Share News

డిప్యుటేషన్ల రద్దు.. సర్కారు దవాఖానాలపై పిడుగు!

ABN , Publish Date - Feb 12 , 2024 | 02:37 AM

వైద్య ఆరోగ్యశాఖలో ఏళ్లుగా డిప్యుటేషన్స్‌ పేరుతో పాతుకుపోయిన వారిని సొంత ప్లేసులకు పంపాలన్న ప్రభుత్వ నిర్ణయం అభాసుపాలవుతోంది. రోగులకు అవసరం ఉన్న చోట డాక్టర్ల డిప్యుటేషన్లను రద్దు చేసి వారిని వెనక్కి పంపిస్తుండటంతో

డిప్యుటేషన్ల రద్దు..  సర్కారు దవాఖానాలపై పిడుగు!

పాత పోస్టులకు వెళ్లిపోయిన డాక్టర్లు

స్పెషలిస్టు వైద్యులు లేక నిలిచిన సేవలు

సాధారణ రోగులకు తీవ్ర ఇబ్బందులు

సిబ్బంది లేక స్తంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్స్‌

కొన్ని జిల్లాల్లో కలెక్టర్ల దిద్దుబాటు చర్యలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో ఏళ్లుగా డిప్యుటేషన్స్‌ పేరుతో పాతుకుపోయిన వారిని సొంత ప్లేసులకు పంపాలన్న ప్రభుత్వ నిర్ణయం అభాసుపాలవుతోంది. రోగులకు అవసరం ఉన్న చోట డాక్టర్ల డిప్యుటేషన్లను రద్దు చేసి వారిని వెనక్కి పంపిస్తుండటంతో కొన్ని ఆస్పత్రులలో అత్యవసర వైద్య సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యశాఖలో అన్ని రకాల డిప్యుటేషన్లను, వర్క్‌ఆర్డర్లను రద్దు చేస్తూ ఈనెల 7న ఆరోగ్యశాఖ కార్యదర్శి ఉత్తర్వ్యులిచ్చారు. డిప్యుటేషన్‌పై ఉన్నవారంతా ఫిబ్రవరి 8వ తేదీ సాయంత్రం వరకు తిరిగి తమ సొంత పోస్టింగ్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. దాంతో ఆ శాఖ పరిధిలోని వైద్య సిబ్బంది అంతా 8వ తేదీన తమ సొంత ప్లేసులలో రిపోర్టు చేశారు. అయితే, ఈ వ్యవహారం రోగుల ప్రాణాలమీదికొచ్చింది. పర్మినెంటు స్పెషలిస్టు వైద్యులు లేని ఆస్పత్రుల్లో డిప్యుటేషన్లపై పని చేస్తున్న డాక్టర్లు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో వెనక్కి వెళ్లిపోయారు. ఉదాహరణకు, ఖమ్మం ప్రభుత్వాస్పత్రి క్యాథ్‌ ల్యాబ్‌లో కార్డియాలజిస్టు ఇప్పటి వరకూ డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. ఆయన మంచిర్యాల మెడికల్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. తాజాగా సర్కారు డిప్యుటేషన్లను రద్దు చేయడంతో ఆయన మంచిర్యాలకు వెళ్లిపోయారు. దీంతో జిల్లా ఆస్పత్రిలో క్యాథ్‌ల్యాబ్‌ సేవలు నిలిచిపోయాయి. కార్డియాలజిస్టు లేకపోవటంతో హృద్రోగులు వ్యయప్రయాసలకోర్చి హైదరాబాద్‌ సర్కారు దవాఖానాలకు రావాల్సి వస్తోంది. మరోవైపు, తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ కేంద్రాల్లో పని చేసే ల్యాబ్‌ టెక్నీషియన్లు అందరూ కూడా డిప్యుటేషన్ల మీదనే ఉన్నారు. ఇప్పుడు వారంతా వెనక్కు వెళ్లిపోవడంతో టీ డయాగ్నస్టిక్స్‌ కేంద్రాల్లో సేవలు నిలిచిపోయే ప్రమాదం తలెత్తింది. దీంతో కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు వెంటనే స్పందించి.. ల్యాబ్‌ టెక్నీషియన్లు అదే ప్లేసులో కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. అయితే, ఇతర ప్రాంతాల్లో మాత్రం రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిప్యుటేషన్ల రద్దుతో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రితో ల్యాబ్‌ సేవలు, ఆదిలాబాద్‌ రిమ్స్‌లో హెల్ప్‌ డెస్క్‌ సేవలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్‌లో ఆదివాసీలు, గిరిజనులకు ఈ పరిణామం ప్రాణసంకటంగా మారింది.

ఆగమేఘాల మీద ఎఫ్‌ఎస్‌డీ

ఇదంతా ఒక కోణం కాగా, సర్కారు ఇచ్చిన డిప్యుటేషన్ల రద్దు ఆదేశాలను గంటల వ్యవధిలోనే ఉన్నాతాధికారులు తుంగలో తొక్కి, తమకు కావలసిన వారికి ఆగమేఘాలపై ఫారిన్‌ సర్వీస్‌ డిప్యుటేషన్‌ (ఎఫ్‌ఎ్‌సడీ) ఇవ్వటం మరో కోణం. ఈ మేరకు ఓ అధికారిణి ఉదంతం వైద్య ఆరోగ్య శాఖలో చర్చనీయాంశమైంది. ఖమ్మంలో మలేరియా ఆఫీసర్‌గా ఉన్న సదరు అధికారిణి.. కొన్నేళ్లుగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. ఇటీవల డిప్యుటేషన్స్‌ రద్దు అవుతున్నాయని తెలిసి, అదే రోజు ఆమె ఎఫ్‌ఎ్‌సడీ ఆర్డర్‌ తెచ్చుకొని జీహెచ్‌ఎంసీలోనే ఉండిపోయారు. ఆమెకు ప్రజారోగ్య సంచాలకులు ఎఫ్‌ఎ్‌సడీ ఆర్డర్‌ ఇవ్వటంపై వైద్యవర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఎఫ్‌ఎ్‌సడీ ఆర్డర్‌ రావాలంటే కనీసం 15-30 రోజుల సమయం పడుతుంది. ఒక్కరోజులోనే ఆగమేఘాలపై ఎఫ్‌ఎ్‌సడీ ఎలా ఇస్తారని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించాలని వారు కోరుతున్నారు. డిప్యుటేషన్‌పై పని చేసే వారికి వారి ఒరిజినల్‌ పోస్టు వద్ద వేతనం లభిస్తుంది కానీ, ఎఫ్‌ఎ్‌సడీ మీద ఉన్న వారికి పని చేసే చోటే వేతనం అందుతుంది.

నేడు డీహెచ్‌ కార్యాలయం వద్ద ఆందోళన

గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 317 జీవో తప్పిదం వల్ల వర్క్‌ ఆర్డర్స్‌ పుట్టుకొచ్చాయని, ఒక్క మెమోతో వాటన్నింటిని అఽధికారులు రద్దు చేశారని, 317 బాధితులకు న్యాయం చేయాలని, అప్పటివరకు డిప్యుటేషన్స్‌ కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ హెచ్‌ 1 యూనియన్‌ రాష్ట్ర కమిటీ సోమవారం డీహెచ్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని సంఘం నేతలు తెలిపారు.

Updated Date - Feb 12 , 2024 | 02:37 AM