Share News

విద్యార్థినుల మృతిపై వీడని మిస్టరీ!

ABN , Publish Date - Feb 06 , 2024 | 04:24 AM

భువనగిరి ఎస్సీ హాస్టల్‌ విద్యార్థినుల అనుమానాస్పద మృతిపై ఇంకా మిస్టరీ వీడలేదు. విద్యార్థునిలిద్దరిది హత్యా? ఆత్మహత్యా? అనేది ఇంకా తేలలేదు. బాలికల పోస్టుమార్టం సమయంలో తీసిన నమూనాలు, వారి సూసైడ్‌ నోట్‌గా చెబుతున్న లేఖలకు సంబంధించి ఫోరెన్సిక్‌

విద్యార్థినుల మృతిపై వీడని మిస్టరీ!

హత్యా? ఆత్మహత్యా? అనేదానిపై సస్పెన్స్‌.. ఫోరెన్సిక్‌ నివేదిక వస్తేనే దర్యాప్తు ముందుకు

ఆటోడ్రైవర్‌ జోక్యమే ప్రాణాలు తీసిందా?

తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు

వార్డెన్‌, ఆటోడ్రైవర్‌ సహా.. ఆరుగురిపై అనుమానాలు

పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం.. బాలికల ఒంటిపై గాయాల్లేవు: పోలీసులు

నల్లగొండ/భువనగిరి టౌన్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): భువనగిరి ఎస్సీ హాస్టల్‌ విద్యార్థినుల అనుమానాస్పద మృతిపై ఇంకా మిస్టరీ వీడలేదు. విద్యార్థునిలిద్దరిది హత్యా? ఆత్మహత్యా? అనేది ఇంకా తేలలేదు. బాలికల పోస్టుమార్టం సమయంలో తీసిన నమూనాలు, వారి సూసైడ్‌ నోట్‌గా చెబుతున్న లేఖలకు సంబంధించి ఫోరెన్సిక్‌ నివేదిక వస్తేగానీ, ఏమీ చెప్పలేమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చాకే దర్యాప్తు ముందుకు సాగుతుందంటున్నారు. అయితే.. హాస్టల్‌ నిర్వహణలో లోపాలు.. ఆటోడ్రైవర్‌ మితిమీరిన జోక్యంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం రాత్రి విద్యార్థినులిద్దరూ విగతజీవులుగా కనిపించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే..! వారి తల్లిదండ్రులు పోలీసులకు వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదుల్లో.. ఆ మరణాలపై అనుమానాలున్నాయని, వాటిని ఆత్మహత్యలుగా చూడవద్దని కోరారు. విద్యార్థినులు రాసినట్లుగా చెబుతున్న సూసైడ్‌ నోట్‌పైనా అనుమానాలను వ్యక్తం చేశారు. దాంతో.. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఆటోడ్రైవర్‌ జోక్యమే కారణమా?

ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఆటోడ్రైవర్‌ అతి జోక్యం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా ఆటోడ్రైవర్‌ జోక్యం వల్ల ఓ సిబ్బంది బదిలీ కూడా జరిగిందని పేర్కొన్నారు. సదరు ఆటోడ్రైవర్‌ కూరగాయల సరఫరా మొదలు.. విద్యార్థినులను స్కూలుకు, పలు సందర్భాల్లో షాపింగ్‌కు తీసుకెళ్లడం, ఉద్యోగులు, సిబ్బందిని తరలించడం.. ఇలా హాస్టల్‌ విషయంలో అన్నీ తానై చూసుకునేవాడనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో విద్యార్థినులతో ఆటోడ్రైవర్‌ తరచూ గొడవ పడేవాడని, అతనిపై ఫిర్యాదు చేసినా.. అధికారులు చర్యలు తీసుకునేవారు కాదని తెలుస్తోంది. ఆటో డ్రైవర్‌తోపాటు.. వార్డెన్‌, ట్యూటర్‌, పీఈటీ, వంటమనిషి, నైట్‌ వాచ్‌మన్‌.. ఇలా సిబ్బందిని విచారిస్తున్నట్లు పోలీసులు వివరించారు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక మేరకు చనిపోయిన బాలికల ఒంటిపై గాయాలు లేవని చెప్పారు. ఈ ఘటన జరిగాక.. హాస్టల్‌లోని వందమందికి పైగా విద్యార్థినులు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అదే భవన సముదాయంలో ఉన్న బీసీ హాస్టల్‌లోని విద్యార్థినులు కూడా ఖాళీ చేయడంతో.. ప్రస్తుతం ఆ ప్రాంగణమంతా బోసిపోయి కనిపిస్తోంది. విద్యార్థినుల అనుమానస్పద మృతిపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేయాలని జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం వారు విద్యార్థినుల హాస్టల్‌ గదిని పరిశీలించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 06 , 2024 | 04:24 AM