Share News

కాసుల రాజకీయం

ABN , Publish Date - Apr 26 , 2024 | 05:14 AM

రూ.1.35 లక్షల కోట్లు.. అక్షరాలా లక్షా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికల తతంగంగా..

కాసుల రాజకీయం

లోక్‌సభ ఎన్నికల ఖర్చు 1.2-1.35 లక్షల కోట్లు

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మించి వ్యయం..

ఇది ప్రపంచంలోనే అత్యధికం

2019లో ఒక ఓటుకు పెట్టిన ఖర్చు

రూ.700.. ఇప్పుడది రూ.1,400

పార్టీలు, అభ్యర్థులు, ఈసీ.. అందరి ఖర్చు ఇది

సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ చీఫ్‌ భాస్కర్‌రావు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25: రూ.1.35 లక్షల కోట్లు.. అక్షరాలా లక్షా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికల తతంగంగా.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ఖర్చు ఇది! గెలవడానికి అభ్యర్థులు వెదజల్లుతున్న డబ్బు.. అధికారం కోసం పార్టీలు కుమ్మరిస్తున్న డబ్బు.. ప్రభుత్వం, ఈసీ ఎన్నికల నిర్వహణకు ఖజానా నుంచి తీసి ఖర్చుచేస్తున్న డబ్బు.. ఇది! ప్రభుత్వం, పార్టీలు, అభ్యర్థులు, ఎన్నికల కమిషన్‌.. అందరూ కలిసి ప్రత్యక్షంగా, పరోక్షంగా చేస్తున్న వ్యయం!! మూడున్నర దశాబ్దాలుగా దేశంలో జరుగుతున్న ఎన్నికల ఖర్చును ఎప్పటికప్పుడు లెక్కగడుతున్న సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ (సీఎంఎస్‌-ఢిల్లీ) అధినేత ఎన్‌.భాస్కర్‌రావు పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించారు. ‘‘ఈసారి ఎన్నికల ఖర్చు రూ.1.2 లక్షల కోట్లు ఉంటుందని మేం ప్రాథమికంగా అంచనా వేశాం. కానీ.. ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు బహిర్గతమయ్యాక మా అంచనాలను రూ.1.35 లక్షల కోట్లకు పెంచాం’’ అని ఆయన వివరించారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించడానికి 3-4 నెలల ముందరి ఖర్చులను (పొలిటికల్‌ ర్యాలీలు, రవాణా, కార్యకర్తల ఖర్చు, సోషల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఇచ్చిన సొమ్ము, ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేయడానికి చేసిన ఖర్చు) కూడా పరిగణనలోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. పార్టీలు, అభ్యర్థులు రకరకాల మీడియాల్లో ప్రచారానికే తమ మొత్తం వ్యయంలో 30ు కేటాయిస్తున్నట్టు వివరించారు. ఒకప్పుడు భారతదేశంలో రాజకీయాలు సిద్ధాంతాలు, భావజాలాల ఆధారంగా జరిగేవని.. కానీ దాని స్థానంలో డబ్బు శక్తి పెరుగుతోందని భాస్కర్‌రావు తాను రాసిన ‘నెక్స్ట్‌ బిగ్‌ గేమ్‌ చేంజర్‌ ఆఫ్‌ ఎలక్షన్స్‌’ పుస్తకంలో పేర్కొన్నారు. చట్ట ప్రకారం అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై పరిమితి ఉన్నప్పటికీ ఆ నిబంధనలు ప్రభావవంతంగా అమలు కాకపోవడంతో దేశంలో కాసుల రాజకీయానికి అడ్డుకట్ట వేసే పరిస్థితి లేకుండా పోయింది. పార్టీలు, అభ్యర్థులు.. ఖర్చు పరిమితిని అధిగమించినా దొరక్కుండా తప్పించుకోవడానికి రకరకాల మార్గాలను అనుసరిస్తున్నట్టు భాస్కర్‌ రావు వివరించారు. సీఎంఎస్‌ లెక్కల ప్రకారమే.. 2019 ఎన్నికల్లో అయిన మొత్తం ఎన్నికల ఖర్చు రూ.60 వేల కోట్లలో దాదాపు 45ు బీజేపీ చేసిన వ్యయమే! 2024లో బీజేపీ ఖర్చు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.


రెండు దశాబ్దాల్లో ఆరు రెట్లు..

2019లో మనదేశంలో ఒక్కో ఓటుకూ అందరూ కలిసి చేసిన ఖర్చు రూ.700. ఇప్పుడు అది ఏకంగా రూ.1240 నుంచి రూ.1400కు చేరడం గమనార్హం. 1998లో లోక్‌సభ ఎన్నికల ఖర్చు రూ.9 వేల కోట్లు కాగా.. 2019 ఎన్నికల నాటికి ఆరు రెట్లు కావడం, ఆ తర్వాత ఐదేళ్లలో రెట్టింపు కావడం.. ఎన్నికల్లో పెరుగుతున్న ధనస్వామ్యానికి గుర్తని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

కార్పొరేట్‌ శక్తుల ప్రభావం

ఎన్నికల్లో కార్పొరేట్‌ శక్తుల ప్రభావం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. 2019 ఎన్నికల్లో 70 శాతం మంది అభ్యర్థులు కార్పొరేట్‌ ఆర్థిక సాయం ద్వారా ఎన్నికల్లో పోటీపడ్డవారే. 2014 ఎన్నికల్లో ఆ సంఖ్య 30 శాతం ఉండేది. కార్పొరేట్‌ శక్తుల నుంచి నిధులు సమకూరడంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వ్యక్తిగత రుణాల కోసం ఆధారపడే పరిస్థితి తగ్గిపోయింది. సొంత నిధులతో ఎన్నికల్లో పోటీ చేసే వారు 2014లో 25 శాతం ఉంటే 2019 ఎన్నికల్లో వీరి సంఖ్య 13 శాతానికి పడిపోయింది.


ఖర్చులో ఓటరుకు ఎంత?

అభ్యర్థులు, పార్టీలు, ఈసీ అందరూ కలిసి చేస్తున్న/చేసిన ఎన్నికల ఖర్చు భారీగా కనిపిస్తున్నా.. అందులో ఓటరుకు అందే వాటా కొంచెమే.

ఉదాహరణకు.. 2019 ఎన్నికలనే తీసుకుంటే మొత్తం రూ.60 వేల కోట్ల ఖర్చులో ఓటర్లకు చేరింది రూ.12-15 వేల కోట్లు. ప్రచారానికి చేసిన ఖర్చు రూ.20-25 వేల కోట్లు. రవాణా ఖర్చులు రూ.5-6 వేల కోట్లు కాగా.. మిగిలినవి ఇతరత్రా చిల్లరమల్లర ఖర్చులు.

రూ.2,994 కోట్లు దేశంలోని 32 ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీలు 2019లో అధికారికంగానే చేసిన ఎన్నికల ఖర్చు రూ.2,994 కోట్లు. అందులో రూ.529 కోట్లను ఆయా పార్టీలు తమ అభ్యర్థులకు ప్రచారఖర్చుగా ఇచ్చాయి.

Updated Date - Apr 26 , 2024 | 05:14 AM