Share News

TS tourism : పర్యాటకానికి సొబగులు

ABN , Publish Date - Dec 18 , 2024 | 07:14 AM

భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం, ఆర్థిక వనరులను పెంచుకోవడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రధాన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పర్యాటక

 TS tourism : పర్యాటకానికి సొబగులు

27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి

5 ఏళ్లలో 15 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యం

సీఎం అధ్యక్షతన పర్యాటక ప్రోత్సాహక మండలి

కొత్త పర్యాటక విధానం రూపొందించిన ప్రభుత్వం

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం, ఆర్థిక వనరులను పెంచుకోవడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రధాన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పర్యాటక విధానం 2025-30 రూపొందించింది. అలాగే ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర పర్యాటక ప్రోత్సాహక మండలి ఏర్పాటు కానుంది. కొత్త విధానంపై మంగళవారం శాసనసభలో చర్చించారు. వచ్చే అయిదేళ్లలో పర్యాటక రంగానికి రూ.15 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం, అదనంగా మూడు లక్షల మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొం ది. ప్రపంచ దేశాలతో పోటీపడేలా పర్యాటక కేంద్రాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు కొత్త ప్రాజెక్టులతో దేశ, విదేశీ పర్యాటకులకు తెలంగాణను గమ్యస్థానంగా మలచడమే లక్ష్యమని తెలిపింది. ప్రైవేటు భాగస్వామ్యంతో పర్యాటక కేంద్రాలను తీర్చిదిద్దడానికి ఈ విధా నం అనుమతిస్తుంది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 1-2 గంటల్లో ప్రయాణ దూరంలో ప్రత్యేక ప్రాజెక్టులు, ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేయనున్నారు. వికారాబాద్‌, సోమశిల, రామప్ప, కాళేశ్వరం, నాగార్జున సాగర్‌, భద్రాచలం, వరంగల్‌, గిరిజన సర్క్యూట్‌ (జోడెఘాట్‌, ఉట్నూర్‌, కేస్లాగూడ, వన్యప్రాణుల అభయారణ్యం, జలపాతాలు, ఎకో టూరిజం), చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లోని దర్శనీయ కేంద్రాలతోపాటు యాదగిరిగుట్ట, బాసర, వేములవాడ, గోల్కొం డ తదితర 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు. గోదావరి, కృష్ణానదీ పర్యాటకంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. వాటర్‌ కార్నివాల్‌, రివర్‌ ఫెస్టివల్స్‌ నిర్వహించడంతో పాటు చెరువులను అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్‌లోని అన్ని పర్యాటక ప్రదేశాల్లో వాక్‌ వేలు, ర్యాంపులు, ఎలివేటర్లు, టాయ్‌లెట్లు ఏర్పాటు చేయనున్నారు. వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారు. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో 10 వేల గదులు ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులకు వన్‌-స్టా్‌ప ప్లాట్‌ఫాంలా సేవలందించేందుకు ‘తెలంగాణ టూరిజం పోర్టల్‌’ను అందుబాటులోకి తీసుకొస్తారు. ‘హ్యాపెనింగ్‌ హైదరాబాద్‌’ ఇతివృత్తంతో ఆదివారాలు, సెలవుదినాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. గోల్ఫ్‌ పర్యాటకానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దేశ, విదేశీ పర్యాటకులు, ప్రధానంగా ఆగ్నేయాసియా దేశాల పర్యాటకులను ఆకట్టుకోవడానికి పరిచయ ట్రిప్స్‌ ఏర్పాటు చేయనున్నారు. నాగార్జున సాగర్‌ బుద్ధవనంలో వెల్‌నెస్‌ సెంటర్‌, ధ్యాన కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. కార్పొరేట్‌ సంస్థల సహకారంతో వారసత్వ భవనాలు, ప్యాలె్‌సలు, పర్యాటక కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు.

Updated Date - Dec 18 , 2024 | 07:14 AM