Share News

వాళ్లకే వారంటీ లేదు.. గ్యారెంటీలు అమలవుతాయా?

ABN , Publish Date - Apr 03 , 2024 | 11:58 PM

వంద అబద్ధాలు.. ఆరు గ్యారెంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ముందుకొస్తోందని బీజేపీ శాసనసభపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జి, బెల్గాం శాసనసభ్యుడు అభయ్‌ పాటిల్‌ అన్నారు.

వాళ్లకే వారంటీ లేదు.. గ్యారెంటీలు అమలవుతాయా?
నల్లగొండలో మాట్లాడుతున్న బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు మహేశ్వర్‌రెడ్డి

హామీలు నెరవేర్చకుండా ఏ మొహంతో ఓట్లు అడుగుతారు

బీజేపీ శాసనసభపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

నల్లగొండ, కనగల్‌, ఏప్రిల్‌ 3: వంద అబద్ధాలు.. ఆరు గ్యారెంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ముందుకొస్తోందని బీజేపీ శాసనసభపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జి, బెల్గాం శాసనసభ్యుడు అభయ్‌ పాటిల్‌ అన్నారు. నల్లగొండ పట్టణంలో బుధవారం బీజేపీ మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ బండారు ప్రసాద్‌ అధ్యక్షతన బూత్‌ అధ్యక్షులు, కో-అర్డినేటర్లతో విజయసంకల్ప మహా సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండతో పాటు దేశంలో 400సీట్లు గెలిచి కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో మూడు కుటుంబాలు రాజ్యం ఏలుతున్నాయని, వారి కుటుంబ రాజకీయాలను కూకటి వేళ్లతో పెకిలిస్తామన్నారు. ఉద్యమాలకు పురిటి గడ్డగా పేరు గాంచిన నల్లగొండ నుంచే మార్పు మొదలు కావాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి రెండు పథకాలు మాత్రమే అమలు చేసి మొత్తం అమలు చేసినట్లుగా పత్రికల్లో గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను మరోసారి మభ్యపెడుతున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు, కోకపేట భూముల అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేసిన ఆయన, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ఇచ్చిన కమీషన్ల కారణంతోనే మౌనంగా ఉన్నారని ఆరోపించారు. 13 వారాల్లో రూ.13వేల కోట్ల అప్పు చేసి, కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తార ని వారు ప్రశ్నించారు. ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వారసత్వ రాజకీయాలను సమాధి చేయాల్సిన అవసరముం దన్నా రు. దేశంలో గెలిచే 400 సీట్లలో నల్లగొండ కూడా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. తాను బీజేపీలో చేరడం పూర్వ జన్మ సుకృతమన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రాంచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌, జిల్లా అఽఽధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, నాయకులు బొబ్బ భాగ్యరెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, వీరెళ్ళి చంద్రశేఖర్‌, నూకల నర్సింహ్మరెడ్డి, కంకణాల శ్రీధర్‌రెడ్డి, పోతెపాక సాంబయ్య, కంకణాల నివేదితారెడ్డి, కేలావత్‌ లాలూనాయక్‌, సాధినేని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ శాసనసభపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కనగల్‌ మండలంలోని చెర్లగౌరారంలో వరి పొలాన్ని పరిశీలించారు.

బీజేపీతోనే దేశాభివృద్ధి : బూర

మునుగోడు: కేంద్రంలో బీజేపీ హాట్రిక్‌ విజయం సాధిస్తుందని ఆ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. నల్ల గొండ జిల్లా మునుగోడులో బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. నరేంద్రమోదీ నాయకత్వంలో దేశంలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ప్రతిపక్షాలు చేసే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భువనగిరి ప్రాంతంలో తన హయాంలోనే అభివృద్ధి దిశగా అడుగులు పడ్డాయన్నారు. అన్నిరంగాలుగా అభివృద్ధి కోసం ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా నియామకమైన మండలంలోని ఇప్పర్తి గ్రామానికి చెందిన పులకరం సైదులుముదిరాజ్‌ను సన్మానించారు.

Updated Date - Apr 03 , 2024 | 11:58 PM