Share News

TS: వడ దడ.. భారత వాతావరణ కేంద్రం కీలక హెచ్చరిక

ABN , Publish Date - May 03 , 2024 | 05:16 AM

రాష్ట్రంలో సూరీడు శివాలెత్తిపోతున్నాడు. ఎండలు, వడగాలుల తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. నాలుగు రోజుల క్రితం వరకు 45 డిగ్రీల మేర నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు గురువారం రికార్డు స్థాయిలో 46.6కు చేరుకున్నాయి. నల్లగొండ జిల్లా అనుముల(హాలియా) మండలం ఇబ్రహీంపేటలో గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత

TS: వడ దడ.. భారత వాతావరణ కేంద్రం కీలక హెచ్చరిక

15జిల్లాల్లో నేడు, రేపు వడగాలులు

భారత వాతావరణ కేంద్రం హెచ్చరిక

5 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

ఎండకు మిర్యాలగూడలో పగిలిన రోడ్డు

వడదెబ్బతో ఆరుగురి మృత్యువాత

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో సూరీడు శివాలెత్తిపోతున్నాడు. ఎండలు, వడగాలుల తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. నాలుగు రోజుల క్రితం వరకు 45 డిగ్రీల మేర నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు గురువారం రికార్డు స్థాయిలో 46.6కు చేరుకున్నాయి. నల్లగొండ జిల్లా అనుముల(హాలియా) మండలం ఇబ్రహీంపేటలో గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలంగాణ స్టేట్‌ డెవల్‌పమెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ (టీఎ్‌సడీపీఎస్‌) తెలిపింది. ములుగు జిల్లాలో 46.5, జగిత్యాల జిల్లా నేరెళ్ల, వెల్గతూర్‌, సూర్యాపేట జిల్లా మునగాల, నల్లగొండ జిల్లా నాంపల్లిలో 46.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబాబాద్‌, మంచిర్యాల జిల్లా జన్నారంలో 46.3, వరంగల్‌తోపాటు పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లి, నల్లగొండ జిల్లా కేతేపల్లి, చందంపేట, మాడ్గులపల్లిలో 46.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. సూర్యాపేట జిల్లా మట్టపల్లిలో 46.1, నల్లగొండ జిల్లా, త్రిపురారం, మునుగోడు, పెద్దపూర, నల్లగొండ, కట్టంగూరు, పెద్దపల్లి జిల్లా వీణవంకలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం జిల్లా పమ్మిలో 45.8, జనగామలో 45.6, రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 45.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కుమరం భీం జిల్లా తిర్మాణిలో 45.4 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామపట్నం, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురులో 45.3, హనుమకొండ, మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో 45.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ పరిధి కాప్రా నాచారంలో అత్యధికంగా 43.6 నమోదవ్వగా, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసరలో 44.3, వికారాబాద్‌ జిల్లా పుట్టపహాడ్‌లో 44.3, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 వరకు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 43 డిగ్రీలు ఉండవచ్చని టీఎ్‌సడీపీఎస్‌ పేర్కొంది. మరోవైపు, హైదరాబాద్‌ ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించిన గరిష్ఠ ఉష్ణోగ్రతలకు టీఎ్‌సడీపీఎస్‌ లెక్కలకు తేడా ఉంది. రాష్ట్రంలో గురువారం ఖమ్మంలో 45 డిగ్రీలు, భద్రాచలం 44.2, నిజామాబాద్‌, రామగుండంలో 44, నల్లగొండలో 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్‌ ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

నాలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక

తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఇటీవల ఒక్కసారి పెరిగిపోయాయని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) శాస్త్రవేత డాక్టర్‌ ఏ శ్రావణి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 15 జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. మరోవైపు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటిస్తూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. కాగా, రాష్ట్రంలో గురువారం సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన జిల్లాలో ఖమ్మం ప్రథమ స్థానంలో ఉంది. ఖమ్మం జిల్లాలో సాధారణం కంటే ఏకంగా 5.1 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. కొత్తగూడెం, హైదరాబాద్‌లో 3.1-5, హన్మకొండ, మెదక్‌, నల్లగొండ, నిజామాబాద్‌, రామగుండంలో 1.6-3డిగ్రీలు సాధారణం కంటే పెరిగాయని విశ్లేషించింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలో సాధారణంతో పోలిస్తే 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించింది.


మిర్యాలగూడలో సీసీ రోడ్డుకు పగుళ్లు

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల తీవ్రతకు స్థానిక సీతారాంపురం కాలనీలోని సీసీ రోడ్డు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక్క సారిగా పగిలిపోయింది. రెండు అడుగుల మేర రోడ్డు పగిలి పెచ్చులు పైకి లేచాయి.

వడదెబ్బతో ఆరుగురి మృతి

ఎండల తీవ్రతతో వడదెబ్బకు గురై రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆరుగురు గురువారం ప్రాణాలు కోల్పోయారు. నల్లగొండ జిల్లా తిప్పలమ్మగూడెంనకు చెందిన తోటజాన్‌రెడ్డి(60) , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చింతగుప్పకు చెందిన తోడెం వెంకటేష్‌(28), కరీంనగర్‌ జిల్లా లింగాపూర్‌కు చెందిన గజ్జెల సంజీవ్‌(48), ఆసిఫాబాద్‌ జిల్లా గబ్బాయి గ్రామానికి చెందిన పొరిశెట్టి శ్రీనివాస్‌(47), కామారెడ్డి జిల్లా కొండాపూర్‌కు చెందిన నీరడి ఎల్లవ్వ(50), మెదక్‌ జిల్లా కొల్చారం గ్రామానికి చెందిన కుమ్మరి శాఖయ్య(48) వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - May 03 , 2024 | 06:52 AM