Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

మేడిగడ్డ పునరుద్ధరణపై పాత పాటే

ABN , Publish Date - Mar 03 , 2024 | 04:28 AM

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ/మరమ్మతుల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. బ్యారేజీని పునరుద్ధరించాలంటే మళ్లీ ఒప్పందం చేసుకోవాల్సిందేనని నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ తేల్చిచెప్పింది.

మేడిగడ్డ పునరుద్ధరణపై పాత పాటే

ఒప్పందం చేసుకుంటేనే పనులు చేపడతామని,

బకాయిలన్నీ చెల్లించాలని నిర్మాణ సంస్థ లేఖ

ఈఆర్‌టీ ఫలితాలు ఇవ్వడానికి కూడా నిరాకరణ

హైదరాబాద్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ/మరమ్మతుల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. బ్యారేజీని పునరుద్ధరించాలంటే మళ్లీ ఒప్పందం చేసుకోవాల్సిందేనని నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ తేల్చిచెప్పింది. బ్యారేజీలోని ఏడో బ్లాకుపై ఎలకో్ట్ర రెసిస్టివిటీ టెస్ట్‌లు (ఈఆర్‌టీలు) జనవరి 4 నుంచి 9వ తేదీ మధ్య జరిగాయి. దాని ఫలితాలు ఇవ్వడానికి కూడా నిర్మాణ సంస్థ నిరాకరించింది. బ్యారేజీ నిర్మాణం కోసం 2016 ఆగస్టు 26న ఒప్పందం జరిగిందని, నీటిపారుదల శాఖ ఇచ్చిన ఆదేశాలు, డిజైన్లు, డ్రాయింగ్‌ల ఆధారంగా నిర్మాణం చేపట్టామని, 2020 జూన్‌ 29 నుంచి బ్యారేజీ డిఫెక్ట్‌ లయిబిలిటీ కాలం మొదలై 2022 జూన్‌ 29 నాటికి (రెండేళ్లు) పూర్తయిందని, 2021 మార్చి 15న బ్యారేజీ పనులు పూర్తయినట్లు సంబంధిత అధికారులు సర్టిఫికెట్‌ ఇచ్చారని ఎల్‌ అండ్‌ టీ ఇదివరకే గుర్తు చేసింది. కాఫర్‌ డ్యామ్‌ కట్టాలంటే రూ.55.75 కోట్లు అవుతుందని, ఆ మేరకు ఒప్పందం చేసుకుంటేనే పనులు చేస్తామని స్పష్టం చేసింది.

ఇక పెండింగ్‌ బిల్లుతో పాటు బ్యాంకు గ్యారంటీల కింద రూ.456.07 కోట్లు విడుదల చేయాలని కూడా ఇదివరకే ప్రభుత్వాన్ని కోరింది. మేడిగడ్డ పునరుద్ధరణ/మరమ్మతులు చేపట్టాలంటే దానికన్నా ముందు కాఫర్‌ డ్యామ్‌ ను బ్యారేజీ ఎగువ, దిగువ భాగంలో కట్టాల్సి ఉంది. దీని నిర్మాణానికే రెండు నెలల దాకా పట్టనుంది. ఈలోగా జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) కూడా బ్యారేజీని పరిశీలించి, నివేదిక ఇస్తే పునరుద్ధరణ పనులు జరగాల్సి ఉంటుంది. అయితే ఏటా జూన్‌లోనే గోదావరికి వరదలు ప్రారంభమవుతాయి. జూలైలో వరద తీవ్రస్థాయికి చేరుతుంది. ఈలోగా మరమ్మతులు, పునరుద్ధరణ చేయకపోతే బ్యారేజీకి జరగరాని నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎన్‌డీఎ్‌సఏ కమిటీ నివేదికే పునరుద్ధరణ/మరమ్మతులకు ప్రామాణికం కానుంది. అయితే ఈ పనులు చేపట్టడానికి నిర్మాణ సంస్థ నిరాకరిస్తుండటంతో ప్రభుత్వం మరో సంస్థకు బాధ్యతలు అప్పగించే అవకాశాలు లేక పోలేదని సమాచారం.

Updated Date - Mar 03 , 2024 | 07:26 AM