Share News

తెలంగాణ టు కడప మద్యం రవాణా

ABN , Publish Date - Apr 08 , 2024 | 04:13 AM

తెలంగాణ మద్యాన్ని భారీగా కడప జిల్లాకు తరలిస్తుండగా సెబ్‌ అధికారులు పట్టుకున్నారు. శనివారం రాత్రి కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌ పోస్టు వద్ద

తెలంగాణ టు కడప మద్యం రవాణా

వైసీపీ నేతల అండతో భారీగా మద్యం రవాణా!

పంచలింగాల చెక్‌పోస్టు వద్ద పట్టుకున్న సెబ్‌ సిబ్బంది

రూ.14.51 లక్షల సరుకు సీజ్‌.. ఇద్దరి అరెస్టు

తప్పించుకున్న సరఫరాదారు రింగుల బాషా

అతనిపై ఇప్పటికే 104 ఎర్ర చందనం, మద్యం కేసులు

కర్నూలు, ఏప్రిల్‌ 7(కర్నూలు): తెలంగాణ మద్యాన్ని భారీగా కడప జిల్లాకు తరలిస్తుండగా సెబ్‌ అధికారులు పట్టుకున్నారు. శనివారం రాత్రి కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌ పోస్టు వద్ద రూ.14.51 లక్షల మద్యంను సీజ్‌ చేశారు. ఆ వివరాలను కర్నూలు జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రవి కుమార్‌ ఆదివారం విలేకరులకు వెల్లడించారు. ఈ కేసులో కీలక వ్యక్తి రింగుల బాషాపై ఇప్పటికే కడప, కర్నూలు జిల్లాల్లో 104 కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఎర్ర చందనం, మద్యం అక్రమ రవాణ కేసులే. తాజాగా తెలంగాణ మద్యం అక్రమ రవాణాకు సంబంధించి అతనిపై 105వ కేసు నమోదు చేశారు. కడప జిల్లా చాపాడు మండలం ఖాదర్‌పల్లికి చెందిన చింపర్తి రింగుల బాషా సహా మరికొందరు ముఠాగా ఏర్పడి అధికార వైసీపీ ముఖ్య నాయకుల అండదండలతో ఎర్ర చందనం అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఎర్ర చందనంపై నిఘా పెరగడంతో కర్ణాటక, తెలంగాణ మద్యం అక్రమ రవాణాపై దృష్టి సారించారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం జింకలపల్లి గ్రామంలోని శ్రీనివాస వైన్స్‌, వనపర్తిలోని ఎక్సైజ్‌ శాఖకు చెందిన ఐఎంఎల్‌ డిపో నుంచి నేరుగా కడప జిల్లాకు మద్యం తరలిస్తున్నారు. అశోక్‌ లైలాండ్‌ వాహనంలో వరి పొట్టు మధ్య 240 బాక్సుల (180 మిల్లీ లీటర్ల పరిమాణం కలిగిన 11,520 క్వార్లర్‌ సీసాలు) తెలంగాణ మద్యం తీసుకు వస్తుండగా కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌ పోస్టు వద్ద సెబ్‌ సిబ్బంది పట్టుకున్నారు. మద్యం, వాహనం సీజ్‌ చేసి, డ్రైవర్‌ పటాన్‌ సాగక్‌, క్లీనర్‌ షేక్‌ షఫీలను అరెస్టు చేశారు. వీరితో పాటు మద్యం అక్రమ రవాణాదారుడు రింగుల బాషా, వాహనం యజమాని కందనూరు హబీబుల్లాలపై కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 08 , 2024 | 04:13 AM