Share News

రాష్ట్ర రాబడులు రూ.1.36 లక్షల కోట్లే..

ABN , Publish Date - Mar 01 , 2024 | 04:06 AM

రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర రెవెన్యూ రాబడులు సమకూరడం లేదు. 2023-24 సంవత్సర బడ్జెట్‌లో అన్ని రకాల రాబడుల కింద రూ.2,16,566 కోట్లు వస్తాయని అంచనా వేశారు. అయితే ఈ ఏడాది జనవరినాటికి రూ.1,36,859 కోట్లు మాత్రమే

రాష్ట్ర రాబడులు రూ.1.36 లక్షల కోట్లే..

జనవరి నాటికి 63 శాతమే వసూలు: కాగ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర రెవెన్యూ రాబడులు సమకూరడం లేదు. 2023-24 సంవత్సర బడ్జెట్‌లో అన్ని రకాల రాబడుల కింద రూ.2,16,566 కోట్లు వస్తాయని అంచనా వేశారు. అయితే ఈ ఏడాది జనవరినాటికి రూ.1,36,859 కోట్లు మాత్రమే సమకూరాయి. ఈ మొత్తం అంచనా రాబడుల్లో 63.20 శాతం మాత్రమే. ఈమేరకు రాష్ట్ర రాబడులు, వ్యయాలకు సంబంధించి జనవరి నివేదికను కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) గురువారం విడుదల చేసింది. జనవరినాటికి సమకూరిన 63.20 శాతం రాబడిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 2నెలల్లో (ఫిబ్రవరి,మార్చి) మిగతా 37% నిధులు సమకూరడం సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రూ.1,36,859 కోట్ల రెవెన్యూ రాబడుల్లో పన్ను రాబడి కిందే 1,10,442కోట్లు (72.42%) వచ్చాయి. ఇందులో జీఎస్టీ ద్వారా రూ.37,995 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.11,698 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.24,915 కోట్లు, రాష్ట్ర ఎక్సైజ్‌ సుంకాల కింద రూ.17,964 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.11,290 కోట్లు, ఇతర పన్నుల కింద రూ.6,577 కోట్లు సమకూరాయి. పన్నేతర రాబడి కింద రూ.22,808 కోట్లను అంచనా వేయగా జనవరినాటికి రూ.20,572 కోట్లు (90.20%), కేంద్రగ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద అంచనా వేసిన రూ.41,259 కోట్లలో రూ.5,844 కోట్లు(14.17%) సమకూరాయి. అప్పులకింద 40,852 కోట్లు వచ్చాయి. జనవరి నాటికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా రూ.1,72,121 కోట్ల వ్యయం చేసింది. రూ.2,49,209కోట్ల అంచనా వ్యయంలో ఇది రూ.69.07ు. వడ్డీ చెల్లింపులకు రూ.19,102 కోట్లు, ఉద్యోగుల వేతనాలు/భత్యాలకు రూ.32,650 కోట్లు, సర్వీసు పెన్షనర్లకు పెన్షన్ల కోసం 14,012 కోట్లు, వివిధ పథకాల సబ్సిడీలకు 7,620 కోట్లు వెచ్చించారు.

Updated Date - Mar 01 , 2024 | 10:19 AM