Kumaram Bheem Asifabad- బూరెపల్లిలో విషాదం
ABN , Publish Date - Apr 03 , 2024 | 10:36 PM
చింతలమానేపల్లి మండలంలోని బూరెపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..బూరెపల్లిలో బుధవారం ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది.

చింతలమానేపల్లి, ఏప్రిల్ 3: చింతలమానేపల్లి మండలంలోని బూరెపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..బూరెపల్లిలో బుధవారం ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. అటవీ ప్రాంతం నుంచి బూరెపల్లి గ్రామ శివారులోకి ప్రవేశించింది. అక్కడే ఉన్న మిర్చి తోటలోకి ఏనుగు వచ్చింది. ఆ సమయంలో అల్లూరి శంకర్(56) అనే రైతు అతడి భార్య సుగుణాబాయి మిర్చి ఏరుతున్నారు. ఏనుగును గమనించిన శంకర్ దాన్ని తరిమేందుకు యత్నించాడు. దీంతో ఏనుగు అతడిపై దాడి చేసింది. కింద పడిన శంకర్ వీపుపై ఏనుగు కాళ్లు పెట్టి తొక్కడంతో తీవ్రగాయాలైన శంకర్ అక్కడికిక్కడే మృతి చెందాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. శంకర్‌కు ఇద్దరు భార్యలు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. మిర్చి ఏరేందుకు వెళ్లిన శంకర్ విగత జీవిగా మారడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇటువంటి సంఘటన జరగడం జిల్లాలో ఇదే మొదటిదని, జిల్లాలో అసలు ఏనుగుల సంచారమే లేదని స్థానికులు అంటున్నారు. మహారాష్ట్ర నుంచి ఇది వచ్చిందని భావిస్తున్నారు.
అధికారుల పరిశీలన..
సమాచారం మేరకు అటవీశాఖ, పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ సాధిక్ పాషా తెలిపారు. అటవీశాఖ అధికారులు ఏనుగు ఏ మార్గంలో వచ్చిందో అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. ఏనుగు బూరెపల్లి, రణవెల్లి గ్రామాల శివారు మీదుగా బాలాజీ అనుకోడ, ఖర్జవెల్లి గ్రామ శివారు వైపు వెళ్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేలలోకి ఒక్కరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.