ప్రయాణం.. ప్రాణసంకటం
ABN , Publish Date - Nov 28 , 2024 | 12:05 AM
వ్యాపార, వాణిజ్య, విద్యా రంగంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిన మేడ్చల్ జిల్లా ప్రాంతంలో ప్రయాణ సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జిల్లా నగర శివారు చుట్టూ ఉండటం, శివారు ప్రాంతాల్లోనే ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు కాలేజీలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థుల ప్రమాదకర ఫీట్లు
ప్రమాదమని తెలిసినా తప్పని ఫుట్‌బోర్డు ప్రయాణం
జిల్లా శివారులో అత్యధిక కళాశాలలు
బస్సుల కోసం విద్యార్థులకు తప్పని అగచాట్లు
మేడ్చల్ ప్రతినిధి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి) : వ్యాపార, వాణిజ్య, విద్యా రంగంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిన మేడ్చల్ జిల్లా ప్రాంతంలో ప్రయాణ సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జిల్లా నగర శివారు చుట్టూ ఉండటం, శివారు ప్రాంతాల్లోనే ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు కాలేజీలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం కాలేజీ సమయాల్లో ఆర్టీసీ బస్సులన్నీ విద్యార్థులతో కిక్కిరిసిపోతున్నాయి. జిల్లాలో మేడ్చల్, ఘట్‌కేసర్, కీసర మార్గాల్లో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. నగరం నుంచి ప్రతిరోజు దాదాపు వేల మంది విద్యార్థులు కాలేజీలకు రాకపోకలు సాగిస్తుంటారు. జిల్లాలో మేడ్చల్, కుషాయిగూడ, బోడుప్పల్ ఆర్టీసీ డిపోల ద్వారా బస్సులు ప్రతి రోజు నగరంతో పాటు ఇతర ప్రాంతాలకు నడుస్తుంటాయి. అయితే బస్సులు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నడపటం లేదు. పెరిగిన ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా జిల్లాలో ఆర్టీసీ తమ వాహనాలను నడపక పోవటంతో ప్రైవేటు వాహనాలు మాత్రం పెద్ద ఎత్తన పెరిగాయి. ప్రతీ రోజు వేలాదిమంది ప్రయాణీకులు మేడ్చల్ నుంచి నగరంలోని పరిశ్రమల్లో, వ్యాపార సంస్థల్లో పనిచేయటానికి వస్తుంటారు. దీనికి తోడు జిల్లాలో విద్యాపరంగా పెద్ద ఎత్తున ఇంజినీరింగ్ కళాశాలలు వెలిశాయి. దీంతో వేల సంఖ్యలో విద్యార్ధుల రాకపోకలు ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్ధులకు ఆయా కళాశాలల యాజమాన్యాలు ప్రత్యేకంగా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తునప్పటికీ అనేక మంది విద్యార్ధులు ఆర్టీసీ బస్సులను ఆశ్ర యించి కళాశాలలకు వచ్చి వెళ్తున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిన ప్రయాణికులతో కనబడుతున్నాయి. జిల్లాలోని మేడ్చల్ ఆర్టీసీ డిపోలో వందకు పైగా మాత్రమే బస్సులు ఉన్నాయి. కాగా ఈ సంఖ్య 150కి చేరినా తక్కువేనని స్థానికులు అంటున్నారు. అదేవిధంగా కుషాయిగూడ, బోడుప్పల్ డిపోల్లో కూడా వందకు పైగానే బస్సులు ఉన్నాయి. ప్రభుత్వం ఆర్టీసికి కొత్త బస్సులు కేటాయిస్తున్నా జిల్లాలోని డిపోల్లో బస్సుల సంఖ్య మాత్రం మారడం లేదు. ఉదయం సాయంత్రం వేళల్లో ప్రయాణికులు గమ్యానికి చేరుకునే తొందరలో బస్సులు ఫుల్‌గా ఉండటంతో విద్యార్ధులు ఫుట్‌బోర్డ్ పై వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. బస్సుల డ్రైవర్‌లు కూడా బస్టా్‌పల్లో విద్యార్థులను చూసి బస్టా్‌పకు దూరంగా ఆపుతుండటంతో విద్యార్థులు బస్సుల వెంట పరుగెత్తాల్సి వస్తుంది. ఈ క్రమంలో విద్యార్థులు ప్రమాదాలతో ఆడుకోవాల్సి వస్తున్నది. ఉపాధి, విద్య, వాణిజ్య రంగాల్లో జిల్లాలో పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు స్థిరపడుతున్నారు. ఎప్పుడో గతంలో 15 ఏళ్ల క్రితం జనాభా ఆధారంగానే బస్సులు నడుస్తుండటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. విద్యార్థుల, ఉద్యోగుల, ప్రయాణికుల, జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందుకనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులను పెంచితే బాగుంటుందని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళల్లో సర్వీసులు పెంచిన ఎడల ఆర్టీసీకి ఆదాయం పెరగటంతో పాటు ప్రజల అవసరాలు తీరుతాయని ప్రజలు కోరుతున్నారు.