Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతోనే పార్టీ ఓటమి

ABN , Publish Date - Mar 04 , 2024 | 03:45 AM

‘‘కొద్ది రోజుల పాలనలోనే.. కాంగ్రెస్‌ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది.

ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతోనే పార్టీ ఓటమి

కేసీఆర్‌ గెలవాలని ప్రజలు కోరుకున్నారు

ఓడిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఇంకా తగ్గలేదు

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దు

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే పోటీ

ఎల్‌ఆర్‌ఎస్‌ను విమర్శించి.. ఇప్పుడు అమలు

రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు చేపడతాం

బీఆర్‌ఎస్‌ శ్రేణులతో మాజీ సీఎం కేసీఆర్‌

12న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ

హైదరాబాద్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ‘‘కొద్ది రోజుల పాలనలోనే.. కాంగ్రెస్‌ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. త్వరలోనే రైతులు రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది’’ అని బీఆర్‌ఎస్‌ చీఫ్‌, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌స-బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన కరీంనగర్‌, పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్లకు చెందిన పార్టీ ముఖ్యులతో తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై సమాలోచనల చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌, బీజేపీలు పెద్ద ఎత్తున ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరదీసి బీఆర్‌ఎస్‌ నేతలను తమ పార్టీల్లోకి లాక్కొంటుండడంపై ఆయన మాట్లాడినట్లు తెలిసింది. పార్టీ కేడర్‌ను కాపాడుకోవడంపై సూచనలు చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించిన నేతలు ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతుండడంతో.. ఎవరికి చాన్స్‌ ఇవ్వాలి? అనేదానిపైనా సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేసీఆర్‌ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవొద్దు. ఆ ఎ న్నికల్లో కేసీఆర్‌ గెలవాలని, తమ ఎమ్మెల్యేలు మాత్రం ఓడిపోవాలని ప్రజలు కోరుకున్నారు. దాంతో.. మొదటికే మోసం వచ్చింది. ఓడిపోయిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఇప్పటికీ తగ్గలేదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓటమితో కుంగిపోవడం, విజయంతో పొంగిపోవడం అనే అలవాటు బీఆర్‌ఎస్‌కు లేదు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అంతా కలిసికట్టుగా పనిచేయాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు చేపడతామని, నియోజకవర్గ స్థాయి నేతలు మండలస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని, కార్యాచరణను కొనసాగించాలన్నారు. ఈ నెల 12న కరీంనగర్‌లోని ఎస్‌.ఆర్‌.ఆర్‌ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. కరీంనగర్‌ స్థానంలో బీఆర్‌ఎస్‌ విజయఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఎన్టీఆర్‌ నేతృత్వంలోని టీడీపీ 1989లో ఓటమిపాలైనా.. 1994లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుపొందింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మనం వంద కు పైగా స్థానాలను సాధిస్తాం. బీఆర్‌ఎస్‌ ఎంతోమంది నేతలను తయారు చేసింది. అధికారంలో లేకపోవడంతో కొందరు నేతలు అటూఇటూ పోవచ్చు. క్యాడర్‌ మాత్రం అలాగే ఉంటుంది.

ఆ క్యాడర్‌ను కాపాడుకోవాలి’’ అని సూ చించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ నేతలు ఎల్‌ఆర్‌ఎ్‌సపై విమర్శలు చేశారని.. ఇప్పుడు మాత్రం ఆ స్కీమ్‌ను అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే.. కాంగ్రెస్‌ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేయాలని డిమాం డ్‌ చేశారు. కాంగ్రెస్‌ సర్కారు నీళ్లు, వి ద్యుత్తు ఇవ్వడం లేదని ఆరోపించారు. మిడ్‌మానేరులో సమస్యలు వస్తే తాము తక్షణమే మరమ్మతులు చేశామని, ప్రాజెక్టుల్లో సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సీనియర్‌ నేతలు టి.హరీశ్‌రావు, బి.వినోద్‌కుమార్‌, గంగుల కమలాకర్‌, సంతో్‌షకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం, మానుకోటపై నేడు సమావేశం

మాజీ సీఎం కేసీఆర్‌ సోమవారం ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు.

Updated Date - Mar 04 , 2024 | 06:56 AM