Share News

నామినేషన్లకు నేడే ఆఖరు

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:11 AM

లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గురువారంతో గడువు ముగియనుంది. 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి బుధవారం వివిధ పార్టీల తరఫున, స్వతంత్రులు మొత్తం 230 మంది అభ్యర్థులు 302 సెట్ల నామినేషన్లు వేశారు. గడిచిన ఆరు రోజుల్లో

నామినేషన్లకు నేడే ఆఖరు

17 లోక్‌సభ స్థానాలకు ఒక్కరోజే 230 మంది అభ్యర్థుల నామినేషన్లు

సికింద్రాబాద్‌కు కాంగ్రెస్‌ నుంచి దానం, హైదరాబాద్‌కు బీజేపీ నుంచి మాధవీలత

వరంగల్‌, నల్లగొండ, భువనగిరి స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గురువారంతో గడువు ముగియనుంది. 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి బుధవారం వివిధ పార్టీల తరఫున, స్వతంత్రులు మొత్తం 230 మంది అభ్యర్థులు 302 సెట్ల నామినేషన్లు వేశారు. గడిచిన ఆరు రోజుల్లో 547 మంది 856 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ ఈనెల 18న విడుదల కాగా.. ఆరోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. దీంతో గురువారంతో ఈ ప్రక్రియ ముగియనుండగా.. మరుసటి రోజైన శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇక ఈనెల 29 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువు కల్పించారు. బుధవారం సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌ నామినేషన్‌ వేయగా.. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థిగా కొంపెల్ల మాధవీలత నామినేషన్‌ దాఖలు చేయగా.. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ హాజరయ్యారు. అదే స్థానానికి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ నామినేషన్‌ వేశారు. మల్కాజ్‌గిరి స్థానానికి బీఆర్‌ఎస్‌ తరఫున రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్‌గా వేయగా.. మాజీ మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డి పాల్గొన్నారు. వరంగల్‌ పార్లమెంటు స్థానంలో అరూరి రమేశ్‌ (బీజేపీ), కడియం కావ్య (కాంగ్రెస్‌), సుధీర్‌కుమార్‌ (బీఆర్‌ఎస్‌); నల్లగొండలో కుందూరు రఘువీర్‌రెడ్డి (కాంగ్రెస్‌), కంచర్ల కృష్ణారెడ్డి (బీఆర్‌ఎస్‌), శానంపూడి సైదిరెడ్డి (బీజేపీ); భువనగిరిలో చామల కిరణ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌), క్యామ మల్లేశ్‌ (బీఆర్‌ఎస్‌); నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్‌ (బీజేపీ), టి.జీవన్‌రెడ్డి (కాంగ్రెస్‌), బాజిరెడ్డి గోవర్ధన్‌ (బీఆర్‌ఎస్‌); ఆదిలాబాద్‌లో గోడం నగేశ్‌ (బీజేపీ); ఖమ్మంలో సిటింగ్‌ ఎంపీ నామ నాగేశ్వరరావు (బీఆర్‌ఎస్‌); మెదక్‌లో వెంకట్రామిరెడ్డి (బీఆర్‌ఎస్‌), నీలం మధు (కాంగ్రెస్‌); జహీరాబాద్‌లో సురేశ్‌ షెట్కార్‌ (కాంగ్రెస్‌), గాలి అనిల్‌కుమార్‌ (బీఆర్‌ఎస్‌); పెద్దపల్లిలో శ్రీనివాస్‌ గోమాసే (బీజేపీ) నామినేషన్‌ వేసిన వారిలో ఉన్నారు.


‘కంటోన్మెంట్‌’కు సర్వే నామినేషన్‌

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థిగా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ నామినేషన్‌ దాఖలు చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిన శ్రీగణేశ్‌ను కాంగ్రె్‌సలో చేర్చుకొని.. ఆయనకే టికెట్‌ కేటాయించారు. ఇది నచ్చని సర్వే.. తానే రెబల్‌గా నామినేషన్‌ వేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ..తప్పుడు సర్వేలు జరిపించి, టికెట్‌ కేటాయింపు విషయంలో అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


మే 13న సెలవు: సీఈఓ

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మే 13న పోలింగ్‌ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు దినంగా ఎన్నికల ప్రధాన అధికారి వికా్‌సరాజ్‌ ప్రకటించారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలో, ఉప ఎన్నిక జరిగే కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు సెలవు రోజుగా నిర్ణయించామని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కాంట్రాక్టు, క్యాజువల్‌ పద్ధతిన పనిచేసే వారికి మే 13న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని సూచించారు. ఈ నిబంధనను అత్రికమించే సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలపై ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 135 ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Updated Date - Apr 25 , 2024 | 04:11 AM