Share News

Kumaram Bheem Asifabad- విష ప్రయోగంతోనే పులి మృతి

ABN , Publish Date - Jan 09 , 2024 | 10:23 PM

కాగజ్‌నగర్‌ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో సోమవారం మృతి చెందిన పులి విషప్రయోగం వల్లనే చనిపోయినట్టు అటవీ శాఖ ఉన్నతాధికారులు తేల్చేశారు.

Kumaram Bheem Asifabad-   విష ప్రయోగంతోనే పులి మృతి
మృతి చెందిన మగపులిని పరిశీలిస్తున్న అధికారులు

- ఘటన స్థలాన్ని సందర్శించిన పీసీసీఎఫ్‌, ఎన్టీసీఏ బృందం

- పోస్టుమార్టం తర్వాత మృత కళేబరాల దహనం

- ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

కాగజ్‌నగర్‌/కాగజ్‌నగర్‌ టౌన్‌, జనవరి 9: కాగజ్‌నగర్‌ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో సోమవారం మృతి చెందిన పులి విషప్రయోగం వల్లనే చనిపోయినట్టు అటవీ శాఖ ఉన్నతాధికారులు తేల్చేశారు. కాగజ్‌నగర్‌ అడవుల్లో పెద్ద పులులు మృత్యువాత పడిన ఘటనపై మంగళవారం రాష్ట్ర పీసీసీఎఫ్‌(ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు) డోబ్రియాల్‌, సీసీఎఫ్‌(చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు) శాంతారాంతో పాటు ఎన్టీసీఏ(నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటి) సభ్యులు కాగజ్‌నగర్‌ సమీపంలో దరిగాం అడవుల్లో ఘటన స్థలాన్ని సందర్శించారు. పులులు మృత్యువాత పడిన పరిస్థితులు, ఇతర అంశాలను కూలంకుషంగా అధ్యాయనం చేశారు. శనివారం మృతి చెందిన రెండేళ్ల వయస్సు కలిగిన పులితో పాటు సోమవారం వెలుగులోకి వచ్చిన ఆరేళ్ల వయస్సు కలిగిన మగ పులి(ఎస్‌9) ఏ పరిస్థితుల్లో మరణించాయన్న దానిపై ఆధారాలు సేకరించారు. దరిగాం అటవీ ప్రాంతంలోని బురద మామిడి వద్ద మృతి చెందిన ఆరేళ్ల వయస్సు కలిగిన మగ పులి మెడకు ఉచ్చు ఉండటం గమనించారు. అయితే సమీపంలోనే ఓ ఆవు కళేబరం పడి ఉండటంతో, ఆవుపై విష ప్రయోగం చేసి పెద్దపులిని చంపి ఉంటారని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కాగా సోమవారం మృతి చెందిన పులికి మెడకు ఉచ్చు ఉన్నట్టు, ఇది వదులుగా ఉన్నట్టు అధికారులు తేల్చడంతో పక్కాగా విష ప్రయోగం వల్లే చని పోయందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతోనే విష ప్రయోగం జరిగిన అనుమానాలకు బలం చేకూరుతోంది. శనివారం మృతి చెందిన ఆడ పులి విష ప్రయోగంతోనే అనుమానాస్పద స్థితలో మృతి చెందిందని ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం కథనాలు ప్రచురితమయ్యాయి.

రాత్రి నుంచి గట్టి నిఘా..

సోమవారం దరిగాం బురదమామిడి వద్ద మగపులి చని పోవడంతో అటవీ శాఖ అధికారులు రాత్రి నుంచి నిఘా పెట్టారు. ఈ పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని అనుమతించలేదు. రాత్రే పోస్టుమార్టం చేసేందుకు ఏర్పాట్లు చేయగా, ఎన్టీసీఏ బృందం సభ్యుల సూచన మేరకు ఈ ప్రక్రియను చేపట్టలేదు. మంగళవారం ఉదయం రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులు, ఎన్టీసీఏ బృందం సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులపై అధ్యాయనం చేశారు. మహారాష్ట్ర నుంచి వాంకిడి వరకు ఉండే కారిడార్‌లో పులులు వరుసగా మృత్యువాత పడడంపై అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. క్షేత్ర స్థాయిలో విచారణకు దిగారు. దరిగాం, సర్కపల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరుగటం ఈ గ్రామాల వారిని కూడా వాకాబు చేశారు. పులి సమీపంలో ఉన్న ఆవు ఎవరిది..? ఎలా చని పోయింది..? అనే వివరాలు గ్రామస్థుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అలాగే పది కిలోమీటర్ల మేర సిబ్బంది జల్లెడ పడుతున్నారు. ఈ విషయంపై పీసీసీఎఫ్‌ డోబ్రియాల్‌ మాట్లాడుతూ దరిగాం అడవుల్లో మృతి చెందిన పులుల అవశేషాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కు పంపించామని చెప్పారు. పులులపై విష ప్రయోగం జరిగిందా.. లే దా అనే విషయం లాబ్యారేటరీ పరీక్షల తర్వాత వెల్లడిస్తామని తెలి పారు.. ప్రస్తుతం ప్రాథమిక విచారణలో విష ప్రయోగం జరిగినట్టుగా అనుమానిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే అన్నీ వివరాలను వెల్లడిస్తామన్నారు. ఇతర పులుల అన్ని కూడా సురక్షితంగా ఉన్నట్టు తెలిపారు. రెండు పులుల కళేబారాన్ని, ఆవు కళేబారాన్ని దహనం చేసినట్టు వివరించారు.

Updated Date - Jan 09 , 2024 | 10:23 PM