వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం పనుల పూర్తి
ABN , Publish Date - Feb 13 , 2024 | 03:55 AM
హనుమకొండలోని కాకతీయుల కాలం నాటి శ్రీరుద్రేశ్వర స్వామివారి వేయిస్తంభాల గుడి కల్యాణ మండపం పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ నెల 18న ప్రారంభోత్సవం నిర్వహించాలని కేంద్ర పురావస్తు శాఖ
18 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు పూర్వరూపం.. రూ.15 కోట్ల వ్యయం
18న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు.. హోంమంత్రి అమిత్ షా రాక
హనుమకొండ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): హనుమకొండలోని కాకతీయుల కాలం నాటి శ్రీరుద్రేశ్వర స్వామివారి వేయిస్తంభాల గుడి కల్యాణ మండపం పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ నెల 18న ప్రారంభోత్సవం నిర్వహించాలని కేంద్ర పురావస్తు శాఖ అధికారులు నిర్ణయించారు. ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతారని తెలుస్తోంది. వాస్తవానికి ప్రారంభోత్సవాన్ని మార్చిలో ప్రధాని మోదీతో నిర్వహించాలని మొదట నిర్ణయించారు. ఆలోగా లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉండడంతో ముందుగానే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. కల్యాణ మండపానికి శిల్పులు తుదిమెరుగులు దిద్దుతున్నారు. మండపం పనుల త్వరితగతిన పూర్తి చేసేందుకు స్థపతి బాలక్రిష్ణన్ శివకుమార్ నేతృత్వంలో తమిళనాడుకు చెందిన సుమారు 40 మంది శిల్పులు రేయింబవళ్లు శ్రమించారు.
అదే సాండ్‌బాక్స్ టెక్నాలజీతో...
వేయి స్తంభాల గుడి కట్టడం చెక్కు చెదరలేదు కానీ దానికి ఎదురుగా ఉన్న ఈ కల్యాణ మండపం మాత్రం శిథిలావస్థకు చేరుకుంది. ఇందుకు కారణం దాని కింది నుంచి ప్రవహించిన నీటి పాయ గా గుర్తించారు. నీటి ప్రవాహం వల్ల పునాదిలో ఇసుక తొలగిపోయి రాతి స్తంభాలు కుంగి మండపం క్రమం గా పక్కకు ఒరిగిపోవడం మొదలైంది. అలాగే వదిలేస్తే మండపం కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించారు. దీంతో కేంద్ర పురావస్తు శాఖ 18 ఏళ్ల కిందట పునర్నిర్మాణమనే మహాఘట్టానికి శ్రీకారం చుట్టింది. పనులు చేపట్టిన తర్వాత అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. నిర్మాణంలో అత్యంత సంక్లిష్టమైన సాండ్‌బాక్స్ టెక్నాలజీ వాడారు. అంటే ఇసుకనే పునాదిగా చేసుకొని నిర్మాణం చేపట్టారు. కేంద్ర పురావస్తు శాఖ నిబంధనల ప్రకారం పునర్నిర్మాణ పనుల్లో ఎక్కడా సిమెంట్, కాంక్రీట్, ఇనుము వాడలేదు. ఇసుక పునాదిపైనే కట్టడాన్ని తిరిగి నిలబెట్టారు.
కిషన్ రెడ్డి చొరవతో...
మండపం పునర్నిర్మాణ పనులు 2006లో మొదలై 2017 వరకు సజావుగానే సాగాయి. ఆ తర్వాత స్థపతికి బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల కుంటుపడ్డాయి. ఐదేళ్లపాటు అసలు పనులే జరగలేదు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పనుల్లో కదలిక వచ్చింది. స్థపతికి బిల్లుల చెల్లింపుల్లో ఏర్పడిన సమస్యను ఆయన పరిష్కరించారు. దీంతో పాటు చివరి దశ పనుల పూర్తికి అవసరమైన రూ.5 కోట్ల నిధులను కూడా విడుదల చేయించారు. కాగా, ఈ మండపాన్ని పరిశీలించేందుకు కిషన్ రెడ్డి మంగళవారం వస్తున్నారు.