జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులో దొంగలు పడ్డారు
ABN , Publish Date - Mar 06 , 2024 | 04:31 AM
సమయం తెల్లవారుజామున సుమారు 3:50 గంటలు! నలుగురు ముసుగు దొంగలు మూడంతస్తుల భవనంలోకి చొరబడ్డారు. లోపల, ప్రవేశ మార్గాల్లో సీసీ కెమారాలను ధ్వంసం చేశారు.

రంగారెడ్డి కార్యాలయంలోకి నలుగురు దుండగులు
గుర్తుపట్టకుండా ఉండేందుకు సీసీ కెమెరాల ధ్వంసం
హెచ్‌ఎండీఏ పరిధిలో ఖరీదైన భూముల
తాలూకు రికార్డులు ఎత్తుకెళ్లినట్లు అనుమానాలు
ఘటనపై ప్రభుత్వం సీరియస్.. రంగంలోకి పోలీసులు
ఆందోళన వద్దు.. డిజిటల్ రికార్డులు సేఫ్: అధికారులు
కరీంనగర్, భువనగిరిలోనూ ఇదే తరహా చోరీలు
హైదరాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): సమయం తెల్లవారుజామున సుమారు 3:50 గంటలు! నలుగురు ముసుగు దొంగలు మూడంతస్తుల భవనంలోకి చొరబడ్డారు. లోపల, ప్రవేశ మార్గాల్లో సీసీ కెమారాలను ధ్వంసం చేశారు. కొన్ని కెమెరాల దిశ మార్చారు. భవనం లోపలికి వెళ్లేందుకు ఉన్న గ్రిల్స్ తొలగించారు. తలుపులు పగులగొట్టి లోనికి చొరబడ్డారు. అయిదు వాల్యూమ్స్ రికార్డులు ఎత్తుకెళ్లారు. ఇదంతా.. భూముల రికార్డులు భద్రంగా ఉండాల్సిన రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగింది. కోకాపేట, శేర్‌లింగంపల్లి, మాధాపూర్, శంకరపల్లి ప్రాంతాల్లోని ఖరీదైన భూములకు సంబంధించిన 1969, 1973, 1974 సంవత్సరాలకు చెందిన కీలక రికార్డులను అపహరించారు. ఇటీవల జరిగిన ఈ వ్యవహారం సంచలనమైంది. విషయం తెలిసిన వెంటనే అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ తరహా నేరాలు జరగడంపై పోలీసు శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. విలువైన భూములకు సంబంధించిన రికార్డులను దొంగలించే ముఠాలు జిల్లాల్లోనూ ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కరీంనగర్, భువనగిరి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ రికార్డుల చోరీ జరిగింది. ఖరీదైన భూములకు సంబంధించిన దస్త్రాలను కార్యాలయాల్లో చొరబడి దొంగలించడం ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖలో సంచలనమైంది. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని సీరియ్‌సగానే తీసుకుంది. ఈ తరహా నేరాలకు పాల్పడే వ్యక్తులు ఎవరై ఉంటారనే దానిపై పోలీసు శాఖ ద్వారా లోతైన విచారణ చేపట్టింది. ఇందులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారా? లేక మరేదైనా అవసరాల కోసం దొంగతనాలు చేస్తున్నారా? లేక ఇందులో ఇతర కోణం ఏదైనా ఉందా అనే దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చోరీకి పాల్పడిన వారికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించేందుకు పోలీసులు వేలిముద్రలను సేకరించారు. కార్యాలయంలోని సీసీ కెమెరాల్లో ఆధారాలు లభించకపోయినా ఆ కెమెరాలను పట్టుకున్న వారి ఫింగర్‌ప్రింట్స్ తీసి ఇప్పటికే ముగ్గురిని గుర్తించినట్లు తెలిసింది. అలాగే రికార్డుల చోరీకి పాల్పడిన వారిని కార్యాలయం ఎదురుగా ఉండే భవనాల్లో, రహదారిలో ఉండే కెమెరాల ఆధారంగా వారి చిత్రాలను పోలీసులు సేకరిస్తున్నారు.
డిజిటల్ రికార్డులు సేఫ్
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫిజికల్ రికార్డులను దొంగలించినప్పటికీ అన్ని రికార్డులకు సంబంధించిన డిజిటల్ రికార్డులు భద్రంగానే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. రంగారెడ్డి జిల్లా పరిధిలో అన్ని డాక్యుమెంట్లను డిజిటలైజ్ చేసి ఉంచామని అన్నారు. ఇండెక్స్ రికార్డు, వేలిముద్రలకు సంబంధించిన రికార్డులు భద్రంగానే ఉన్నాయి. అయినా ఆ దొంగలు ఏయే డాక్యుమెంట్లు చోరీ చేశారు? వారు తీసుకెళ్లిన రికార్డుల అవసరం ఏమిటి? దీని వెనుక ఎవరున్నారు? అధికారుల ప్రమేయం ఏమైనా ఉందా? లేక బయటి వ్యక్తుల పనా? అనే కోణంలో కూడా రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.