Share News

నేడు మేడిగడ్డకు సీఎం, ఎమ్మెల్యేలు

ABN , Publish Date - Feb 13 , 2024 | 04:28 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళవారం మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లనున్నారు. సీఎంతో పాటు కాంగ్రెస్‌, మజ్లిస్‌, సీపీఐ సభ్యులు అసెంబ్లీ నుంచే మేడిగడ్డ పర్యటనకు బయల్దేరి వెళ్తారు. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమైన వెంటనే వాయిదా పడనుంది. అనంతరం సీఎం

నేడు మేడిగడ్డకు సీఎం, ఎమ్మెల్యేలు

మంత్రులు, ఎమ్మెల్సీలు కూడా..

అసెంబ్లీ నుంచి ఉదయం 10.15 గంటలకు బయలుదేరనున్న బస్సులు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళవారం మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లనున్నారు. సీఎంతో పాటు కాంగ్రెస్‌, మజ్లిస్‌, సీపీఐ సభ్యులు అసెంబ్లీ నుంచే మేడిగడ్డ పర్యటనకు బయల్దేరి వెళ్తారు. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమైన వెంటనే వాయిదా పడనుంది. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి సహా ప్రజాప్రతినిధులందరూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ఉదయం 10.15 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకల్లా మేడిగడ్డకు చేరుకుంటారు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు తదితర అంశాలపై సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజాప్రతినిధులకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ప్రజాప్రతినిధుల మేడిగడ్డ సందర్శన రెండు గంటల పాటు కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మేడిగడ్డ పర్యటన అసెంబ్లీ రికార్డుల్లో నమోదు కావడం కోసమే మంగళవారం శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి మేడిగడ్డకు తరలి వెళుతున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. మేడిగడ్డ సందర్శనకు రావాలంటూ కేసీఆర్‌ సహా 119 మంది సభ్యులనూ ఆహ్వానించినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీలు దూరం

మేడిగడ్డ పర్యటనకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ వెళుతుండగా.. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం వెళ్లడం లేదు. మేడిగడ్డ పర్యటనకు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లడం లేదంటూ బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కేఆర్‌ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై బీఆర్‌ఎస్‌ పార్టీ నల్లగొండలో భారీ బహిరంగసభ పెట్టుకున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు అక్కడికి వెళ్లనున్నారు. మజ్లిస్‌ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ప్రభుత్వ ఆహ్వానం మేరకు మేడిగడ్డ వెళుతున్నారు. అయితే ఏడుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు, ఇద్దరు ఎమ్మెల్సీల్లో ఒక్కరు వెళ్తున్నారు. ఇక సీపీఐ ఏకైక సభ్యుడు కూనంనేని సాంబశివరావు కూడా వెళుతున్నారు. అధికార, ప్రతిపక్షాలు మంగళవారమే నదీ జలాలకు సంబంధించి పోటీ కార్యక్రమాలు తలపెట్టడంతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. కృష్ణా జలాలపై నల్లగొండలో కేసీఆర్‌ సభను తలపెడితే.. సీఎం రేవంత్‌ మేడిగడ్డ పర్యటన పెట్టడం చర్చనీయాంశమైంది.

పర్యటన ఏర్పాట్లు పూర్తి

మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు సీఎం రేవంత్‌, ప్రజాప్రతినిధులు రానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి బృందం హైదరాబాద్‌ నుంచి బస్సుల్లో వస్తున్నందున పోలీస్‌, ఇంటెలిజెన్స్‌ బృందాలు భద్రతా చర్యలను ముమ్మరం చేశాయి. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతం కావడంతో భూపాలపల్లి నుంచి పంకెన, పలిమెల వరకు భారీగా బలగాలను మోహరించారు. గ్రేహౌండ్స్‌ బృందాలను రంగంలోకి దించి ముమ్మరంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

Updated Date - Feb 13 , 2024 | 04:28 AM