Share News

మేడిగడ్డ బ్యారేజీనా? బొందల గడ్డనా? కేసీఆర్‌ తేల్చాలి

ABN , Publish Date - Feb 29 , 2024 | 05:12 AM

మేడిగడ్డ బ్యారేజీనా.. బొందల గడ్డనా..? మాజీ సీఎం కేసీఆర్‌ తేల్చాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. నల్లగొండ సభ సందర్భంగా.. ‘మేడిగడ్డనా.. బొందల గడ్డనా..?

మేడిగడ్డ బ్యారేజీనా? బొందల గడ్డనా? కేసీఆర్‌ తేల్చాలి

తొమ్మిదేళ్లు సంచులు నింపుకున్నారు

మేడిగడ్డ పిల్లర్లు కుంగింది నిజం కాదా..?

హరీశ్‌, కేటీఆర్‌లు సమాధానం చెప్పాలి

సంజయ్‌.. పొన్నంకు క్షమాపణ చెప్పాలి

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ బ్యారేజీనా.. బొందల గడ్డనా..? మాజీ సీఎం కేసీఆర్‌ తేల్చాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. నల్లగొండ సభ సందర్భంగా.. ‘మేడిగడ్డనా.. బొందల గడ్డనా..? అక్కడ ఏం పీకడానికి పోయారు..?’ అని కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశించి కేసీఆర్‌ అన్న మాటలపై జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. ‘నీ అవినీతిని పీకడానికే మేడిగడ్డ పోయినం. అది బ్యారేజీనా.. బొందల గడ్డనా..? నువ్వే తేల్చాలి. ప్రజలకు దీనిపై స్పష్టత ఇవ్వాలి’ అని అన్నారు. కేటీఆర్‌, హరీశ్‌ నీతులు చెబుతున్నారని.. రేవంత్‌ మాటల గురించి మాట్లాడే వీళ్లు.. కేసీఆర్‌ మాటలు తప్పు అని ఆయనకు ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. కేసీఆర్‌ ఒకటి అంటే.. తాము వంద అంటామని చెప్పారు. బుధవారం గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగింది నిజమా..? కాదా..? కేటీఆర్‌.. హరీశ్‌ సమాధానం చెప్పాలన్నారు. మీడియాలో వచ్చిన వార్తలు చూసి ఆ ప్రాజెక్టును రాహుల్‌ గాంధీ సందర్శించారని తెలిపారు. ప్రజాధనం దుర్వినియోగం జరగొద్దనే ఉద్దేశంతోనే.. బాధ్యులపై చర్యలు ఉంటాయని ఆయన చెప్పారని గుర్తు చేశారు. మేడిగడ్డలో ఏం జరిగిందో అసెంబ్లీలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చూపించారని.. ఆర్థిక పరమైన అంశాలు సీఎం రేవంత్‌.. డిప్యుటీ సీఎం భట్టి ప్రజలకు వివరించారని పేర్కొన్నారు. సీఎం.. మంత్రులు క్షేత్రస్థాయిలో మేడిగడ్డకు వెళ్లి బ్యారేజీ పరిస్థితిని చూసి వచ్చారని తెలిపారు. తొమ్మిదేళ్లు సంచులు నింపుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడు మేడిగడ్డ పర్యటనకు వెళతామని అంటున్నారని.. మరి రేవంత్‌ పిలిచినప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దీనికి కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో చర్చకు సైతం కేసీఆర్‌ ఎందుకు రాలేదని కేటీఆర్‌ను ప్రశ్నించారు. కేసీఆర్‌ లేకుండా మేడిగడ్డ పోయినా వృధా ప్రయాస అన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌ పట్ల బండి సంజయ్‌ మాటలు సరికాదని.. తక్షణమే సంజయ్‌ క్షమాపణ చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. శ్రీరాముడిని ప్రధాని మోదీ, సంజయ్‌, కిషన్‌రెడ్డిలే మొక్కుతున్నట్టు.. దునియాలో ఎవరు మొక్కడం లేదన్నట్లు బిల్డప్‌ ఇస్తున్నారని విమర్శించారు. రాముడి పేరు మీద బీజేపీ నేతలు ఓట్లు అడిగి బతుకుతున్నారని మండిపడ్డారు. శ్రీరాముడు తల్లిని గౌరవించాడని.. మరి సంజయ్‌.. పొన్నం తల్లిని సంజయ్‌ ఎందుకు గౌరవించలేదని ప్రశ్నించారు. సంజయ్‌ క్షమాపణ చెప్పే వరకు ఆందోళనలు కొనసాగుతాయన్నారు. కడియం శ్రీహరి జీవితం గాలిపటంలాంటిదని.. ఆయనకు ఏం అర్థంకాక ఏదో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. మెదక్‌ ఎంపీగా పోటీ చేయాలనే ఆసక్తి లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. టైం బాగా లేక సంగారెడ్డిలో ఓడిపోయానని అన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 05:12 AM