వనమహోత్సవంలో లక్ష్యాన్ని పూర్తి చేయాలి
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:41 PM
మనమహోత్సవం కింద ఆయా శాఖలకు నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం వనమహోత్సవ కార్యక్రమంపై అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులు, మున్సిపాలిటీ కమిషనర్లు, ఎంపీడీఓలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ శశాంక
రంగారెడ్డి అర్బన్, జూలై 5 : మనమహోత్సవం కింద ఆయా శాఖలకు నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం వనమహోత్సవ కార్యక్రమంపై అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులు, మున్సిపాలిటీ కమిషనర్లు, ఎంపీడీఓలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2024లో 82.5 లక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా నిర్ధేశించామని తెలిపారు. వర్షాలు కురుస్తున్నాయని, భూమి పదునుగా ఉన్న సమయంలో మొక్కలు నాటాలని, నిర్ణీత గడువు లోపు లక్ష్యం పూర్తి చేయాలని సూచించారు. లక్ష్య సాధన కోసం అనువైన స్థలాలను గుర్తిస్తూ, మొక్కలు నాటడంతో పాటు జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని తెలిపారు. రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలతో పాటు, చెరువులు, ప్రభుత్వ స్థలాలు, కాలువ కట్టలపైనా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాలు, పట్టణాలలో ఇంటింటికీ పూలు, పండ్ల మొక్కలను అందజేయాలని సూచించారు. రానున్న మూడు వారాల్లోపు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా వందశాతం మొక్కలు నాటించాలని గడువు విధించారు. వనమహోత్సవ కార్యక్రమం ప్రగతి గురించి రోజు వారీగా నివేదికలు సమర్పించడంతో పాటు, వివరాలను వెంటవెంటనే ఆన్‌లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణతో ముడిపడిన వనమహోత్సవ కార్యక్రమానికి ప్రతీ ఒక్కరు ప్రాధాన్యతనిస్తూ లక్ష్యాల సాధనకై పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకుని తదనుగుణంగా అంకితభావంతో కృషి చేయాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా కార్యక్రమాలను రూపొందించిన సమయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని, గ్రామీణ ప్రాంతాలలో మండల ప్రత్యేక అధికారులను భాగస్వాములు చేయాలని కలెక్టర్ శశాంక సూచించారు. సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి సుధాకర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శ్రీలత, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టడంతో పాటు, అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సీజనల్ వ్యాధులపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా వచ్చే సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా, విషజ్వరాలు, మెదడువాపు వంటి వాటిని అరికట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ సంసిద్ధంగా ఉండాలని, వ్యాధుల పట్ల ప్రజలలో అవగాహన కల్పించాలని తెలిపారు. మున్సిపల్ పట్టణాలు, గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని, ఎక్కడైనా నీరు నిల్వ ఉండే చోట ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. దోమలు రాకుండా ఫాగింగ్ చేయాలని, ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ప్రతీరోజు జ్వరాలపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ సూచించారు. జ్వరం కేసులు వచ్చినట్లయితే వాటిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించి తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ప్రతీ శుక్రవారం ఫ్రైడే డ్రైడే నిర్వహించాలన్నారు. ఆర్బీఎస్‌కే బృందాలు జిల్లాలోని విద్యాసంస్థలను సందర్శించి పరిస్థితిని గమనించాలన్నారు. పాఠశాలలో సైన్స్ టీచర్ల ద్వారా విద్యార్థులకు వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, సీజనల్ వ్యాధులపై పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని విద్యాశాఖ అధికారికి సూచించారు. గ్రామాలలో ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ ప్రత్యేకాధికారుల ద్వారా తగు చర్యలు చేపట్టాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. మున్సిపాలిటీలలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో సీజనల్ వ్యాధులను అరికట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్ రావు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జడ్పీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్
జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ శశాంక శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జడ్పీ పాలకవర్గం పదవీకాలం పూర్తి కావడంతో కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్ జిల్లా పరిషత్‌కు చేరుకొని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, ఇతర అధికారులు కలెక్టర్ శశాంకకు స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు
.