగా తేలింది. ఇక టన్ను తుక్కును రూ.40 వేలకు అమ్మినట్లు తెలుస్తోంది. టన్ను స్టీల్‌ ధర నాణ్యత మేరకు రూ.55 వేల నుంచి రూ.70 వేలు పలుకుతోంది. కేటీపీఎస్‌ ప్లాంట్‌ తుక్కునే టన్ను రూ.40 వేలకు అమ్మారంటే దాని నాణ్యత స్థాయిని చాటుతోంది. కేటీపీఎస్‌ ప్లాంట్‌ను 2030 వరకు కూల్చవద్దని కేంద్రం 2023 జనవరి 20న ఆదేశాలిచ్చింది. ఇలాంటి ఉత్తర్వులు వస్తాయని ఊహించిన జెన్‌కో ఉన్నతాధికారులు రెండ్రోజుల ముందే(2023 జనవరి 18) ప్లాంట్‌ కూల్చివేత ప్రారంభించారు. టర్బైన్‌లోని కేబుల్స్‌ను కత్తిరించడం దీనిని బలపరుస్తోంది.

మంత్రి దృష్టికి విషయం.. నోట్‌ ఫైౖల్‌ సిద్ధం

కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం ప్లాంట్‌ కూల్చివేతలో హెచ్‌ఆర్‌ కంపెనీ అక్రమాలపై జెన్‌కో సీఎండీ రజ్వీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రెండు రోజులపాటు దామరచర్ల విద్యుత్తు ప్లాంట్‌ అంశంపై చర్చించేందుకు వెళ్లిన సీఎండీ గురువారం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆ వెంటనే ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ఆరాతీశారు. కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం ప్లాంట్‌ కూల్చివేత టెండర్లు, వర్క్‌ ఆర్డర్‌, జరిగిన పనులు, తరలించిన తుక్కు, ఇంకా ఉన్న తుక్కుపై ఆరా తీశారు. పూర్తి వివరాలతో నోట్‌ ఫైల్‌ తయారు చేసి విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు వివరించేందుకు ఫైల్‌ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఫైల్‌ సిద్ధం చేశారని తెలిసింది.

కేటీపీఎ్‌సలో కేజీఎఫ్‌..

అక్కడంతా గోప్యమే.. ప్రాణం పోయినా బయటకు రాదు. మట్టి తొలగించే కూలీలు మొదలు ఇనుము తరలించే కంటైనర్లు, ఎక్స్‌కవేటర్లు, డోజర్లు, పహారా కాసే జవాన్ల వరకు అందరూ ముంబై వారే. కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం ప్లాంట్‌లో హెచ్‌ఆర్‌ కంపెనీ సొంత సామ్రాజ్యం ఇది. ప్లాంట్‌ ప్రాంతం మొత్తాన్ని ఈ సంస్థ ఆధీనంలోకి తీసుకుంది. కేటీపీఎస్‌ ఉద్యోగులు, ఎస్‌పీఎఫ్‌ జవాన్లను సైతం అనుమతించలేదు. ప్లాంట్‌ నుంచి ఇటీవల ఓ కూలీ రాగి ముక్కను తీసుకొస్తుండగా హెచ్‌ఆర్‌ సంస్థ సూపర్‌వైజర్‌ రాడ్లతో కొట్టాడు. ఆ దెబ్బలకు కూలీ జేబులోని సెల్‌ఫోన్‌ ముక్కలైంది. ఇక జెన్‌కో సీఈ స్థాయి అధికారి వెళ్లాలన్నా పూర్తి తనిఖీలు తప్పనిసరి. కూల్చివేత పనుల్లో 300 నుంచి 350 మంది కూలీలు పనిచేస్తున్నారు. వారి పరిస్థితి ఏంటి? వేతనాలు, పనిగంటలు, సౌకర్యాల గురించి కనీసం కార్మిక శాఖ అధికారులకూ తెలియదు.

Updated Date - Apr 06 , 2024 | 04:17 AM