మూడు రోజులుగా నీటిలోనే దేవాలయం
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:06 AM
నల్లగొండ పట్టణ పరిధిలోని పానగల్ సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయం, శివాలయం, మసీదు నీటిలో మునిగాయి.

నల్లగొండ రూరల్, జున్ 6: నల్లగొండ పట్టణ పరిధిలోని పానగల్ సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయం, శివాలయం, మసీదు నీటిలో మునిగాయి. అంజనేయస్వామి దేవాలయంలో మూడు రోజులుగా దేవాలయంలోని గర్భగుడిలో సాగానికి పైగానీరు నిండి, దీపారాదన చేయడానికి కూడా వీలులేకుండా పోయింది. దేవాలయానికి వచ్చే భక్తులు నీటిలోనే ప్రదిక్షణలు చేస్తున్నారు. ఈ విషయాన్ని మునిసిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో గురువారం ఉదయం మునిసిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మునిసిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ హమ్మద్ తదితరులు పంట పొలాలు, వరద నీటిని పరిశీలించారు. వరద ఒక్కసారిగా పొలాలపై ఎందుకు వచ్చిందో కారణాలు అడిగి తెలుసుకున్నారు. మసీదు కింది భాగంలోని కల్వర్టులో రైతులు వేసిన మట్టి తొలగించడంతో వరద నీరు ఒక్కసారిగా సమీపంలోని దేవాలయం మీదుగా రైతుల పంట పొలాల నుంచి స్థానికులు రైతులు పేర్కొంటున్నారు. రైతుల పొలాలతోపాటు, రోడ్డుపై పెద్దఎత్తున నీరు చేరడంతో నల్లగొండ నుంచి పానగల్ మీదుగా నకిరేకల్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించడంతో రోడ్డు కొట్టుకు పోయింది. ఈ వరద నీటితో రోడ్డు పక్కన ఉన్న ప్లాట్లు, పొలాలు కోతకు గురి కావడంతో తీవ్ర నష్టం కలుగుతుందని స్థానిక రైతులు అందోళన వక్తం చేస్తున్నారు. పై నుంచి వరదలు వరద కాల్వల గుండా వెళ్లకుండా కొంతమంది వరద కాల్వలను ఆక్రమించుకోవడంతో వరద నీరు పంట పొలాల మీదుగా పోతోందన్నారు. ఈ సమస్య ఇప్పటి కాదని, ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఉంటుందని స్థానికులు చెప్పారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని రైతులు, స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వరద నీరు పొలాలు, ప్లాట్లపై నుంచి నీరు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వరద నీరు పొలాల నుంచి రాకుండా చర్యలు తీసుకుంటాం
పానగల్ గ్రామ సమీపంలో వరద కాల్వల ద్వారా నీరు వెళ్లకుండా కొంత మంది అడ్డు కట్ట వేస్తాం. అంతేకాకుండా పై భాగం నుంచి వరద నీటు కిందకు రాకుండా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడాం. అదే విధంగా రోడ్డు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం చేపడతాం.
సయ్యద్ ముసాబ్ హమ్మద్, మునిసిపల్ కమిషనర్
దేవాలయాలు నీటిలో మునిగినా పట్టించుకోవడం లేదు
దేవాలయానికి చుట్టుపక్కన కొందరు వరద నీటి కాల్వలను అక్రమించుకోవడంతో ఆ వరద నీరు దేవాలయంలోకి చేరుకుంటుంది. ఆంజనేయస్వామి దేవాలయంలో మూడు రోజులుగా దేవాలయం నీట మునిగి ఉంది. మునిసిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.
కట్ట వెంకట్‌రెడ్డి, పానగల్.