Share News

శివ పూజకు వేళాయె!

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:30 PM

శివరాత్రిని ఘనంగా జరుపుకునేందుకు జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. పలు ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

శివ పూజకు వేళాయె!

మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబు

మహేశ్వరంలో నేటినుంచి బ్రహ్మోత్సవాలు

9న శివ పార్వతుల కల్యాణం

జిల్లాలోని పలు ఆలయాల్లో ముమ్మర ఏర్పాట్లు

భారీగా హాజరు కానున్న భక్తులు

మహేశ్వరం, మార్చి 6 : శివరాత్రిని ఘనంగా జరుపుకునేందుకు జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. పలు ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు భారీగా భక్తులు హాజరు కానుండడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగానే కాకుండా కాకతీయుల కళాకండాలు కళ్లకుకట్టినట్లుగా కనువిందు చేసే స్థలంగా వెలుగొందుతున్న మహేశ్వరం శ్రీ శివగంగ రాజరాజేశ్వరాలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ప్రతీ యేటా మహాశివరాత్రి సందర్భంగా రాజరాజేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెల 7 నుంచి 11వరకు కొనసాగే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగసుందరంగా అలంకరించారు. మహేశ్వరం ప్రజలే కాకుండా జిల్లా నలుమూలలు, హైదరాబాదు తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాలకు తరలి రానున్నారు. ఆలయం ముందు ఉన్న వేప, రాగి మేడి రకాల త్రివృక్షం ఎంతో ప్రసిద్ధికి నిలయంగా మారింది.

బ్రహ్మోత్సవాలకు భారీగా ఏర్పాట్లు

మహేశ్వరం శ్రీ రాజరాజేశ్వరాలయం వద్ద ఐదు రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఆలయ నిర్వాహకులు, దేవాదాయశాఖ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్ధం ఆలయ ఆవరణలో చలువ పందిళ్ల్లు, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం, పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుద్ధీపాలతో అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం మహేశ్వరం, విథాని, షాద్‌నగర్‌, ఫలక్‌నుమా డిపోల నుంచి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాటు చేశారు.

బ్రహ్మోత్సవాల్లో కార్యక్రమాలిలా..

ఈ నెల 7 నుంచి 11 వ తేదీ వరకు కొనసాగే బ్రహ్మోత్సవాల వివరాలను ఆలయ ఈవో మురళీకృష్ణ, కమిటీ చైర్మన్‌ అల్లెకుమార్‌ వివరించారు. 7వ తేదీ గురువారం గణపతిపూజ, పుణ్యాహవచనము, ధ్వజారోహణం, 8వ తేదీ శుక్రవారం మహాశివరాత్రి రుధ్రాభిషేకం, అమ్మవారి కుంకుమార్చన, సహస్రనామార్చన, బిల్వార్చన, మంత్రపుష్పము, మంగళహారతి, తీర్థప్రసాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, 9వ తేదీ శనివారం రాజరాశ్వరస్వామి వారికి రుధ్రాభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చన, శివపార్వతుల కల్యాణోత్సవం, 10వ తేదీ ఆదివారం స్వామివారి రుద్రహోమం, రథోత్సవం, 11వ తేదీ సోమవారం లలిత సహస్రపారాయణం, దోపోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

200 మంది పోలీసులతో భారీ బందోబస్తు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామని మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆరుగురు సీఐలు, 30 మంది ఎస్సైలు, 164 మంది సిబ్బందితో శద్రతా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

సంజీవపురం వేంకటేశ్వరస్వామి దేవాలయంలో...

కొందుర్గు: వెంకిర్యాల శివారులోని సంజీవపురం వేంకటేశ్వరస్వామి దేవాలయంలో మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చెర్మన్‌ రామకృష్ణ తెలిపారు. ఈ నెల 7 గురువారం ఉదయం గణపతి పూజ, ధ్వజారోహణం, అఖండ దీపారాధన, స్వామివారికి అభిషేకం, 8న ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామివారికి అభిషేకాలు, అర్చన, శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దర్శనం, సాయంత్రం ఉపవాస విరమణ, రాత్రి 8 నుంచి భజన కార్యక్రమం, రాత్రి 12 గంటలకు శివపార్వతుల కల్యాణోత్సవం, 9న మహానైవేద్యం, ఉదయం 6 గంటల నుంచి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.

కొత్తూరు మండలంలో..

కొత్తూర్‌: మహాశివరాత్రికి కొత్తూరు మండలంలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. కొత్తూరు మున్సిపాలిటీలోని శివనగర్‌లో వెలసిన శ్రీకాశీవిశ్వనాథస్వామి దేవాలయంలో ఈ నెల 8న సుప్రభాతసేవ, గణపతిపూజ, ఏకదశరుద్రాబిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 6గంటలకు శివపార్వతుల కటద్యణం, పల్లకీసేవ, రాత్రి 12గంటలకు మహాలింగోద్భవ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 9న పంచామృతభిషేకం, సహస్రబిల్వర్చన అలంకరణ, మహామంగళహారతి, మంత్రపుష్పం, స్వస్తి వచనంతో ఉత్సవాలు ముగుస్తాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించనన్నుట్లు నిర్వహకులు తెలిపారు. ఉత్సవాలను పురస్కరించుకుని కాశీవిశ్వనాథస్వామి అలయాన్ని విద్యుత్‌ దీపాలంకరణతో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు.

నేటి నుంచి మైసిగండిలో బ్రహ్మోత్సవాలు

కడ్తాల్‌: కడ్తాల మండలం మైసిగండి శివరామాలయం మహశివ రాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా శ్రీ కాశీ విశ్వనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఇక్కడ అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. గురువారం నుంచి 9వ తేదీ వరకు కొనసాగే బ్రహ్మోత్సవాల కోసం మైసిగండి శివరామాలయాన్ని సర్వాంగ సుందరంగా, శోభాయామానంగా అలంకరించారు. మూడు రోజుల పాటు కొనసాగే మహాశివ రాత్రి ఉత్సవాలను తిలకించడానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారు.

బ్రహ్మోత్సవాల వివరాలు

మైసిగండి శివాలయం బ్రహ్మోత్సవాల వివరాలను ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ రామావత్‌ సిరోలి, ఈఓ స్నేహలతలు వివరించారు. గురువారం విఘ్నేశ్వర పూజ, ధ్వజారోహణం, స్వామివారి మహన్యాసక పూర్వ రుద్రాభిషేకం, 8న మహాశివరాత్రి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, లింగోధ్బవ కాలంలో శివపార్వతుల కల్యాణం, రథోత్సవం, 9న వసంతోత్సవం, అవబృతం,పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడు రోజుల పాటు రుద్రహోమం,నవగ్రహ హోమం,గణపతి హోమం నిర్వహిస్తామని చెప్పారు.సమయానుకూలంగా ధార్మిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

Updated Date - Mar 06 , 2024 | 11:30 PM